త్వరలో విజయవాడకు ఏసీఏ

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ త్వరలో విజయవాడకు మారనుంది. ఐదేళ్లుగా విశాఖపట్నంలో ఉన్న హెడ్‌ ఆఫీస్‌ టీడీపీ రాకతో విజయవాడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది.

Update: 2024-08-16 06:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యకలాపాలు అక్టోబరు నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన క్రికెట్‌ అసోసియేషన్‌ ఇకపై టీడీపీకి అనుకూలంగా వ్యవహరించనుంది. ఐదేళ్ల క్రితం వరకు ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా వ్యవహరించిన క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక్కసారిగా రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షులుగా నూతన పాలకవర్గం వచ్చేనెల 8 తరువాత కొలువు తీరనుంది. ఇప్పటికే కొత్త పాలకవర్గంలో ఎవరు ఉండాలనే అంశంపై మంత్రి లోకేషన్‌ ఒక నిర్ణయానికి వచ్చారు. పోటీకి రెడీగా ఉండాలని పోటీ దారులకు ఇప్పటికే హింట్‌ అందించారు. గత పాలకవర్గంలో ఆరుగురు రాజీనామా చేయడంతో కొత్త కమిటీ ఎన్నికలకు అవకాశం ఏర్పడింది. వచ్చే నెల 8న ఏసీఏ పాలకవర్గానికి గుంటూరు కేంద్రంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్, స్థానిక సంస్థల మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నియమితులయ్యారు.

అమరావతిలో ఏసీఏ కార్యాలయం?
రాజధాని అమరావతి ప్రాంతంలో ఏసీఏ నూతన కార్యాలయానికి 2.50 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిఆర్‌డిఎ రెడీగా ఉంది. ఈ మేరకు సీఎం సీఆర్‌డీఏకు సూచించినట్లు సమాచారం. అమరావతిలో స్థలం తీసుకుని ఏసీఏ కార్యాలయ నిర్మాణం చేపడతారా? లేకుంటే ప్రస్తుతం విజయవాడలోని గాంధి నగర్‌లో ఉన్న కార్యాలయంలో కార్యకలాపాలు మొదలు పెడతారా అనేది ఇంకా ఏసీఏ వారు తేల్చలేదు. నూతన కమిటీ బాద్యతలు తీసుకున్న తరువాత వారి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందని అసోసియేషన్‌లోని వారు చెబుతున్నారు. ఎప్పటి నుంచో విజయవాడలోని గాంధీనగర్‌లో ఏసీఏకు పరిపాలనా భవనం ఉంది. అయితే అది అధునాతన సౌకర్యాలతో లేదని క్రికెట్‌ అసోసియేషన్‌ వారు చెబుతున్నారు. పెయింట్‌ వేస్తే ప్రస్తుతానికి కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదనేని కొందరు చెబుతున్నారు.
ఏసీఏ కార్యాలయం ఏర్పాటు విషయంలో మరో ప్రతిపాదన కూడా ఉంది. మంగళగిరిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి స్టేడియం వద్ద ఏనిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా క్రికెట్‌ అసోసియేషన్‌ వారిలో ఉంది. ఇక్కడ స్టేడియం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, క్రీడాకారులకు కూడా ఎటువంటి సౌకర్యాలు కావాల్సి వచ్చినా అందుబాటులో ఉంటాయనే ఆలోచనలో కూడా ఉన్నారు. పరిపాలనా కార్యాలయానికి, స్టేడియానికి సంబంధం లేనందున ఎక్కడ ఉన్నా ఒకటేనని ఏసీఏ ఉద్యోగులు భావిస్తున్నారు.
మొదటి నుంచీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆదిపత్యం క్రికెట్‌ అసోసియేషన్‌లో కొనసాగింది. ఆయన సొంత డబ్బును కొంతవరకు విరాళంగా ఇచ్చి మొదట్లో కార్యకలాపాలు కొనసాగించారు. ఉద్యోగులు కూడా ఆయన రెకమెండ్‌ చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కమిటీలు మారినా ఉద్యోగుల్లో అభద్రతా భావం ఉండకూడదని, ఇప్పటి వరకు ఉద్యోగుల విషయంలో రాజకీయాలు ఎంటర్‌ కాలేదు. గంగరాజు కూడా ఈ విషయంలో నిక్కచ్చిగానే ఉన్నారు.
ఉండవల్లి వద్ద ఏసీఏకు 9ఎకరాల స్థలం ఉంది. ఇందులో నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అసోసియేషన్‌లో ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొత్త కమిటీ వచ్చే వరకు ఆగాల్సిందేనని అసోసియేషన్‌లోని సీనియర్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తమకు గవర్నమెంట్‌ ఉద్యోగం కంటే ఏసీఏలో ఉద్యోగంపై ఎక్కువ భరోసా ఉందని, అయితే కొత్త పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోందని కొందరు సీనియర్‌ ఉద్యోగులు చెప్పటం విశేషం.
Tags:    

Similar News