ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా విజయవాడ నగరంలో నిర్మాణ రంగం కుదేలైంది. రోజువారీ పనికోసం కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏమి పనులు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి కూలీలు నెట్టివేయబడ్డారు. చాలా మంది వేరే జిల్లాల నుంచి వలస వచ్చిన వారే ఈ అడ్డా కూలీల్లో కనిపిస్తారు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకుందామంటే ముందుగా వారికి అడ్రస్ ఫ్రూఫ్ ఉండాలి. అడ్రస్ ఫ్రూఫ్ కావాలంటే తహసిల్దార్ వద్దకు వెళ్లి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దాని ఆధారంగా తాము ఇక్కడే ఉంటున్నామనే అడ్రస్‌ను వాలంటీర్‌కు తెలియజేయాలి. అప్పడు కాని సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. వాలంటీర్ అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆ తరువాత ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా మార్చుకోవాలి. తహసిల్దార్ ఇచ్చిన అడ్రస్ ఫ్రూఫ్ ద్వారా అడ్రస్ మార్చుకోవచ్చు. ఇవన్నీ పూర్తయితే కాని వాలంటీర్‌కు తమ గురించి వివరించుకుని తాము ఏ సంక్షేమ పథకాలకు అర్హులమో వారి ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే సాయం అది. ఇప్పుడు కావాల్సిది రోజు వారీ పని. ప్రతి రోజూ పని లేకుండా ఇల్లు ఎలా గడుస్తుందని ప్రశ్నిస్తున్నారు అడ్డా కూలీలు.
బెంజ్ సర్కిల్ అతి పెద్ద అడ్డా..
విజయవాడలోని బెంజ్ సర్కిల్. సోమవారం ఉదయం 9గంటల ప్రాంతం. చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారికి తూర్పువైపు సర్వీస్ రోడ్డు జనంతో కిటకిట లాడుతోంది. వీరంతా అడ్డా కూలీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనుల కోసం ఎవరైనా పిలువక పోతారా అంటూ ఎదురు చూస్తుంటారు. నేను నా స్నేహితుడు కలిసి నేరుగా వారి మధ్యకు బైక్‌పై వెళ్లాము. నలుగురైదుగురు వెంటనే చుట్టు ముట్టారు. సార్.. ఏమైనా కూలీలు కావాలా.. ఏమి పనిసార్ అంటూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఏపనీ లేదయ్యా.. ఊరకే వచ్చామని వారికి నచ్చజెప్పి ఒక ఫోటో తీద్దామని సెల్‌ఫోన్‌లో క్లిక్ మనిపించా. మరో ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. సార్ వీడియో తీస్తున్నారా? అన్నారు. లేదయ్యా ఫొటో తీస్తున్నా.. అన్నాను. ఎక్కడైనా పనుంటే చెప్పండి సార్. అంటూ మాట్లాడటం మొదలు పెట్టారు. మీరు టౌన్‌లో ఉండే వాళ్లేనా.. ఎక్కడి నుంచైనా వచ్చారా... అని అడిగాను. టౌన్‌లో ఉండే వాళ్లమే సార్. ఊళ్ల నుంచి రావాలంటే ఉదయన్నే అన్నం వండుకుని తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచైతే ముందుగా మాట్లాడుకుని పని చేయించుకునే వాళ్ల దగ్గరకు క్యారేజ్ తీసుకుని వెళ్లొచ్చు. అందుకనే చాలా మంది ఇక్కడి వాళ్లే ఉంటారు సార్ అన్నారు. మీరెక్కడ ఉంటారని ప్రశ్నించాను. రాణీగారి తోటలో ఉంటానన్నాడు. మీ పేరేంటని ప్రశ్నిస్తే రాజయ్య అన్నాడు. ఇంటిపేరు ఏంటని అడిగితే కూరాకుల అని చెప్పాడు. విజయవాడ సొంతూరా అని అడిగితే కాదు సార్ ప్రకాశం జిల్లా కనిగిరి అని చెప్పాడు. అతని మాటల్లో నైరాశ్యం కనిపిస్తోంది. ఈ రోజు పని దొరికేట్టు లేదనే బాధ కూడా ఉంది. వందల మంది ఉన్నారు. ఇంత మందికి ప్రతిరోజూ పని దొరుకుతుందా అన్నాను. ఎక్కువ మందికి దొరుకుతుంది సార్. మేస్త్రీలు వస్తే ఒకే సారి ఐదారుగ్గురిని పనికి పిలుచుకుపోతాడు. ఎవరన్నా ఇంట్లో పనికోసం, హోటళ్లలో పనుల కోసం ఒక్కరిని పిలిస్తే ఏమి పని చేయాలో తెలుసుకుంటాం. అందరికీ ఆ పనులు రాకపోవచ్చు. మాలోని వారిలో ఎవరికైనా ఆపని వచ్చిన వారు ఉంటే చెప్పి పంపిస్తామన్నాడు.
విజయవాడలోని వన్‌టౌన్, గాంధీనగర్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు, గుణదల, ఏలూరు రోడ్డులోని చుట్టగుంట, తాడిగడప, పోరంకి, కృష్ణలంక వంటి ప్రాంతాల్లో నివసించే కూలీలు తమ అడ్డాలకు ఉదయాన్నే వస్తారు. నగరంలో సుమారు 30 ప్రాంతాల్లో కూలీల అడ్డాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద అడ్డా పెద్దది. ఇక్కడికి వచ్చే వారికి పనులు త్వరగా దొరుకుతాయి. ఇక్కడ కూర్చునేందుకు ఎటువంటి సౌకర్యం ఉండదు. కాళ్లపై నిలబడాల్సిందే. మధ్యాహ్నం వరకు పని దొరకలేదంటే ఆశ వదులుకోకుండా ఫైఓవర్ నీడలో అక్కడక్కడా కూర్చుంటారు. గంతంలో కూర్చునేందుకు అవకాశం ఉండేదని, ఇప్పడు వంతెన కింద ఇరువైపుల ఇనుప కంచె వేసి లోపలి భాగంలో మొక్కలు నాటటం వల్ల కూర్చునే వీలు లేకుండా పోయిందని కూలీలు చెబుతున్నారు. ప్రతి రోజూ వందల మంది ఇలాగే పనుల కోసం పరుగులు తీస్తూ కనిపిస్తుంటారు.
కూలి పనులు కూడా నగరాల్లో దొరకడం లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరొక వ్యక్తి మందాడి కిశోర్ మాట్లాడుతూ ఏడాదిలో ఒక్కసారి 17వేలు డబ్బులిస్తే సరిపోతుందా? ఈ మధ్యలో కుటుంబం ఎలా బతకాలి. నాకు ముగ్గురు పిల్లలు. నేను ఏదో ఒక పనిచేస్తేనే కాని ఇల్లు గవదు. ఇక్కడికి వస్తే ఇడ్లీ బండ్ల వద్ద పనిచేసేందుకు కొందరు పిలుచుకు వెళతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తే మూడొందలిస్తారు. అలా కాకుండా అపార్ట్‌మెంట్స్ కట్టే పని బాగుంటే రోజుకు రూ 500 నుంచి 600 ఇస్తారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్స్ కట్టే పనులు ఉండటం లేదు. కాంట్రాక్టర్లకు ఇసుక దొరకడం లేదని పనులు మధ్యమధ్యలో ఆపుతున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మందిమి బిల్లింగ్ పనులు చేసే వాళ్లమే ఉన్నామన్నారు.
విజయవాడలో రోజు వారీ కూలి పనులు చేసుకునే వారు సుమారు 12 వేల నుంచి 15వేల వరకు ఉంటారు. వీరంతా కృష్ణలంక, వన్‌టౌన్, రైల్వే స్టేషన్ ఏరియాల్లో ఎక్కువగా నివశిస్తున్నారు. చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉంటూ ఉదయాన్నే ఆడవాళ్లు ఇండ్లల్లో అంట్లుతోమి ఊడ్చే పనులకు వెళ్లగా మగవాళ్లు ఎక్కువగా హోటళ్లలో ప్లేట్లు, కప్పులు కడిగే పనులు, సప్లై పనులకు వెళుతుంటారు. వీరందరికీ పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తాము సంక్షేమ పథకాలు ఎవ్వరూ అమలు చేయనంతగా చేస్తున్నామని చెబుతున్నా అన్‌స్కిల్డ్ కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని కూలీలే స్వయంగా చెబుతున్నారు. స్కిల్డ్ వర్కర్లకు కూడా కావాల్సిన పనులు ఉండటం లేదు. ప్రభుత్వం ఏదో ఒక పని చేయిస్తే అక్కడ కూలీలు తప్పకుండా అవసరమవుతారు. కానీ ఐదేళ్లలో ప్రభుత్వం చేయించే పనులు ఎక్కడా లేవని కూలీలు చెప్పడం విశేషం.