మార్క్‌ శంకర్‌పై అనుచిత పోస్టులు..ఓ యువకుడు అరెస్టు

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంక్‌ ఇటీవల సింగపూర్‌ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడు.;

Update: 2025-04-16 12:42 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు మీద ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మార్క్‌ శంకర్‌పై అనుచిత పోస్టులు పెడుతున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వీటిపైన దర్యాప్తు చేపట్టారు. మార్క్‌ శంకర్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పొట్టపాశం రఘు ఆలియాస్‌ పుష్పరాజ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతను కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్, పవన్‌ కల్యాణ్‌ల మధ్య జరిగిన సోషల్‌ మీడియా వార్‌లో పుష్పరాజ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ అయిన పుష్పరాజ్‌ అల్లు అర్జున్‌కు మద్దతు తెలుపుతూ పవన్‌ కల్యాణ్‌ కుటుంబంపై పుష్పరాజ్‌ ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మార్క్‌ శంకర్‌పై పుష్పరాజ్‌ అనుచిత పోస్టులు పెట్టాడు. అయితే పుష్పరాజ్‌ గతంలో కూడా మహిళలను కించపరిచే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడనే విషయాన్ని పోలీసులు గుర్తించారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. నిందితుడు రఘు ఆలియాస్‌ పుష్పరాజ్‌ 5 మొబైల్స్‌ వినియోగించాడు. దాదాపు 14 మెయిల్‌ ఐడీలను వాడేవాడు. వీటి ఆధారంగా సోషల్‌ మీడియా వేదికైన ఎక్స్‌లో లాగిన్‌ అయ్యేవాడు. అతని పోస్టులన్నీ పరిశీలించిన తర్వాత, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడంతో పాటు పుష్పరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సీ సతీష్‌కుమార్‌ తెలిపారు.

అయితే ఇటీవల సింగపూర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌ రెండో కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించారు. ఈ విషయం తెలియగానే పవన్‌ కల్యాణ్‌తో పాటు అతని అన్నయ్య చిరంజీవి దంపతులు హుటాహుటిన సింగపూర్‌ వెళ్లారు. అరోగ్యం కుదుటపడిన తర్వాత మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మర్క్‌ శంకర్‌ కోలుకుంటున్నాడని సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి వెల్లడించారు.
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్‌ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌తో పాటు మరి కొందరి పిల్లలను సురక్షితంగా కాపాడిన భారత దేశానికి చెందిన సింగపూర్‌ వాసులను సింగపూర్‌ ప్రభుత్వం సత్కరించింది. అగ్ని ప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్‌ శంకర్‌ ప్రాణాలతో బయటపడటంతో అతడి తల్లి, పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నా తిరుమల తిరుపతికి వెళ్లి స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు.
Tags:    

Similar News