గుజరాత్ రాజ్‌కోట్ గేమ్ జోన్‌ అగ్ని ప్రమాద ఘటనపై లక్ష పేజీల ఛార్జ్ షీట్

రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. 27 మంది మృత్యువాతపడ్డ ఈ ఘటనకు సంబంధించి 15 మంది నిందితులను అరెస్టు చేశారు.

Update: 2024-07-25 08:31 GMT

గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి 15 మంది నిందితులపై పోలీసులు ఛార్జ్ షీట్ తయారుచేశారు. రాజ్‌కోట్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లక్ష పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. మే నెలలో జరిగిన ఈ ఘటనలో 27 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

"ఘటనకు సంబంధించి 365 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేశాం. TRP గేమ్ జోన్ యజమానులు, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ (RMC) అధికారులతో సహా మొత్తం 15 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఫోమ్ షీట్, ప్లాస్టిక్, మండే స్వభావం ఉన్న సామగ్రి కారణంగా గేమ్ జోన్‌లో 3, 4 నిమిషాల్లో మంటలు వేగంగా వ్యాపించాయని దర్యాప్తులో తేలింది. వెల్డింగ్ పని చేస్తుండగా వచ్చిన నిప్పు రవ్వల వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.’’అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్), పార్థరాజ్‌సింగ్ గోహిల్ విలేఖరులతో అన్నారు. నిందితులపై సెక్షన్‌లు 304, 308, 337, 338 కింద కేసు నమోదు అయ్యాయని చెప్పారు.

ఘటన ఎలా జరిగింది?

వేసవి సెలవులు, అందులోనూ వారాంతం కావడంతో.. సాయంత్రం సరదాగా గడిపేందుకు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు గేమ్‌ జోన్‌కు వచ్చారు. ఒక్కసారిగా గేమ్‌జోన్‌లో మంటలు చెలరేగాయి. ఎగసిపడిన మంటలు దాటికి గేమ్‌జోన్‌ ఫైబర్‌ డోమ్‌ కూలిపోవడంతో తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రాత్రి 11 గంటల సమయానికి 27 మృత దేహాలను వెలికి తీశారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు. ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ స్పందించారు. రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Tags:    

Similar News