నాన్నా, నిన్ను చంపేస్తున్నా.. ఎందుకంటే..
ఈ వార్త చదువుతుంటేనే ఒళ్లు గగ్గురుపొడుస్తుంది. డబ్బు కోసం తల్లిదండ్రుల్నీ చంపేయడానికి పూనుకుంటారా..;
By : The Federal
Update: 2025-08-03 05:51 GMT
తల్లిదండ్రులు పిల్లలు కోసం అహర్నిశలు కష్టపడి వాళ్లనేదో ఉద్దరించాలని ప్రయత్నిస్తుంటే.. నాన్నా నువ్వు బతికుండడమే నాకు కష్టమంటున్నాడు ఇక్కడో ప్రబుద్ధుడు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన వింటుంటేనే ఒళ్లు గగ్గురుపొడుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసు స్టేషన్ పరిథిలో జరిగింది.
కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ శివారు కామనగరువుకు చెందిన విప్పర్తి వెంకట రమణ కుమారుడు విప్పర్తి హర్షవర్దన్ ఈ దారుణానికి ఒడిగట్టి పోలీసులకు చిక్కిపోయాడు. వెంకట రమణ ఓ మధ్యతరగతి రైతు. మోటార్ సైకిల్ పైన్నే వెళ్లి వస్తుంటాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న మోటారు సైకిల్‌పై వెళుతున్న విప్పర్తి వెంకట రమణను ఆయన కుమారుడే కారుతో గుద్దించి చంపాలని కుట్ర పన్నాడు. తండ్రిని చంపేస్తే అతని పేరిట ఉన్న బీమా సొమ్ము వస్తుందన్న దురాశతో ఈ ప్లాన్ చేశాడు.
ఈ ప్లాన్ ప్రకారమే కుమారుడు మోటారు సైకిల్ పై పోతున్న తండ్రిని వెనుకనుంచి ఢీ కొట్టించాడు. ఆ తర్వాత ఈ కుమారుడే పోలీసు స్టేషన్ కి వెళ్లి.. ఏదో గుర్తుతెలియని వాహనం తన తండ్రి ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టి వెళ్లిందని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వెంకటరమణ కొన్నిరోజుల పాటు అపస్మారక స్థితిలో ఉండి ఇటీవల కోలుకున్నారు.
అయితే పోలీసులు తమ కేసు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని ఒకచోట యాక్సిడెంట్ చేసిన కారును నాలుగు రోజుల పాటు నిలిపి ఉంచినట్టు గమనించారు. స్థానికులతో మాట్లాడారు. విచారణలో వెంకటరమణను కడతేర్చబోయింది అతడి కొడుకేనని తేలింది. ఓ కంపెనీ నుంచి తండ్రి పేరిట రూ.13లక్షల రుణం తీసుకున్న హర్షవర్ధన్, అందుకు తగ్గట్టు బీమా చేయించి ప్రీమియం చెల్లించాడు.
ఈ క్రమంలో తండ్రి వెంటరమణను చంపేస్తే ఇన్సూరెన్సు సొమ్ము వస్తుందన్న దురాశతో ఈవిధంగా పథక రచన చేసినట్టు అతడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. నిందితుడు విప్పర్తి హర్షవర్ధన్‌ను ఆగస్టు 2 సాయంత్రం అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచినట్టు అమలాపురం తాలూకా ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు తెలిపారు.
ఈ విషయం తెలిసిన స్థానికులు విస్తుపోతున్నారు. డబ్బు ముందు బంధాలు, అనుబంధాలు ఉత్త బూటకమేనా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.