మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?

ఓ వారపత్రికలో అచ్చయిన కథనం రెండు పార్టీల మధ్య అగ్గిరాజేస్తుంది. బీజేపీ, ఎన్సీపీ నేతల మధ్య విభేదాలకు కారణమైంది.

Update: 2024-06-14 10:39 GMT

మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఆ కూటమి బలం సగానికి పైగా తగ్గిపోయింది. బీజేపీ 9 సీట్లకే పరిమితమైంది. మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ)గా పోటీ చేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 29 స్థానాల్లో విజయం సాధించాయి. సాంగ్లీ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ విశాల్‌ పాటిల్‌ ఒక్కరే విజయం సాధించారు. ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాల్లో పోటీ చేసి ఎనిమిదింటిని గెలుచుకోగా..ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం ఒక్క సీటుకే పరిమితమయ్యింది.

విభేదాలకు దారి తీసిన కథనం..

రాష్ట్రంలో ఎన్‌డిఎ పేలవమైన పనితీరు పార్టీల మధ్య విభేదాలకు దారితీసింది. అజిత్ పవార్ ఎన్‌సీపీతో జతకట్టడం వల్లే తమకు ఆశించిన స్థానాలు రాలేదని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ‘ఆర్గనైజర్’ అనే వారపత్రికలో అచ్చయ్యాయి.

‘‘కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడిన బీజేపీ మద్దతుదారులను ఈ ఫలితాలు నిరుత్సాహపరిచాయి. బాగా పనిచేసిన పార్లమెంటేరియన్లు విస్మరించారు. ఈ అనాలోచిత చర్య ఎందుకు తీసుకున్నారు?’’ అన్నఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ లీడర్ రతన్ శారదా వ్యాఖ్యానించారు.

వారపత్రికలో వచ్చిన కథనంపై ఎన్సీపీ యువజన విభాగం నాయకుడు సూరజ్ చవాన్ విరుచుకుపడ్డారు. ‘‘బిజెపి బాగా పనిచేసినప్పుడు RSSను మెచ్చుకున్నారు. ఓటమి ఎదురయినపుడు మాత్రం అజిత్ పవార్‌ మీదకు నెడుతున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్‌సిపి రాజ్యసభ ఎంపీ, సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ ఇలా అన్నారు. “ఒక వారపత్రికలో వచ్చిన కథనం బిజెపి వైఖరిని ప్రతిబింబించదు. దానిని అలా అర్థం చేసుకోకూడదు.” అని పేర్కొన్నారు. సూరజ్ చవాన్ ప్రకటనను బిజెపి నాయకుడు ప్రవీణ్ దారేకర్ ఖండించారు.

ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సినవసరం లేదన్నారు. ఎన్‌సిపి గురించి బిజెపి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, గెలుపోటముల గురించి మాట్లాడటానికి అనువైన ప్రదేశం ఎన్‌డిఎ సమావేశం అని పేర్కొన్నారు.

ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది. దాన్ని ఆయన తిరస్కరించారు. దాంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.

"నేను ఇంతకుముందు యుపిఎ క్యాబినెట్ మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు పదవిని తగ్గించారు.’’ అని ప్రఫుల్ పటేల్ విలేకరులతో అన్నారు. కాగా కేబినెట్ బెర్త్ కోసం తాము వేచిచూస్తామని అజిత్ పవార్ చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే ఘోర పరాజయం పాలైంది. ఒక్క లోక్‌సభ సీటును మాత్రమే గెలుచుకున్న ఎన్‌సీపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News