AAP | సీఎం మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. వెయ్యి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. వెయ్యి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని హామీ ఇచ్చారు. త్వరలో ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశం ఉందని, అందువల్ల ఎన్నికల తర్వాత మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. ముఖ్యమంత్రి అతిషి నేతృత్వంలోని ఢిల్లీ క్యాబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపిందని, శుక్రవారం నుంచి మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కోసం 2024-25 బడ్జెట్‌లో రూ. 2,000 కోట్ల కేటాయిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.
మహిళా సాధికారత కోసమే..
"ఈ పథకం మహిళా సాధికారత, వారి ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం ప్రవేశపెడుతున్నాం. బీజేపీ దీనిని ఉచిత 'రెవ్డీస్' అని అంటోంది. నేను తీసుకున్న నిర్ణయం సమాజాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నా. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని బీజేపీ అడుగుతుంది. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పాను. అమలు చేసి చూపించా. ఇదే వారికి నా సమాధానం’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చివరగా తమ పార్టీకి మహిళలు మద్దతు ఇవ్వాలని, మీరంతా ఆశీర్వదిస్తే 60కి పైగా సీట్లు సాధిస్తామని అన్నారు.