ధ్వని కాలుష్యంపై ప్రత్యేక చట్టం తేవాలి
2000లో కేంద్రం ధ్వని కాలుష్యంపై తెచ్చిన చట్టంలో తగిన మార్పులు చేసి అమలు చేయాలని పలువురు వక్తలు కోరారు.;
By : The Federal
Update: 2025-09-01 13:35 GMT
తమిళనాడు ప్రభుత్వం ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మతాలకు అతీతంగా అన్ని ప్రార్థనా మందిరాలలో మైకులు 55 డెసిబుల్స్‌కు మించకుండా వినియోగించాలని, డీజే సౌండ్స్ కూడా అతి తక్కువ స్థాయిలో వినియోగించాలని, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనాన్ని పెంపొందించాలని, వ్యక్తిగత వాహనాలను తగ్గిస్తూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను పెంచాలని కోరారు.
గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ధ్వని కాలుష్యం నివారణపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వైద్యులు, సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎస్‌ఎన్ మూర్తి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్‌లు పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ మూర్తి మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ధ్వని కాలుష్యంపై తెచ్చిన చట్టంలో తగిన మార్పులు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని కోరారు. మహారాష్ట్రలో నగర కమిషనర్ చొరవ తీసుకుని ధూలే పట్టణంలో డీజె ల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించి అమలు చేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం ధృఢమైన సంకల్పంతో కృషి చేసి దేశమంతా దీనిని ఆదర్శంగా తీసుకుని ధ్వని కాలుష్య నివారణకు నడుం బిగించాలన్నారు.
అమెరికాలో హారన్ కొట్టడాన్ని అవమానంగా భావిస్తారని, మనదేశంలో నిషిద్ధ ప్రదేశాలో సహితం హారన్ ఉపయోగించడం ఆనవాయితీగా మారిందన్నారు. దీపావళి, వినాయక చవితి వేడుకల అనంతరం వినికిడి సమస్యలతో వందలాది రోగులు తమ వద్దకు వస్తున్నారని వివరించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సిబ్బందిలో 30 శాతం పైగా వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ.. ధ్వని తీవ్రతతో బీపీ, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ధ్వని తీవ్రత మరీ ఎక్కువైతే కర్ణభేరి పగిలిపోయి శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుందన్నారు. విద్యార్థులకు, ప్రజలకు శబ్దాల స్థాయిల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగించి చైతన్య పరచాలని కోరారు. ఆ దిశగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పౌర సంస్థలతో కలిసి కృషి చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఫిన్లాండ్, ఐస్ లాండ్, నార్వే, స్వీడన్ లాంటి దేశాలలో ధ్వని కాలుష్యం అతి తక్కువగా ఉంటుందన్నారు. దీనికి ప్రజల చైతన్యమే ప్రధాన కారణమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్వని కాలుష్యం 65 డెసిబుల్స దాటితే ఏర్పడుతుందని తెలిపిందన్నారు. మనదేశంలో వాహనాల రద్దీ, పండుగలు, పారిశ్రామిక వాడలు ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శబ్ద కాలుష్య నివారణకు తీసుకొచ్చిన చట్టం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
పారిశ్రామిక వాడల్లో 75 డెసిబుల్స్, వ్యాపార కోడళ్ళలో 65 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్ , నిశ్శబ్ద జోన్లలో 50 డెసిబుల్స్‌కి మించకుండా ఉండాలని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అక్కడి ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సేవ కుమార్ మాట్లాడుతూ.. నేల శబ్ద తరంగాలను గ్రహిస్తుందని, నేడు నగరాల్లో మట్టి అనేది కనపడకుండా కాంక్రీట్ మాయమవడం వలన ధ్వని కాలుష్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, హిందూ కళాశాల అధ్యాపకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఏపి గేజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, విశ్రాంత తెలుగు అధ్యాపకులు సూరం నారాయణరెడ్డి, మానవత కోశాధికారి టి.వి సాయిరాం, చావా శివాజీ, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వి. సదాశివరావు బీసీ మహాజనసభ కార్యదర్శి ఉగ్గం సాంబశివరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.