ఏసీఏ నూతన అధ్యక్షులుగా కేశినేని శివనాథ్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రమేష్ కుమార్, ప్రకటించారు
Byline : G.P Venkateswarlu
Update: 2024-09-08 14:51 GMT
అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్
కార్యదర్శిగా సానా సతీష్ బాబు
పోటీ చేసిన అన్ని పదవులూ ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి
వరద బాధితుల సహాయార్థం ఏసీఏ తరపున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన అధ్యక్షుడు శివనాథ్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలకవర్గం ఆదివారం కొలువు దీరింది. ఎన్నికల్లో ఒక్కో పదవికి ఒకరు మాత్రమే నామినేషన్ వేయడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని), ఉపాధ్యక్షుడిగా పి. వెంకట రమణ ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీగా పి.విష్ణు కుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డి. గౌర్ విష్ణు తేజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సాధారణ సమావేశంలో ఏసీఏ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు
.వరద బాధితుల సహాయార్థం రూ. కోటి విరాళం
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ఏసీఏ తొలి నిర్ణయంగా రూ. కోటి విరాళాన్ని ఏసీఏ తరపున అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిమామం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌కు వసతులు కల్పిస్తాం. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా ఉంది, భవిష్యత్తులో మంగళగిరితో పాటు మరిన్ని జిల్లాల్లోనూ జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.