మమతపై యూపీ సీఎం యోగి ఘాటు విమర్శలు..
‘‘హోళీ సందర్భంగా చెలరేగిన అల్లర్లను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నియంత్రించలేకపోయారు’’ - యోగి ఆదిత్యనాథ్;
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ సీఎం (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) పై విరుచుకుపడ్డారు.
"ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Maha Kumbh)ను ‘మృత్యు కుంభ్’ అని అన్న వ్యక్తి ..హోళీ(Holi) సందర్భంగా చెలరేగిన అశాంతిని నియంత్రించలేకపోయారు" అని యోగి పేర్కొన్నారు. గోరఖ్‌పుర్‌లో కొత్తగా ఎన్నికైన గోరఖ్‌పుర్ జర్నలిస్ట్స్ ప్రెస్ క్లబ్ ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"మహా కుంభ్‌కు తొలిసారి తమిళనాడు నుంచి భక్తులు వచ్చారు" అని తెలిపారు. కేరళ నుంచి కూడా వచ్చారని పేర్కొన్నారు.
మహా కుంభ్‌లో రోజూ 50వేల నుంచి 1 లక్ష వరకు పశ్చిమ బెంగాల్ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి వెల్లడించారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహా కుంభ్‌ను ‘మృత్యు కుంభ్’గా అభివర్ణించారు. అసలు మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆమె ఆరోపించారు.
"వాస్తవ మృతుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు వందలాది మృతదేహాలను దాచిపెట్టారు. బీజేపీ పాలనలో మహా కుంభ్ ‘మృత్యు కుంభ్’గా మారింది" అని ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బెనర్జీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల తర్వాత ఆమె అన్ని మతాలనూ గౌరవిస్తానని స్పష్టం చేశారు.
"నేను నా మతాన్ని గౌరవించనని ఎవరన్నారు? మతం వ్యక్తిగతం.కానీ పండుగలు అందరివి. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి భిన్నమైన భాషలు, విద్యా విధానాలు, జీవన విధానాలు, సంస్కృతులు, నమ్మకాలు ఉన్నాయి. కానీ మేము అన్నింటినీ గౌరవిస్తాము, అందుకే ‘వైవిధ్యంలో ఐక్యత’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తాం" అని కోల్‌కతా సమీపంలోని న్యూటౌన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బెనర్జీ (Mamata Banerjee)అన్నారు.