మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు 29 కారణాలు..ఆగస్టు 1 వరకు రిమాండ్‌

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.;

Update: 2025-07-20 12:48 GMT

విజయవాడ ఏసీబీ కోర్టు ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో ఏ–4 నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మిథున్‌రెడ్డిని శనివారం విచారించిన సిట్‌ అధికారులు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. సాయంత్రం వరకు విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధించింది. అక్కడ నుంచి మిథున్‌రెడ్డిని విజయవాడ జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

సిట్‌ తరపున నాయ్యవాది కోటేశ్వరరావు, నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్‌రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్‌ అనంతరం పోలీసు కస్టడీకి తీసుకోవలసి ఉన్నందు వల్ల మిథున్‌రెడ్డిని సమీపంలోని గుంటూరు సబ్‌ జైలుకు రిమాండ్‌ ఇవ్వాలని సిట్‌ తరపున న్యాయవాది కోటేశ్వరరావు కోర్టును కోరారు. మిథున్‌రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీ అని, వై కేటగిరీ కలిగిన ఎంపీ అని, రిమాండ్‌ విధిస్తే భద్రతను దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ప్రత్యేక బ్యారక్‌ ఇవ్వాలని నాగార్జున రెడ్డి కోర్టును కోరారు. మిథున్‌రెడ్డి కేవలం ఎంపీనే కాదన, గతంలో ఆయన ప్యానల్‌ స్పీకర్‌గాకూడా పని చేశారని, ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ, రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని తీర్పును వెలువరించింది.
సిట్టింగ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదించారు. సెక్షన్‌ 409, 420, 120(బీ), రెడ్‌విత్‌ 34, 37, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ యాక్టులోని 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Tags:    

Similar News