Actor Posani arrested | రాజా.. ఆస్పత్రికి పోయి వస్తా రాజా...
అదేం కుదరదు. వారంట్ ఉంది. సహకరించండని నటుడు పోసాని కృష్ణమురళీని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-26 17:26 GMT
ప్రముఖ నటుడు, వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళీ అన్నమయ్య జిల్లా పోలీసులు బుధవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని రాయచోటి సహా రాజంపేట, అనంతపురం తో సహా అనేక పోలీస్ స్టేషన్లో 50 కేసులు నమోదయ్యాయి.
సీఎం ఎన్ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూటమి మంత్రులపై నటుడు పోసాని మురళీకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సమయంలో నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపి కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాతో పాటు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో ఎన్డీఏ కూటమి నేతలపై దూషణలతో కూడిన వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే.
వైసిపి నాయకుడిగా పనిచేసిన పోసాని మురళీకృష్ణ పై కూడా రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ కోవలో అన్నమయ్య జిల్లా (ఉమ్మడి కడప జిల్లా) రాయచోటి తో పాటు రెవిన్యూ డివిజనల్ కేంద్రమైన రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా పోసాని కృష్ణమురళీపై కేసులు నమోదయ్యాయి.
సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.
సినిమాను తలపించిన సీన్
నటుడు పోసాని కృష్ణమురళి (మురళీకృష్ణ) ని హైదరాబాద్ గచ్చిబౌలిలో రాయచోటి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. రాయచోటి సర్కిల్ పరిధిలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భక్తవత్సలం సారధ్యంలోని బృందం బుధవారం హైదరాబాద్కు చేరుకుంది.
గచ్చిబౌలిలోని రాయదుర్గం లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో పోసాని నివాసానికి వెళ్లిన సంబేపల్లి ఎస్సై భక్తవత్సలం సారిధ్యంలోని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నోటీసులు ఇచ్చారు.
నాకు ఆరోగ్యం బాగాలేదు రాజా..
అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో నటుడు పోసాని నివాసానికి చేరుకున్నారు. అప్పటికి టీ షర్ట్, షార్ట్ ధరించి ఉన్న పోసాని పోలీసులను బతిమాలడం కనిపించింది. నాకు సర్జరీ అయింది రాజా.. ట్రీట్మెంట్ తీసుకొని వస్తా అని పోలీసులను అభ్యర్థించారు.
సార్ మీ పైన అరెస్ట్ వారెంట్ ఉంది.. దయచేసి సహకారం అందించండి అని పోలీసులు పోసానికి సూచించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసులు సెల్ఫోన్లో రికార్డ్ చేస్తున్నట్లు కూడా పోసానికి చెప్పారు.
సినిమా స్టైల్ లో..
అనుమతి లేకుండా ఎలా వచ్చారు? అనీ నటుడు పోసాని అన్నమయ్య జిల్లా పోలీసులను ప్రశ్నించారు. దీనికి సమాధానం గా ఎస్ ఐ భక్తవత్సలం "సార్ కేసు నమోదు అయిన తర్వాత ఎక్కడికైనా వేస్తాం. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వచ్చే అరెస్ట్ చేస్తాం" పోలీసులకు అహక్కు ఉందని ఎస్ఐ భక్తవత్సలం వైసిపి నేత, నటుడు పోసానికి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆయన నివాసంలో దాదాపు అరగంటకు పైగానే పోలీసులతో నటుడు పోసాని మధ్య ఆసక్తికర చర్చ సాగింది.
" ఓ దశలో పోలీసులతో మాట్లాడుతున్న గిర్రుమని తిరిగి వీడియోకు ఫోజు ఇచ్చిన నటుడు పోసాని సినిమా స్టైల్" ప్రదర్శించారు.
ఆ తర్వాత నటుడు పోసాని భార్యకు నోటీసు ఇచ్చిన అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోసానిని రాయచోటికి తీసుకు వస్తున్నారు.
అంతకుముందు పోసాని నివాసంలో హైడ్రామా సాగింది. నోటీసులు వద్దు. నేను తీసుకోను. నువ్వు (భార్యను ఉద్దశించి) కూడా తీసుకోవద్దు. అంటూ పోసాని ఇంట్లోనే పోలీసులకు సినిమా సీన్ చూపించారు. కిచెన్ లో డైనింగ్ టేబుల్ వద్ద ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నాకు వద్దు. అంటూ నింపాదిగా టిఫిన్ చేయడానికి కూర్చునేందుకు పోసాని యత్నించారు. టిఫిన్ చేయాలని పోసాని భార్య కోరినా ఎస్ఐ తిరస్కరించి, నోటీస్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పడిన సన్నివేశం రక్తికట్టించింది. సార్.. నోటీస్ తీసుకోండి అనేది ఎస్ఐ వినతి. నాకు వద్దు అని పోసాని మంకుమట్టు. చేసేది లేక. ఇక నేను ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. నోటీస్ తీసుకోండి సార్. అని ఎస్ఐ భక్తవత్సలం నానా కష్టాలు పడిన సన్నివేశం కూడా నవ్వులు పూయించినట్లే కనిపించింది.