'ప్రొద్దుటూరు పెద్దాయనా', ప్రచారంలో ఆ దూకుడేంది నాయనా!

మహాకవి శ్రీ.శ్రీ. బహుశా ఇలాంటి వాళ్లను చూసే.. కొంతమంది యువకులు రా బోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావాన నిర్మాతలు.. అన్నారేమో. అందుకు ఈ పెద్దాయనే నిదర్శనమేమో..

By :  Admin
Update: 2024-05-03 03:00 GMT

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు బంగారపు కొట్ల బజారు. పొద్దెక్కింది. ఎండకి బోడితలలు మాడిపోతున్నాయి. ముక్కు చెవులకు గుడ్డలు కట్టుకున్న జనాలు రోడ్ల పై రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. వచ్చిపోయే వాహనాల మధ్య పలానా గుర్తుకే మీ ఓటు అంటూ మైకులు కట్టుకున్న ఆటోల్లోంచి నినాదాలు వినపడుతున్నాయి. ఇవేవీ పట్టని ఓ పెద్దాయన పంచెను ఎగబట్టి భుజాన కండువా వేసుకుని ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగిన మెట్టు ఎక్కకుండా.. మీ ఓటు ఈసారికి నాకే వేయాలబ్బా.. అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయనే నంద్యాల వరదరాజులు రెడ్డి. ఎప్పుడో ఈ దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు పుట్టారు. ఇప్పుడు 81 ఏళ్లు. 60 ఏళ్లకే కీళ్లనొప్పులు కాళ్ల నొప్పులంటూ చాలామంది ఈసురోమంటూ ఆపసోపాలు పడుతుంటే ఈయన మాత్రం రెండు కాళ్లు ఒక్కచోట పెట్టకుండా ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ 81 ఏళ్ల సూపర్ సీనియర్ సిటిజన్ కి కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ పెద్దాయన చేస్తున్న ప్రచారానికి యువత సైతం కేరింతలు కొడుతోంది. 'ఏమిరా అబ్బా.. అట్టా పోతుండావ్, కాస్తిటు జూడు' అంటూ యువకుల్ని ఆటపట్టిస్తూ చెణుకులు వేస్తూ మండుటెండల్లో మందహాసం వ్యక్తం చేస్తున్నారు ఈ పెద్దాయన.

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద వయస్కుడు ఈయనే అంటున్నారు. శాసనసభలో అడుగుపెట్టినా, పెట్టకపోయినా ఈయనే రికార్డు. 81 ఏళ్ల వయసులో నంద్యాల వరదరాజులు రెడ్డి మే 13న జరిగే ఎన్నిక కోసం అలుపెరక్కుండా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు పోటీ చేసి గెలుపోటములు రుచిచూసిన ఈ పెద్దాయన్ని అందరూ ప్రొద్దుటూరు పెద్దాయనే అంటారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో జరిగిన అనేకానేక కీలక రాజకీయ పరిణామాలకు ఈ పెద్దాయన ప్రత్యక్ష సాక్షి. పరిస్థితులకు ధీటుగా ఎదురొడ్డి నిలిచిన మనిషి.
‘ప్రొద్దుటూరు పెద్దాయన’ అని ఎందరో ఆయన ముద్దుగా పిలుస్తుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ అలుపుసొలుపు లేకుండా పోరాడుతుంటారు. 8 పదుల వయసులో 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనది. గెలుపోటములు రెండింటినీ ఒకే తరహాలో స్వీకరించే క్రీడాస్ఫూర్తి ఆయనది.
1942 నవంబర్ 12న నంద్యాల పెద్ద వరదారెడ్డి, నంద్యాల సుమిత్రమ్మ దంపతులకు జన్మించిన వరదరాజులురెడ్డి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. 18 ఏళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేశారు.
1981లో సెట్టిపల్లె రఘురామిరెడ్డిపై ‘సమితి అధ్యక్షుడిగా’ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కసితో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983 ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీకి చెందిన ఎంవీ రమణారెడ్డి చేతిలో ఓడారు. దీంతో మరింత పట్టుదల పెరిగింది. ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని దించి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఏది ఏమైనా విజయబావుటా ఎగరేసి తీరాలనుకున్న వరదరాజుల రెడ్డి ఎన్టీరామారావు పార్టీలో చేరారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాయలసీమ విమోచన సమితి తరపున పోటీ చేసిన అదే ఎంవీ రమణారెడ్డిపై గెలిచారు. ఇక ఆ తర్వాత ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ విజయ పరంపర టీడీపీ తరఫున కాకుండా కాంగ్రెస్ తరఫున కొనసాగింది. 1989, 1994, 1999, 2004లో కాంగ్రెస్ టిక్కెట్టుపై గెలిచారు. అందరికీ తలలో నాలుకలా ఉండే వరదరాజుల రెడ్డి వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వరదరాజులు రెడ్డి కాంగ్రెస్‌ను వీడి 2014 ఎన్నికలలో టిడిపి టిక్కెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో పోటీకి దూరంగా ఉండి, ‘జగన్‌ వేవ్‌’లో కొట్టుకుపోయిన టీడీపీ అభ్యర్థి లింగారెడ్డికి మద్దతిచ్చారు.
గత ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన వరదరాజులు రెడ్డి ఇప్పుడు మరోసారి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇటీవలే తన వయసుపై దుమ్మెత్తిపోసిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి తగిన బదులిచ్చారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రసిద్ధ శివాలయం సెంటర్ నుంచి బస్ స్టేషన్ వరకు స్పీడ్ వాక్ చేద్దామా అంటూ ఈ ‘పెద్దాయన’ సవాలు విసిరారు.
మండుతున్న ఎండల్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ కార్యకర్తలతో కలిసి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఆలసట ఎరుగకుండా ముందుకు సాగుతున్నారు. తనతో పాటు వచ్చే వాళ్లు వెనక్కి తగ్గాల్సిందే గాని ఈయన మాత్రం అడుగు వెనక్కి వేయకుండా పైపంచ తలమీద వేసుకుని ఇల్లిల్లు తిరుగుతూ చంద్రబాబు తరహాలో రెండేళ్లు ఊపుతూ విజయసంకేతాలను చూపిస్తూ వయసు అంకెలకే గాని మనసుకు కాదంటుంటారు. "యువతకు ఆయన స్ఫూర్తిదాయకం. ఆయనతో పోటీ పడడమంటే మాటలు కాదు" అన్నారు ఆయన అల్లుడు ఎం. రామచంద్రారెడ్డి. ప్రస్తుతం రామచంద్రారెడ్డి పెద్దాయన ఎన్నికల ప్రచార బాధ్యతలను చూస్తున్నారు. ముందడుగు వేయడం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, గెలుపు నాదే అన్నది పెద్దాయన వరదరాజుల రెడ్డి మాట.
Tags:    

Similar News