ఏపీ నుంచి హజ్ కు 1,630 మంది యాత్రికులు
హజ్ యాత్రకు వెళ్లే వారు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు.;
ఈ నెల 29 నుండి ప్రయాణాలు ప్రారంభం
ప్రభుత్వం తరఫున ప్రత్యేక వసతి ఏర్పాట్లు
హజ్ -2025 యాత్ర కు ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికుల ప్రయాణాలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. హజ్ యాత్ర ప్రయాణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 1630 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో 1170 మంది యాత్రికులు హైదరాబాద్ ఎంబార్కేషన్ నుంచి బయలుదేరుతున్నారని తెలిపారు. వివిధ దశల్లో హజ్ యాత్ర ప్రయాణ ప్రణాళిక ఖరారు అయిందన్నారు.
మొదటి విడతలో మొత్తం 236 మంది ఈనెల 29వ తేదీ నుంచి మే 11 తేదీ వరకు హైదరాబాద్ నుంచి మదీనా మునవ్వరా కు బయలుదేరుతారని పేర్కొన్నారు. రెండవ విడతలో 934 మంది మే 19 వ తేదీ నుంచి 27 తేదీ వరకు హైదరాబాద్ నుండి జెడ్డా కు యాత్రికులు బయలుదేరనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఎంబార్కేషన్ నుంచి 452 మంది హజ్ యాత్రికులు ఈ నెల 30 తేదీ నుంచి మే 15 వ తేదీ వరకు మదీనా మునవ్వరాకు బయలుదేరుతారని తెలిపారు.
హైదరాబాద్ ఎంబార్కేషన్, బెంగళూరు ఎంబార్కేషన్ ల నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్ హజ్ యత్రికులకు వసతీ సౌకర్యాలు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి ఫరూక్ తెలిపారు. తమ ఆరోగ్యరీత్యా హజ్ నిబంధనల మేరకు ప్రభుత్వం తరపున యాత్రికులు తప్పనిసరిగా టీకాలు వేయించు కోవాలని సూచించారు. హజ్ యాత్రకు బయలుదేరుతున్న వారందరికీ మైనారిటీ శాఖా మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు.