అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా? మోదీ ఒప్పుకుంటారా?

రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.;

Update: 2025-04-29 01:25 GMT
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతికి అధికారికంగా రాష్ట్ర రాజధానిగా రాజ్యాంగబద్ధత కల్పించేందుకు అవసరమైన చట్టసవరణలపై కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. రాజధాని పునర్నిర్మాణానికి రాజ్యాంగబలాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో మే 2న ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశాన్ని చర్చిస్తా" అని చంద్రబాబు అన్నారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ గడువు ముగిసిందని, అందువల్ల అమరావతిని ఏకైక రాజధానిగా నోటిఫై చేయడంలో ఎలాంటి అడ్డంకి ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా అమరావతికి రాజ్యాంగబద్ధ గుర్తింపు కల్పించే దిశగా అనుకూల పరిస్థితి ఉందని సంకేతం ఇచ్చారు.

ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని రైతులు, మహిళలతో సమావేశమైన ఆయన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించే అవకాశాన్ని పరిశీలించి, పార్లమెంట్‌లో ఆ దిశగా చర్చించేలా తాను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
రైతుల డిమాండ్‌కు స్పందన
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని రాజధాని రైతుల డిమాండుకు చంద్రబాబు స్పందిస్తూ తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. రాజధాని రైతులు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని కోరారు. టీడీపీ ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నందున "మీరు చెబితే మోదీ వింటారు" అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, "ఇది మనం డిమాండ్ చేయాల్సిన అంశం కాదు, కానీ సామరస్యంతో సాధించగలమని నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. రాజధాని రైతుల త్యాగం వల్లే ఈ అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించే అవకాశమొచ్చిందని ప్రశంసించారు.
అమరావతి... శాశ్వత పరిష్కారం..
రాజధాని నిర్మాణ పునఃప్రారంభం (మే 2) కేవలం అభివృద్ధి శంకుస్థాపన మాత్రమే కాదు- అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా స్థిరపర్చే దిశగా మొదటి ఘట్టం. కేంద్రం సహకారం పట్ల విశ్వాసం ఉంది అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల వ్యవధిలోనే ఎన్నో అడ్డంకులను అధిగమించామని, నిష్క్రియ స్థితిలో ఉన్న పనులను తిరిగి ప్రారంభించామని సీఎం తెలిపారు. అమరావతికి మళ్లీ నూతన శక్తిని అందించేందుకు మోదీ తిరిగి వస్తుండటమే అన్యాయానికి గట్టి సమాధానమని పేర్కొన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ప్రధాని మళ్లీ నిర్మాణ ప్రారంభానికి వస్తుండటం 'ఐతిహాసిక న్యాయం' అని అభివర్ణించారు.
అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా, ఉద్యోగాలు, అవకాశాలు కలిగించే అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
రుణ సమస్య పరిష్కారానికి హామీ
రైతులకు అప్పగించిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు లభించకపోవడం గురించి రైతులు అడగ్గా- తాను బ్యాంకులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తానూ అమరావతిలో ఇల్లు కట్టించుకుంటున్నానని చెప్పారు.
రాజధానికి పొరుగున ఉన్న గ్రామాల్లో భూసేకరణపై సందేహాలను సీఎం తొలగించారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్‌ స్టేడియం వంటి మౌలిక వసతుల కోసం భూమి అవసరం ఉంటుందని చెప్పారు.
Tags:    

Similar News