20వేల మంది భారతీయులపై ట్రంప్ 'వేటు'
ట్రంప్ మంట పెట్టాడు. అమెరికా నుంచి ఏ క్షణంలోనైనా 20వేల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి రానున్నారు. ఫైనల్ ఆర్డర్ల కోసం ఈ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాననుకున్నది తొలి రోజు నుంచే అమలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై కొరఢా ఝుళిపించారు. ఇప్పటిదాకా ఆ సెగ ఏ మెక్సికోకో, కెనడా, ఆఫ్రికన్ కంట్రీలకో ఉంటుందనుకుంటే ఇప్పుడది చాలా వేగంగా ఇండియాని తాకింది. 20, 407 మంది భారతీయుల భవితవ్యం గాల్లో తేలియాడుతోంది. వీరిలో 2,467 మంది ఇప్పటికే డిటెన్షన్ క్యాంప్ అంటే నిర్బంధ శిబిరాల్లో ఉంటున్నారు. వీళ్లని జనవరి 21వ తేదీ తర్వాత ఏ నిమిషంలోనైనా ఇండియాకి తిప్పి పంపుతారు. ఇప్పటికే దీనికి సంబంధించి జాబితా సిద్ధమైంది. తొలి జాబితాలో చికాగోలో అక్రమంగా ఉంటున్న 40 మంది విద్యార్థులు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసల వేట మొదలు పెట్టారు. అమెరికాలో ఇప్పటి అంచనాల ప్రకారం 14 నుంచి 15 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు తేలిస్తే అందులో భారతీయులు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వరకు ఉండవచ్చునని అంచనా.
భారతీయులు దాదాపు 3 లక్షల మంది వరకు H-1B వీసాలపై ఉన్నారు. మిగతా దేశాల నుంచి వచ్చే వారితో పోల్చుకుంటే భారతీయులదే ఇందులో సింహభాగంగా ఉంది. అయితే వీరిలో 20,000 మందికి పైగా సరైన డాక్యుమెంట్లు లేక అక్రమంగా ఉన్నట్టు తేల్చారు.
ప్రస్తుత బహిష్కరణల పర్వంలో భారతీయులు ముందు వరుసలో ఢిల్లీకి పయనమయ్యే వారిలో ఉన్నారు. 2024 నవంబర్ 2024 నాటికి 20,407 మంది "అన్‌డాక్యుమెంట్డ్" ఇండియన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. వారికి నిన్న మొన్నటి వరకు "తుది తొలగింపు ఉత్తర్వులు" అందలేదు.
మరికొందరు ప్రస్తుతం US ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. 17,940 మంది "సరైన ధృవీకరణ పత్రాలు లేని వారు". వీరిని తిరిగి స్వదేశం వెళ్లాలని ఆదేశించేలా "తుది తొలగింపు ఉత్తర్వులు" ఇవ్వాల్సి ఉంది. మరో 2,467 మంది ICE ఎన్‌ఫోర్స్‌మెంట్, తొలగింపు ఆపరేషన్స్ (ERO) నిర్వహించే నిర్బంధ క్యాంపుల్లో ఉన్నారు. 2024 నవంబర్ నాటికి, మొత్తం నిర్బంధించిన అన్ని దేశాల విద్యార్థుల సంఖ్య 37,000 కాగా వారిలో ఇండియన్స్ 2,467మంది. ఈ నిర్భంధాలలో.. అన్ని దేశాలను కలిపి చూసినపుడు ఇండియన్లది నాలుగో స్థానమే అయినా ఆసియా దేశాల పరంగా చూసినపుడు ఇండియా మొదటి స్థానంలో ఉంది.
ఇమ్మిగ్రేషన్ జడ్జి తొలగింపు ఉత్తర్వును జారీ చేస్తారు. దాన్ని అప్పీలేట్ అథారిటీ ధృవీకరించిన వెంటనే "తుది తొలగింపు ఉత్తర్వు" అంటే బహిష్కరణ వేటు పడినట్టవుతుంది.
యాదృచ్ఛికంగా, ICEకి సహకరించని 15 దేశాల సరసన భారతదేశం కూడా ఉంది. ఇరాక్, దక్షిణ సూడాన్, బోస్నియా-హెర్జెగోవినా వంటి దేశాలు USకు సహకరించని దేశాల జాబితాలో ఉన్నాయి. "పత్రాలు లేని" పౌరులను తిరిగి అంగీకరించడానికి ఇష్టపడని 15 "సహకరించని" దేశాల జాబితాలో చేర్చింది.
ఈ సహకరించకపోవడమనే దానికి అమెరికా ఓ నిర్వచనం ఇచ్చుకుంది. కాన్సులర్ ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నిరాకరించడం, సకాలంలో పత్రాలు దాఖలు చేయకపోవడం, డిపోర్ట్ అయ్యే వారితో వచ్చే చార్టర్ విమానాలను అడ్డుకోవడం, బహిష్కరణ వేటు పడిన వారిని అంగీకరించక పోవడం వంటివి. వీటిలో ఏ ఒక్కటి ఫుల్ పిల్ కాకపోయినా ఆ దేశాన్ని సహకరించని జాబితాలో చేరుస్తారు.
ICE- 2024వార్షిక నివేదిక ప్రకారం బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య నాలుగేళ్ళలో ఐదు రెట్లు పెరిగింది. 2021లో 292 మందిని ఇండియాకి తిరిగి పంపిస్తే 2024లో ఆ సంఖ్య 1,529కి చేరినట్టు అమెరికా లెక్కలు చెబుతున్నాయి.
అయితే, బహిష్కరణ డేటాను తరచూ అరకొరగా తయారు చేస్తుంటారు. గత అక్టోబర్‌లో 'సరైన పత్రాలు లేని' భారతీయ యువకులను పంజాబ్‌కు తిరిగి పంపించి వేశారు. ఆ సంఖ్య విషయంలోనూ తప్పులు దొర్లాయి. 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య చార్టర్, వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి పంపబడిన భారతీయుల సంఖ్యను 1,100గా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం చెబుతున్న లెక్క మరో విధంగా ఉంది.
2024 డిసెంబర్ 6న, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ, “అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం, 2023 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ 2024 వరకు మొత్తం 519 మంది భారతీయులను బహిష్కరించింది” అని అన్నారు.
ICE నిబంధనలను సరిగా పాటించనపుడు బహిష్కరిస్తుంటారు. స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన పత్రాలు ఇవ్వకపోవడం, ఎక్కడికైనా రాకపోకలు సాగించేటపుడు సమర్పించాల్సిన పత్రాలు లేకపోవడం, ఎటువంటి ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా US నుండి వెళ్లడానికి లేదా రావడానికి ప్రయత్నం చేయడం, అమెరికాలో ఆశ్రయం కోరే సమయంలో జరగాల్సిన విచారణ పూర్తి కాకుండానే యూఎస్ లోకి రావాలని చూడడం కేసుల్లో బహిష్కరణ వేటు పడుతుంది.
ప్రస్తుతం అమెరికా నుంచి బహిష్కృతులైన ఇండియన్లలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వాసులు ఉన్నట్టు సమాచారం. తెలుగు వారి సంఖ్య ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ సంఖ్య పదుల్లోనే ఉంటుందని భావిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి జారీ చేసిన 'తొలగింపు ఉత్తర్వు'పై పౌరులు కానివారు USలోని ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ బోర్డు (BIA)కి అప్పీల్ చేయవచ్చు. ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి తొలగింపు ఉత్తర్వును BIA ధృవీకరిస్తే అప్పుడది అమల్లోకి వస్తుంది. అదే తుది తీర్పు అవుతుంది. అప్పీల్ కి వెళ్లి సరైన వాదనలు వినిపించి బహిష్కరణను తప్పించుకునే వారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అంతర్జాతీయ కన్వెన్షన్లు, స్వదేశాల్లో హింస, టెర్రరిస్టు యాక్టివిటి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉండాలనుకునే వారికి చాలా సందర్భాలలో ఉపశమనం లేదా రక్షణ పొందుతారు.
చికాగో నుంచి 40 మంది వెనక్కి...
చికాగోలో ఉంటూ ఉన్నత చదువులు చదువుకుంటున్న దాదాపు 40 మంది భారతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు సమాచారం. ట్రంప్ చేపట్టిన ఈ భారీ బహిష్కరణ డ్రైవ్ తో వీరికి నేరుగా సంబంధం లేనప్పటికీ ఈ 40 మంది ఇండియాకి తిరిగి రానున్నారు. కాకపోతే, ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల తర్వాత ఇది జరుగుతున్నందున వీళ్లని కూడా ఆ ఖాతాలోనే కలుపుతారు. ఈ 40 మంది విద్యార్థుల బహిష్కరణతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ధోరణి గమనించినట్లయితే, ఇది భారతీయ సమాజం నుండి తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ప్రతి ఏటా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వస్తుంటారు. ట్రంప్ బహిష్కరణ వేట ఇలాగే కొనసాగితే విద్యార్థులు అమెరికాకు వచ్చే కార్యక్రమం కచ్చితంగా ప్రమాదంలో పడుతుంది.