జర్నలిస్ట్ హత్యకేసులో ముగ్గురి అరెస్ట్, కాంట్రాక్టర్ కోసం గాలింపు
రోడ్డు నిర్మాణంలో అవినీతిని బయటపెట్టిన జర్నలిస్టును చంపి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. నిందితులకు “కఠిన శిక్ష” విధిస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ ఇచ్చారు.;
జర్నలిస్ట్ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి (Vishnu Deo Sai) హామీ ఇచ్చారు. జరిగిన ఘటనను తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని చెప్పారు.
అక్రమాలు బయటపెట్టినందుకు..
బస్తర్ ప్రాంతంలో గంగలూరు - నేలసనార్ గ్రామాలను కలుపుతూ ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సురేష్ చంద్రకర్ అనే కాంట్రాక్టర్ కాంట్రాక్టు దక్కించుకుని పనులు మొదలుపెట్టాడు. అయితే రోడ్డు నిర్మాణంలో అక్రమాలను టీవీ జర్నలిస్టు ముకేశ్ చంద్రశేఖర్ (Mukesh Chandrakar) బయటపెట్టడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఆ తర్వాత నుంచి కాంట్రాక్టర్ దగ్గరున్న వ్యక్తుల నుంచి ముకేశ్‌కు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 1న ముకేశ్ అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు మొదలుపెట్టారు. చివరకు మృతదేహాన్ని బీజాపూర్ పట్టణంలోని ఓ సెప్టిక్ ట్యాంకులో గుర్తించారు. డెడ్‌బాడీని బయటకు తీయించి కుటుంబసభ్యులను సమాచారం ఇచ్చారు. మృతుడు ముకేశేనని నిర్ధారించుకున్నాక, కుటుంబసభ్యుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. కీలక సూత్రధారి కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ కోసం వెతుకుతున్నారు.
ముకేశ్ గురించి ..
ముకేశ్ చంద్రశేఖర్ (33) ఒక టీవీ జర్నలిస్ట్. ఇతను నిర్వహిస్తున్న ‘బస్తర్ జంక్షన్’ యూట్యూబ్ ఛానల్‌కు 1.59 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2021లో బీజాపూర్‌లో మావోయిస్టులు అపహరించిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది విడుదలకు ముకేశ్ కీలకంగా వ్యవహరించారు.
హత్యను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
ముకేశ్ హత్య(Murder)పై ఎడిటర్స్ గిల్డ్ (Editors Guild) ఆఫ్ ఇండియా ఆవేదన వ్యక్తం చేసింది. “యువ జర్నలిస్ట్ హత్య ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేయించి నిందితులను శిక్షించాలి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే జర్నలిస్టుల భద్రత అత్యవసరం. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఏ ఒక్కరికీ హాని కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం,” అని ప్రకటనలో ఎడిటర్స్ గిల్డ్ సీఎంను కోరింది.