కోలాహలంగా నరహరి గిరి ప్రదక్షిణ !

ఏడాదికోసారి ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణకు జనులు పోటెత్తారు.. వరాహ లక్ష్మీ నారసింహుని అనుగ్రహం కోసం తపించిపోతున్నారు.;

Update: 2025-07-09 12:27 GMT
తొలిపావంచా వద్ద పుష్పరథానికి జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తున్న అశోక్‌ గజపతిరాజు

ఏడాదికోసారి వచ్చే సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటారు. ఆ పరమ పవిత్ర దినం నాడు సింహగిరి వరాహ లక్ష్మీ నరసింహుని గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోర్కెలు తీరుతాయని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే గిరి ప్రదక్షిణకు లక్షల సంఖ్యలో భక్తజనం పాల్గొని పరవశించి పోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగున ఉన్న ఒడిశా, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ నుంచి భక్తులు వస్తుంటారు. 32 కిలోమీటర్ల మేర బుధ, గురువారాల్లో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు అనూహ్య రీతిలో పోటెత్తారు. ఆయా ప్రాంతాల నుంచి ఊళ్లకు ఊళ్లే జన సందోహం తరలి వచ్చారు. సాధారణంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. కానీ ఈ ఏడాది బుధవారం ఉదయం నుంచే భక్తులు స్వచ్ఛందంగా గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టేశారు. విశాఖ వీధులన్నీ సింహాద్రి నాథుని నామస్మరణ, సంకీర్తనలతో మర్మోగిపోతున్నాయి.


సింహాచలంలో పుష్పరథ యాత్ర

గిరి ప్రదక్షిణ ఇలా..
బుధవారం మధ్యాహ్నం సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచా వద్ద నుంచి సింహాద్రినాథుని నమూనా విగ్రహంతో ఉన్న పుష్పరథం ప్రారంభమైంది. ఈ రథాన్ని ఆలయ అనువంశింక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. జై సింహాద్రి అప్పన్నా,, జై వరాహ లక్ష్మీనారాయణ అంటూ ఈ రథం వెంట లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. తొలిపావంచా నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్‌ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం, పాత గోశాల జంక్షన్ల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో 32 కి.మీల గిరి ప్రదక్షిణ పూర్తవుతుందన్న మాట. గిరి ప్రదక్షిణ జరిగే బుధ, గురువారాలు రెండు రోజులూ ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. సుగంధ్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) శ్రీగంధాన్ని స్వామికి సమర్పిస్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పించారు. వేకువజామున మూడు గంటల నుంచి ఆలయ వెలుపల నుంచి భక్తులను ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఉత్తర, దక్షిణ గోపురాల వద్ద ర్యాంపులను ఏర్పాటు చేశారు. గురువారం వేకువజామున 5 గంటల నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు.

హనుమంతవాక నుంచి అడవివరం వెళ్లే బీఆర్‌టీఎస్‌ రోడ్డులో గిరిప్రదక్షిణ

స్వచ్ఛందంగా ప్రసాద వితరణ..
గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం సేవా ధృక్పథం ఉన్న అనేక మంది స్వచ్ఛందంగా ఉచిత ప్రసాదాలు అందజేస్తారు. 32 కిలోమీటర్ల దారి పొడవునా అడగడుగునా టెంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్లు, మజ్జిగ, పండ్లు, ఫ్రూట్‌సలాడ్లు, ఫలహారాలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వేడి బాదంపాలు, బిస్కెట్లు.. ఇలా ఒకటేమిటి మరెన్నింటినో అపరిమితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే.. కాలినడకతో అలసిపోయిన వృద్ధులు, మహిళలకు ఉపశమనం కలిగించేందుకు స్వచ్ఛంద పాదసేవకులూ అందుబాటులో ఉంటారు. వీరంతా పాదసేవకు పోటీ పడతారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణలోనూ ప్రసాద వితరణతో పాటు పాదసేవకులూ తమ సేవలను అందించడానికి పోటీపడుతున్నారు. వీరిలో వృద్ధులు, మహిళలు, యువతీ యువకులు, విద్యావంతులు ఉన్నారు.

వీధుల్లో గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం 

ఏర్పాట్లు ఇలా చేశారు..
ఇక గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ దారిలో ఉండే పాఠశాలలు, కల్యాణ మండపాల్లో 14 చోట్ల విశ్రాంతి సదుపాయం కల్పించారు. అక్కడ మంచినీరు, మరుగుదొడ్లను సమకూర్చారు. 13 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది గిరి ప్రదక్షిణ చేసి సింహాచలేశుని 88 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వేచి ఉండే భక్తులకు దద్దోజనం, కదంబం అందిస్తున్నారు. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు 40 కౌంటర్లు, 100 ఇనుప గడ్డర్లను సిద్ధం చేశారు. మరోవైపు బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి నుంచి సిటీలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
ఐదారు లక్షల మంది వస్తారని అంచనా..
ఈసారి గిరి ప్రదక్షిణకు ఐదారు లక్షల మంది భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, ఆరు కంట్రోల్‌ రూమ్‌లు, ఐదు చోట్ల పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటిని 18 నెట్‌వర్కింగ్‌ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. 18 అంబులెన్సులను సిద్ధంగా ఉంచి యాంటీ వీనమ్‌ను అందుబాటులో ఉంచారు. 109 చోట్ల 400 తాత్కాలిక మరుగుదొడ్లు, 120 శాశ్వత మరుగుదొడ్లు, ప్రతికూల ప్రాంతాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ఇంకా 750 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. అప్పుఘర్‌ వద్ద ఐదు బోట్లను, 60 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ఇంకా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. ఈ రెండు రోజులూ మద్యం దుకాణాలను మూసివేయించారు. భక్తుల కోసం 50 ఉచిత బస్సులను సమకూర్చారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించడం కోసం తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగించడం ఈసారి గిరి ప్రదక్షిణ ప్రత్యేకత.
సర్వసన్నద్ధత ఇలా..
జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. మూడు వేల మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీస్, వైద్య, విద్యుత్, రెవిన్యూ, జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఏ అవసరం వచ్చినా 1800–4250–0009, 0891–2507225 టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు.
Tags:    

Similar News