కాంగ్రెస్ చీఫ్ ఖర్గే దృష్టిలో ఏది ‘‘ఉగ్రవాదుల పార్టీ’’

ఇటీవలి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను "అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని" ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-12 15:11 GMT

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భారతీయ జనతా పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీని "ఉగ్రవాదుల పార్టీ"గా అభివర్ణించారు. ఇటీవలి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను "అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని" ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.

హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన తర్వాత ‘‘ ఈ గెలుపు దేశ ప్రజల మానసిక స్థితిని తెలియజేస్తుంది. కాంగ్రెస్, "అర్బన్ నక్సల్స్" ద్వేషపూరిత కుట్రలకు బలికామని తమ నిర్ణయాన్ని చెప్పారు’’ అన్న మోదీ కామెంట్స్‌కు ఖర్గే కాస్త ఆలస్యంగా రియాక్టయ్యారు. కాషాయ పార్టీలో ఉన్నవారు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారని, SC / ST లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

కర్ణాటకలోని కలబురగిలో ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. “మోదీ కాంగ్రెస్‌‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. మరి ఆయన పార్టీ సంగతేంటి? వాళ్లది ఉగ్రవాదుల పార్టీ. బీజేపీ నాయకులు ప్రజలపై దాడి చేయడం, షెడ్యూల్డ్ కులాల వ్యక్తుల నోట్లో మూత్ర విసర్జన చేయడం, గిరిజనులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారికి మద్దతిస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిచోటా షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులపై అఘాయిత్యాలు పెరుగుతాయి. ఆయన అనుకుంటే వీటిని నియంత్రించగలడు. కాని అలా చేయడు. వాటిని ఇతర పార్టీలమీదకు నెట్టే ప్రయత్నం చేస్తారు.” అని అన్నారు.

ఖర్గేకు బీజేపీ చురకలు..

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. పార్టీపై, మోదీపై నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని, ఖర్గే వ్యాఖ్యలు పార్టీ వైఖరికి అద్దం పడుతున్నాయన్నారు.

ప్రజల విజ్ఞతను అవమానించడమే..

‘‘2014, 2019, ఇప్పుడు 2024లో కోట్లాది మంది ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించారు. హర్యానాలో ఈవీఎం ఫలితాలపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ను, తర్వాత ప్రజలను నిందించడం మొదలుపెట్టారు. ఒకరకంగా ప్రజల విజ్ఞతను అవమానించడమే.’’ అని స్పందించారు.

చర్చకు సిద్ధమా?

ఖర్గే వ్యాఖ్యలపై కర్నాటక బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ పీటీఐతో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం, నక్సల్స్ కార్యకలాపాలు దాదాపు 80-90 శాతం తగ్గాయని, ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నక్సల్స్, ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం లేదన్నారు. ఒక నిర్దిష్ట వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ఎంతవరకైనా వెళ్తారు.

"ఇది ఖర్గేకి బహిరంగ సవాలు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల మోదీ పాలనలో, 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ పాలనలో నక్సల్స్, ఉగ్రవాద కార్యకలాపాలపై ఎవరు ఎలా స్పందించారో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.

Tags:    

Similar News