AAP | ఆలయ పూజారులకు రూ. 18 వేలు జీతం
తమ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ దేవాలయాల పూజారులకు రూ. 18వేలు జీతం ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.;
తమ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ దేవాలయాల పూజారులకు రూ. 18వేలు జీతం ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అధికార పగ్గాలు చేపట్టగానే 'పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన'ను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ఈ రోజు నేను ఒక పథకానికి శ్రీకారం చుడుతున్నా. పథకం పేరు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన. ఈ పథకం కింద ఆలయాల పూజారులకు గౌరవ వేతనంగా నెలకు రూ. 18వేలు ఇస్తాం. తరతరాలుగా ఆచారాలను ముందుకు తీసుకువెళ్తున్న పూజారులు తమ కుటుంబాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే మేము వారి గురించి ఆలోచించాం. ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి నేను రేపు కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తాను" అని కేజ్రీవాల్ చెప్పారు.
ఎన్నికలలో పోటీకి క్రౌడ్ ఫండింగ్..
ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా సోమవారం ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే నిధులతో ఆయన ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనుండగా.. మనీష్ సిసోడియా ఈసారి జంగ్‌పురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2015 నుంచి ఈయన పట్పర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
" ఈ సారి నేను జంగ్‌పురా నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. మీ ఆర్థిక సహకారం వల్లే ప్రతిసారీ నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా మీ ఆర్థిక సహకారం అవసరం" అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
అంతకుముందు, జంగ్‌పురాలోని అగర్వాల్ ధర్మశాలలో ఏర్పాటు చేసిన ఖతుష్యం జాగ్రన్‌కు సిసోడియా పాల్గొన్నారు. నిజాముద్దీన్ బస్తీని సందర్శించిన ఆయన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా వద్ద ప్రార్థనలు చేశారు.