అస్సాంలో 1,600 నివాసాలు నేలమట్టం.. కన్నీరు పెట్టుకున్న యజమానులు

ప్రతిపాదిత అదానీ గ్రూప్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఖాళీ చేయించిన ప్రభుత్వం - మాకు పరిహారం అందలేదంటున్న కొన్ని కుటుంబాలు..;

Update: 2025-07-09 13:36 GMT

 అస్సాం(Assam) రాష్ట్రం ధుబ్రి జిల్లాలో అదానీ గ్రూప్ థర్మల్ పవర్ ప్లాంట్ (Adani Power Project) ఏర్పాటు కానుంది. ఇందుకోసం సంతోష్‌పూర్, చారుబఖ్రా, చిరాకుట గ్రామాల్లో అధికారులు స్థల సేకరణ చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ గ్రామాల్లో 1600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వాటిల్లో అధికంగా ఉన్నవి ముస్లిం నివాసాలే. పునరావాసం కోసం ప్రతి కుటుంబానికి రూ. 50వేల చొప్పున అందజేశారు. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య పారామిలిటరీ బలగాల సాయంతో నివాసాలను నేలమట్టం చేశారు. గతంలో జారీ చేసిన నోటీసు ప్రకారం కూల్చేశామని అధికారులు చెప్పారు. అయితే కొన్ని కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందిందని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

వేల సంఖ్యలో ఉద్యోగాలు..

పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలం గౌరంగ్ నదికి సమీపంలో ఉంటుంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్న ఈ స్థలంలో ప్లాంట్ నిర్మాణ దశలో 25,000 ఉద్యోగాలు, తరువాత 10,000 శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. రూ. 50వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న పవర్ ప్లాంట్‌కు అవసరమైన స్థలాన్ని గత నెలలో అదానీ గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీ పరిశీలించారు.

కన్నీరు పెట్టుకున్న ఇంటి యజమానులు..

ముందుగానే నోటీసులు ఇచ్చినా.. కొన్ని కుటుంబాలు తమ ఇల్లు వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. చివరి క్షణం వరకు వారు తమ ఇళ్లవద్దే ఉండిపోయారు. ఇప్పటికే కొన్ని ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన ఇళ్లను కూలుస్తుండగా వాటి యజమానులు, కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

పోలీసుల లాఠీచార్జి ..

రైజోర్ దళ్ చీఫ్, శివసాగర్ ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ స్థల సందర్శనకు వెళ్లినపుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో నిరసనలు వెల్లు వెత్తాయి. లాఠీచార్జిలో చాలా మంది నిరసనకారులు గాయపడ్డారని తెలుస్తోంది. నిర్వాసితులకు కనీసం 500 బిఘాలను కేటాయించాలని అఖిల్ గొగోయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటికే ఆ స్థలంలో ఉన్న మతపరమైన ప్రదేశాలు, శ్మశానవాటికలు, పాఠశాలలను కూల్చకూడదని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని డ్రైవ్‌లు..

కూల్చివేతలపై వస్తున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమాధానమిచ్చారు. "350 మంది అక్రమ బంగ్లాదేశీయుల ఇళ్లను తొలగించడంలో ఎవరికైనా సమస్య ఉంటే, వారిని వాళ్లే భరించాల్సి ఉంటుంది" అని అన్నారు. చప్పర్, ధుబ్రీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగుతాయని శర్మ ప్రకటించారు.

తొలగింపుపై తీవ్ర విమర్శలు..

ఇళ్ల తొలగింపుపై ప్రతిపక్ష నాయకులు, హక్కుల సంఘాల నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. AIUDF అధ్యక్షుడు, మాజీ ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఈ చర్యను "జాత్యహంకారం, అమానవీయ’’ చర్యగా అభివర్ణించారు, ప్రభుత్వం "కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా" మైనారిటీల ఇళ్లను కూలుస్తోందని ఆరోపించారు.

" వీరంతా దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. కొంతమంది వద్ద భూమి కేటాయింపు పత్రాలు ఉన్నాయి. ఓటరు జాబితాలో పేర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం సరైన పునరావాసం చూపకుండా వారిని ఖాళీ చేయిస్తోంది" అని అన్నారు. ఇళ్ల కూల్చివేతపై బిలాసిపారా వెస్ట్‌కు చెందిన AIUDF ఎమ్మెల్యే సంసుల్ హుడా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వ పరిహారం రూ. 50వేలు కొన్ని కుటుంబాలకు మాత్రమే అందిందని, చాలా కుటుంబాలకు అందలేదని చెప్పారు.

Tags:    

Similar News