ఢిల్లీ అసెంబ్లీలో 15 మంది AAP ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు కారణమేంటి?
ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్ ఫొటో తొలగింపు వివాదం చివరకు 15 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారితీసింది.;
మాజీ ముఖ్యమంత్రి అతిశీ (Atishi) సహా 15 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఈ రోజు (ఫిబ్రవరి25) స్పీకర్ సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని తొలగించి ఆయన స్థానంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉంచడాన్ని అసెంబ్లీలో ఆప్ శాసనసభ్యులు తప్పుబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కుంభకోణంపై సిఏజీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టంది.
సిఏజీ నివేదికలో ఏముంది?
ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) సిఏజీ నివేదిక(CAG)ను ప్రవేశపెట్టారు. 2021-22 మద్యం విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. మద్యం లైసెన్స్ మంజూరులో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల కమిటీ సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రి, మద్యం శాఖ మంత్రి మనీష్ సిసోడియా పట్టించుకోలేదని నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ ‘‘సిఏజీ నివేదిక ఆప్ అక్రమాలను బయట పెట్టింది. కాని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోల చేస్తూ.. సభ దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు,’’ అని పేర్కొన్నారు. సూద్ మంత్రివర్గ సహచరుడు పర్వేష్ వర్మ మాట్లాడుతూ.. “మేము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సిఏజీ నివేదిక బయటకు వచ్చింది. మునుపటి ఆప్ ప్రభుత్వం ఎలా దోచుకున్నారో ఢిల్లీ జనాలకు వివరిస్తాం,” అని చెప్పారు.
రాజుకున్న ఫొటో వివాదం..
ఆప్ అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రాలు ఉండేవి. వాటి స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి మోదీ చిత్రాలను ఉంచినట్లు సోషల్ మీడియో ఓ వీడియో వైరలైంది. ఆ తర్వాత వచ్చిన మరో వీడియోలో.. అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రాలను మరో గోడ మీద వెలాడుతూ కనిపించాయి.
ఆప్ ఎమ్మెల్యేల నిరసన..
సీఎం ఆఫీసులో ఫోటోల మార్పిడిపై ఆప్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. 'జై భీం' అంటూ నినాదాలు చేశారు. మునుపటి స్థానంలోనే ఫొటోలను తిరిగి పెట్టే వరకు తన నిరసన కొనసాగిస్తానని అతిశీ డిమాండ్ చేశారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. గందరగోళ పరిస్థితి నేపథ్యంలో సభాపతి 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారంతా అసెంబ్లీ వెలుపల కూర్చొని నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రాన్ని తొలగించి మోదీ ఫొటో పెట్టారు. ‘అంబేద్కర్ కంటే మోదీ గొప్పవారా?’ అని ప్రశ్నించగానే మమ్మల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు” అని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా పేర్కొన్నారు.