దర్జా అంటే నీదే 'నాయుడూ'! చెవిరెడ్డి ఎందుకాగుతాడు నీ ముందు!!
సొమ్ముండగానే సరిపోతుందా నాయుడూ.. దర్జా ఉండొద్దు, జల్సా చేయాలికదా.. మద్యం కేసులో చిక్కిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడి కథేంటో చదవండి;
By : The Federal
Update: 2025-08-04 05:19 GMT
ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడైన సీహెచ్ వెంకటేశ్ నాయుడు (A-34) నాలుగైదు ఏళ్లుగా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని SIT అధికారులు గుర్తించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుంగు మిత్రుడైన ఆయన, 2017–2024 మధ్య ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రయాణాలు, సినీ హీరోయిన్లతో ముచ్చట్లు, బడా బాబులతో విందులు, ఐఏఎస్–ఐపీఎస్ అధికారులతో మంతనాలు నిర్వహిస్తూ దర్జాగా జీవించాడని తేలింది.
వీడియోలు, ఫొటోలు వెలుగులోకి..
ఆదివారం వెలుగులోకి వచ్చిన కొత్త వీడియోలు, ఫొటోలు ఆయన విలాసజీవితాన్ని బహిర్గతం చేశాయి. ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ఉన్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మద్యం ముడుపుల సొమ్ము దాచిన ప్రదేశంలో ఆయన కోట్ల రూపాయల నోట్ల కట్టలు లెక్కపెడుతున్న వీడియో రెండు రోజుల కిందటే బయటపడింది.
ఛార్టర్డ్ ఫ్లైట్ దిగిన సీన్..
ఓ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్ నాయుడు వీడియో కూడా బయటకొచ్చింది. ఖరీదైన కారులో విమానాశ్రయానికి చేరుకుని, రన్‌వేపై నడుచుకుంటూ జెట్‌లోకి ఎక్కడం, తిరిగి దిగిన తర్వాత మరో విలాసవంతమైన బుగ్గ కారులో ఎక్కడం – ఇవన్నీ ఆయన రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
చెవిరెడ్డితో రాజకీయ అనుబంధం
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వెంకటేశ్ నాయుడు అత్యంత సన్నిహితుడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి చెవిరెడ్డి పోటీ చేస్తూ, వెంకటేశ్ నాయుడితో డమ్మీ నామినేషన్ వేయించారు. 2022 జనవరిలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన సంక్రాంతి వేడుకలకు చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి సూచించిన ప్రదేశాలకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్లు SIT తేల్చింది.
అఫిడవిట్‌లో పేదరికం – అసలు జీవితంలో విలాసం
ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేశ్ నాయుడు, తన ఎన్నికల అఫిడవిట్‌లో 2022–23 సంవత్సరానికి వార్షికాదాయం ₹4.95 లక్షలుగా పేర్కొన్నాడు.
బ్యాంకు ఖాతాలు, నగదు కలిపి మొత్తం ₹10.70 లక్షలే ఉన్నట్లు చూపించాడు. ఏ ఆస్తులూ లేవని ప్రకటించాడు. కానీ వాస్తవ జీవితంలో ప్రత్యేక జెట్ ప్రయాణాలు, బుగ్గ కార్లు, బెంజ్ వాహనాల్లో విలాసజీవితం – ఇవన్నీ SIT విచారణలో కీలక ఆధారాలుగా మారాయి.
SIT దర్యాప్తులో కీలక అస్త్రం
పేపర్‌లలో పేదోడుగా కనిపించినా, వాస్తవంలో కోట్ల రూపాయల విలాసజీవితం గడిపిన వెంకటేశ్ నాయుడు ప్రవర్తన SIT దర్యాప్తుకు బలమైన అస్త్రంగా మారింది. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వీడియోలు, ఫొటోలు, ఆర్థిక వ్యత్యాసాలు ఆయనపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.