ఆంధ్రలో ‘అ..ఆ’

ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.;

Update: 2025-07-06 12:24 GMT

‘అ..ఆ’ అనగానే అందరికీ 2016లో విడుదలైన తెలుగు సినిమా గుర్తుకొస్తుంది. మాటల మాంత్రికుడుగా పేరొందిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ అ..ఆ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌ హీరో, హీరోయిన్లుగాను, నటుడు నరేష్, నదియా, ఈశ్వరీరావు, రావు రమేష్‌ వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్‌నుతో పాటు అన్ని రకాల ప్రేక్షకులను రక్తి కట్టించింది. దీనిలో కథానాయకుడి పేరు ఆనంద్‌ విహారీ. కథానాయికి పేరు అనసూయ రామలింగం. అక్షరాలు పక్క పక్కనే ఉన్నా.. అనసూయ రామలింగంలోని ‘అ’, ఆనంద్‌ విహారిలోని ‘ఆ’(హీరో..హీరోయిన్లు) కలవడానికి ఇంత సమయం పట్టిందా అని పని మనిషి క్యారెక్టర్‌లో ఉన్న ఓ అమ్మాయి చేత చెప్పించిన డైలాగ్‌ తర్వాత వెండి తెరపై అ..ఆ అనే సినిమా టైటిల్‌ పడుతుంది. తర్వాత సినిమా అసలు కథలోకి దర్శకుడు ప్రేక్షకులను తీసుకెళ్తాడు.

అయితే ప్రస్తుతం ఇక్కడ చెబుతున్న ‘అ..ఆ’ అనేది సినిమా కాదు. ఓ అక్షర కార్యక్రమం. నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చే అద్భుతమైన కార్యక్రమం. వయోజనులకు అక్షరాలు దిద్దించి వారిని చదవరులుగా మార్చే కార్యక్రమం. దీని పూర్తి పేరు ‘అక్షర ఆంధ్ర’. షార్ట్‌ కట్‌లో అ..ఆగా పిలుస్తారు. ప్రాజెక్టు అక్షర పేరుతో ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించనున్నారు.
మోటో ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం అక్షరాస్యతను సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 81లక్షల మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు. 81లక్షలు అంటే రాష్ట్ర జనాభాలో 17 శాతం. వీరంతా 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్లే. వీరికి అక్షరాలు రావు. చదవలేని పరిస్థితి ఉంది. వీరితో అక్షరాలు దిద్దించి వీరిందనీ అక్ష్యరాస్యులుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
అక్షరాస్యత రేటు ఏపీలో
ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు తక్కిన రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువుగా ఉంది. 72.6 శాతంగా అక్షరాస్యత ఉండగా.. స్త్రీ అక్షరాస్యత 59.15శాతంగా ఉంది. ఇది దేశ అక్షరాస్యత కంటే చాలా తక్కువ. దాదాపు 20కి పైగా రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందు ఉన్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు కూడా ఏపీ కంటే ముందు వరుసలోనే ఉన్నాయి. నిత్యం ఉగ్రవాదుల సమస్యలతో సతమతమవుతున్న జమ్మూ కశ్మీర్‌ కూడా 82 శాతం లిటరసీ రేటుతో ఏపీ కంటే చాలా ముందుంది. ఆఖరుకు మొన్నటి వరకు కలిసే ఉన్న తెలంగాణ కూడా 76.9 శాత అక్షరాస్యతతో ఏపీ కంటే ముందు వరుసలో ఉంది.
Tags:    

Similar News