రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్ నుంచి అజిత్ దోవల్..

గత నెలలో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంక్‌స్కీతో సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ చర్చలు జరిపారు.

Update: 2024-09-08 07:21 GMT

NSA Ajit Doval (file photo)

గత రెండేళ్ల నుంచి జరుగుతోన్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. కొంతమంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని దేశం వీడారు. ఇంకొందరు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రోజురోజుకు ప్రాణనష్టం, ఆస్తినష్టం పెరిగిపోతున్న క్రమంలో

రెండు దేశాల మధ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందా? అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇరు దేశాధినేతలతో భారత్‌కు మంచి సత్సంబంధాలున్నాయి. రెండు దేశాల మధ్య చర్చల ద్వారా యుద్ధాన్ని విరమింపజేసే సత్తా కూడా ఒక్క భారతదేశానికే ఉందని భావిస్తున్న తరుణంలో..

భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఈ వారం మాస్కోను సందర్శించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు దేశాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, యుద్ధానికి ముగింపు పలికే చర్చల్లో అజిత్ దోవల్ పాల్గొనే అవకాశం ఉంది.

గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంక్‌స్కీతో సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ చర్చలు జరిపిన నేపథ్యంలో.. రష్యాకు తన NSAని పంపాలని భారత్ నిర్ణయం తీసుకుంది.

యుద్ధాన్ని ముగించడానికి భారత్, బ్రెజిల్, చైనా మధ్యవర్తులుగా వ్యవహరించాలని పుతిన్ కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27న ప్రధాని మోదీ పుతిన్‌‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. మోదీ తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్‌కు వివరించిన సమయంలోనే శాంతి చర్చల కోసం దోవల్‌ను మాస్కోకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

మోడీ ఉక్రెయిన్ పర్యటన తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖ యుద్ధంపై తమ వైఖరిని వ్యక్తం చేస్తూ.. "శాంతిని పునరుద్ధరించగల, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారతదేశం మద్దతు ఇస్తుంది" అని పేర్కొంది. జెలెనెస్కీతో సమావేశం తర్వాత మోదీ.. చర్చల ద్వారా మాత్రమే యుద్ధానికి విరామాన్ని ప్రకటించగలమని, ఇది యుద్ధ యుగం కాదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలలో భారతదేశం, చైనా రెండూ కీలక భూమిక పోషించగలవని శనివారం ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ పేర్కొన్నారు. 

Tags:    

Similar News