పరువు పోయాక పదవి వచ్చింది!
ఎట్టకేలకు జనసేనకే వైజాగ్ డిప్యూటీ మేయర్;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-05-20 09:10 GMT
నిన్న టీడీపీ ఝలక్‌తో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
ఈరోజు 59 మంది సభ్యుల హాజరుతో పదవి దక్కింది.
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల డుమ్మాతో వాయిదా పడిన విశాఖ డిప్యూటీ మేయర్ పదవి ఎట్టకేలకు జనసేనకు దక్కింది. జనసేనతో పొత్తును అపహాస్యం చేస్తూ టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు టీడీపీ అధిష్టానానికి చేరింది. అటు నుంచి ఆ పార్టీ నాయకులకు అక్షింతలు వేయడంతో వీరు దారికొచ్చారు. దీంతో విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వ్యవహారం జనసేన పరమైంది.
అవిశ్వాస తీర్మానం ద్వారా నెల రోజుల క్రితం వైసీపీ మేయర్‌ను దించేసిన టీడీపీ, జనసేన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు టీడీపీ కార్పొరేటర్‌కు ఆ పదవిని కట్టబెట్టారు. అప్పట్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం కోసం టీడీపీకి జనసేన నేతలు/ కార్పొరేటర్లు బేషరతుగా మద్దతునిచ్చారు. కొన్నాళ్లకు డిప్యూటీ మేయర్‌ను కూడా అలాగే పదవీచ్యుతులను చేశారు. అప్పుడూ జనసేన కార్పొరేటర్లు టీడీపీకి అండగా నిలిచారు. అయితే మేయర్ పదవి టీడీపీ ఇవ్వడంతో డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది. అయితే వీరి డిమాండ్‌కు టీడీపీ నేతలు, కార్పొరేటర్లు సుముఖత వ్యక్తం చేయకుండా డిప్యూటీ మేయర్ పదవిని కూడా తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతూ వచ్చారు. పైగా కొంతమంది కార్పొరేటర్ల పేరును కూడా తెరపైకి తెచ్చారు. ఖంగుతిన్న జనసేన కార్పొరేటర్లు అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి తమ అభ్యర్థిగా 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పేరును ప్రకటించింది. సోమవారం ఈ పదవికి ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల అధికారి, జేసీ మయూర్ ఆశోక్ జీవీఎంసీ సమావేశ మందిరానికి వచ్చారు. అయితే కోరానికి 56 మంది సభ్యులు అవసరం కాగా 54 మందే హాజరవడంతో మంగళవారానికి వాయిదా వేశారు.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరైన సభ్యులు
రంగంలోకి లోకేష్ దిగడంతో..
రాష్ట్రంలో టీడీపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేనకు టీడీపీ సభ్యులే ఝలక్ ఇవ్వడం, మరో 17 మంది టీడీపీ కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు (ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే) గైర్హాజరవడం పెను దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సీరియస్ అయినట్టు తెలిసింది. పొత్తు ధర్మానికి తూట్లు పొడవకుండా మంగళవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరానికి సరిపడేలా సభ్యులు హాజరయ్యేలా చూడాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు సమాచారం. దీంతో వీరు సోమవారం రాత్రి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మంగళవారం కూడా కోరం చాలకపోతే మరోసారి పరువు పోతుందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి తొలిరోజు డుమ్మా కొట్టిన కార్పొరేటర్లకు నచ్చజెప్పారు.
59 మంది హాజరుతో గట్టెక్కిన జనసేన..
మంగళవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశోక్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు 59 మంది (సోమవారం నాటికంటే ఐదుగురు అధికంగా) సభ్యులు హాజరయ్యారు. దీంతో జనసేన అభ్యర్థి దల్లి గోవిందరాజు ఎన్నికైనట్టు ప్రకటించారు. దీంతో హమ్మయ్యా! అంటూ జనసేన నేతలు ఊపిరి పీల్చుకున్నారు.