క్యాడర్ కు లీగల్ సపోర్ట్..జగన్ స్పీడ్ పెంచారా?

వరుస సమావేశాలతో పార్టీలో ఉత్సాహం పెంచుతున్న అధినేత;

Update: 2025-08-05 09:53 GMT

వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారు.అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువ కాలం బెంగుళూరుకే పరిమితమవుతున్నారని,ఇక వైసీపీ పని అయిపోయినట్లేనని ,భావిస్తున్న కూటమి నేతలకు జగన్ షాక్ ఇస్తున్నారు.జగన్ కూటమి ఊహకు అందనంత వేగంగా పావులు కదుపుతున్నారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది పాటు బెంగళూరుకే ఎక్కువగా పరిమితం అవుతూ వచ్చిన జగన్ ఇప్పుడు బెంగళూరు కంటే తాడేపల్లిలోనే ఎక్కువగా ఉంటూ, నేతల్ని కలుస్తూ, ప్రెస్ మీట్లు పెడుతూ, జిల్లాల్లో వరుసగా పర్యటిస్తూ హల్ చల్ చేస్తున్నారు.

ఇంత తక్కువ సమయంలో తమ అంచనాలకు భిన్నంగా జగన్ దూకుడు ప్రదర్శిస్తుండటం కూటమికి సైతం మింగుడు పడటం లేదు.అదే సమయంలో క్షేత్రస్దాయిలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని, క్యాడర్ ను టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు నమోదవుతున్నాయి.కేసుల భయంతో వైసీపీకి క్యాడర్ దూరమవుతారని కూటమి నేతలు భావిస్తుంటే , అందుకు భిన్నంగా వైసీపీ అధినేత క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేసులకు భయపడవద్దంటూ ,ఈసారి తిరిగి అధికారం లోకి వస్తామన్న ధీమా కల్గిస్తున్నారు.
లీగల్ సహాయానికి యాప్
వరుస కేసుల నుంచి తమ క్యాడర్, నాయకుల్ని రక్షించుకునేందుకు జగన్ ధీటైన వ్యూహంతో సిద్దమయ్యారు. తాడేపల్లిలో లీగల్ సెల్ కార్యాలయం ప్రత్యేకంగా ప్రారంభించారు. త్వరలో యాప్ తెచ్చి వైసీపీ క్యాడర్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని, వాటిపై అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని జగన్ స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఆ యాప్ లోనే కూటమి బాధిత వైసీపీ శ్రేణులు ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని ,అక్రమ కేసులను పార్టీ అధిష్టానం దృష్టికి తేవాలని కోరారు.ప్రతి ఒక్కరికి పార్టీ నుంచీ తగిన న్యాయ సహాయం అందుతుందని ప్రకటించారు. అంతేకాక మూడేళ్ల తరువాత వైసీపీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ధీమాగా చెబుతున్న జగన్ , ప్రస్తుతం పార్టీ పరంగా తీసుకొస్తున్న యాప్ ,అప్పుడు కూటమి నేతలపై ఆధారాలతో చర్యలు తీసుకోవడానికి ఉపయోగ పడుతుందని ,ఎవరినీ వదిలేది లేదని తేల్చిచెబుతున్నారు.అంటే ఎన్నికల ముందు తన ప్రజాగళం యాత్ర సందర్భంగా లోకేష్ రెడ్ బుక్ ప్రవేశ పెట్టి , వైసీపీ నేతల పేర్లు రాసినట్లుగా ,ఇప్పుడు జగన్ ఏకంగా యాప్ నే రూపొందించి , తమ క్యాడర్ ను వేధించిన కూటమి నేతల పేర్లు ,ఆధారాలతో భద్రపరుస్తున్నారు.
జగన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ లీగల్ సెల్ ను బలోపేతం చేస్తున్నారు. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ న్యాయవాదులతోనూ జగన్ సమావేశం నిర్వహించారు. అక్రమ కేసుల నుంచి పార్టీ నేతల్ని ఎలా కాపాడుకోవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో ప్రారంభించిన లీగల్ సెల్ ప్రధాన కార్యాలయంలో నిత్యం లాయర్లను అందుబాటులో ఉంచుతారు. దీంతో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ పరంగా లాయర్లు అందుబాటులో వుంటారు కాబట్టి పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని జగన్ వ్యూహరచన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా , కేసులు పెట్టినా వెనక్కు తగ్గకుండా పోరాడాలని , ప్రజలలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం పై అసంతృప్తి వచ్చిందని జగన్ పార్టీ క్యాడర్ కు భరోసా ఇస్తున్నారు.కూటమి వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును పూర్తి స్థాయిలో టార్గెట్ చేయాలని సూచించారు.కూటమి నేతలు ఊహించిన దానికి భిన్నంగా జగన్ వ్యూహాలు అమలు చేస్తుంటే , లిక్కర్ స్కాంలో కోణంలో వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ,కొందరు జగన్ సన్నిహితులను ఇప్పటికే అరెస్టు చేసి, ఆధారాలను సేకరిస్తోంది.అయితే ఈ కేసులో అసలు ప్రధాన సూత్రధారి జగన్ అంటూ బిగ్ బాస్ అరెస్ట్ కూడా వుంటుందన్న సంకేతాలను పలువురు కూటమి నేతలు ఇస్తున్నారు.అయితే లిక్కర్ స్కాంలో జగన్ ను అరెస్ట్ చేసేంత స్థాయిలో సిట్ కు ఆధారాలు చిక్కలేదని పలువురు అంటుండగా , వైసీపీ క్యాడర్ లో అలజడి సృష్టించడానికే కొందరు కూటమి నేతలు లీకులు ఇస్తూ మైండ్ గేమ్ షురూ చేశారు.ఏదైనా జగన్ మాత్రం పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ అంటూ పార్టీ కేడర్ లో కేసుల భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:    

Similar News