‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’కు ఎంపికయిన అనంతపురం చక్రిక
జాతీయ మహిళ జట్టులో ఆడడమే లక్ష్యం
క్రికెటర్ గా రాణించాలని తపన పడిన ఆ అమ్మాయి ఆ దిశగానే అడుగులు వేసింది. ఆ అమ్మాయి పట్టుదలను గమనించిన తండ్రి కూడా తన సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించాడు. దీంతో తపోవనంకు చెందిన పదమూడున్నర సంవత్సరాల వయస్సు లోనే ఆ అమ్మాయి జిల్లా, జోనల్ స్థాయిల నుంచి అండర్-19, అండర్-23 లలో తన సత్తా చాటుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తూ అతి చిన్న వయసులోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో స్థానం సంపాదించుకుంది. తాను కన్న కలను కలగానే భావించకుండా నిరంతరం కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకుంది. ఈ స్థాయికి రావడానికి తాను చూసిన సినిమా ఏది ? ఆ స్థాయికి చేరుకోవడానికి అమ్మాయి ఎలా కష్టపడింది ? భవిష్యత్తులో ఎలా ఉండాలని అనుకుంటోంది? అతి తక్కువ వయసులోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (Andhra Premier League) లో సెలెక్టర్ల దృష్టిని ఎలా ఆకర్షించింది ? లాంటి వివరాలను తెలుసుకునే ముందు… క్రికెట్ అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకుంటున్న ప్రస్తుత పరిస్థితులలో వారితో పోటీ పడుతూ ఏపీఎల్ లో స్థానం సంపాదించుకున్న ఆ అమ్మాయి పేరు దండు చక్రిక. అనంతపురంలోని తపోవనంకు చెందిన ఆ అమ్మాయి కథ కమామీషు …
కౌసల్య కృష్ణమూర్తి సినిమా స్ఫూర్తితో
తల్లిదండ్రులతో కలిసి ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూస్తూ తాను కూడా మంచి గుర్తింపు కలిగిన క్రికెటర్ గా రాణించాలని భావించిన దండు చక్రిక తాను క్రికెట్ ఆడతానని తండ్రికి చెప్పింది. దాన్ని మామూలు విషయం గా భావించిన తండ్రి దండు శివప్రసాద్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే పదేపదే అదే విషయాన్ని చెబుతూ తండ్రి పై ఒత్తిడి తెస్తూ ఉండటంతో కూతురును సమీపంలోని గ్రౌండ్ కు పంపించాడు. అలా ఒక క్రికెట్ బ్యాట్ తో క్రికెట్ ఆడడం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. అనంతరం కూతురు పట్టుదలను, ఓర్పును చూసిన తండ్రి క్రికెట్ కిట్ ను తెప్పించాడు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి గ్రౌండ్ కి వెళ్ళేది. అమ్మాయి పట్టుదలను చూసిన తండ్రి దండు శివప్రసాద్ కూతురుకు పూర్తిస్థాయిలో కోచింగ్ ఇప్పించాలని భావించాడు. ఇందుకుగానూ ఒక కోచ్ లను కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఆ అమ్మాయి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా క్రికెట్ ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం తొమ్మిదిన్నర గంటల వరకు ఫ్లడ్ లైట్ ల వెలుగులో ప్రాక్టీసు చేస్తూ శ్రమిస్తోంది.
అబ్బాయిలతో సమానంగా ప్రాక్టీస్
క్రికెట్ ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టిన మొదటి సంవత్సరంలోనే అబ్బాయిలతో సమానంగా ప్రాక్టీస్ చేసేది. దాన్ని గమనించి తల్లితండ్రులు అండర్ 15 సెలక్షన్స్ కు పంపించారు. అప్పటికి అమ్మాయి వయస్సు 12 సంవత్సరాల లోపు మాత్రమే. 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అండర్ 15 ఆడడానికి అవకాశం లేదని అనడంతో అప్పుడు డైరెక్టుగా అండర్ 19 ఆడించారు. ఆ సెలక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి ఎక్కువ వికెట్లు సాధించి జిల్లాకు సెలెక్ట్ అయింది. అంతటితో ఆగకుండా జిల్లా స్థాయిలో కూడా ఐదు వికెట్లు సాధించి జోనల్ లెవెల్ కి అర్హత సాధించింది. పన్నెండు సంవత్సరాలు దాటిన వారికి లో అండర్ 15 లో ఆడటానికి 2024 లో బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో, సౌత్ జోన్ స్థాయిలో బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ లోనూ మంచి ప్రతిభ కనపరచింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో, సౌత్ జోన్ లో ఎక్కువ వికెట్లు సాధించి ఆంధ్ర జట్టుకు సెలెక్ట్ అయింది.
ఆంధ్ర జట్టు కు 2024 లో ప్రాతినిధ్యం వహించి అదే సంవత్సరం ఇండియా స్థాయిలో బౌలింగ్ విభాగంలో 17 వికెట్లు పడగొట్టి ఏడవ ర్యాంకు సాధించింది. ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం అండర్ 19 విభాగంలో స్టేట్ ప్రాబబుల్స్, అండర్ 23 విభాగంలో స్టేట్ ప్రొబబుల్స్ కు అర్హత సాధించింది. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో అతి తక్కువ వయస్సు కలిగిన అమ్మాయి గా గుర్తింపు పొంది, వైజాగ్ “CHEETAS” టీమ్ కు సెలెక్ట్ అయింది. 2024-25 ఈ రెండు సీజన్ లలో ఆంధ్ర లో బౌలింగ్ విభాగం లో ఆంధ్ర సెలెక్టర్ ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఆంధ్ర తరపున మంచి ఆల్ రౌండర్ గా రాణించే అవకాశాలు ఉన్నాయని సెలెక్టర్ ల నుంచి కితాబు అందుకుంది.
ఏపీఎల్ లో అతి పిన్న వయస్కురాలు
ఈ సంవత్సరం నిర్వహించిన ఏపీఎల్ లో అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందింది. దీంతోపాటు చక్రిక 11 ఏళ్లకే అండర్ 19 లో జిల్లాస్థాయి లో క్రికెట్ ఆడింది. 23 సార్లు జోనల్స్ ఆడింది. ఈ ఏడాది ఏపీఎల్ లో ఆడే అవకాశం వచ్చి ఒక మ్యాచ్ కూడా ఆడింది. 2024 లో అండర్ 15 లో బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు తీసుకుని ఆల్ ఇండియా స్థాయిలో ఏడవ ర్యాంకు సాధించింది. లెగ్ స్పిన్నర్ గా రాణిస్తూనే బ్యాటింగ్ లోనూ పరుగుల వరద పారిస్తోంది.
అల్ రౌండర్ గా రాణిస్తూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి : దండు చక్రిక
అల్ రౌండర్ గా రాణిస్తూ భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలి. వివిధ లీగ్ లలో క్రికెట్ ఆడుతూ ఆల్ రౌండర్ గా రాణిస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలి. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. పాఠశాలకు కూడా వెళ్తాను. ట్రెల్లిస్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. స్కూల్ యాజమాన్యం నుంచి కూడా సంపూర్ణ ప్రోత్సాహం ఉంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా క్రికెట్ లో కూడా రాణిస్తున్నాను. నాకు తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి. వారు నాకు సహకారం అందించపోతే ఈ స్థాయికి చేరుకోలేను. మా అమ్మ చంద్రకళ, నాన్న శివప్రసాద్ అందించే ప్రోత్సాహం మరవలేనిది. ఈ సంవత్సరం మహిళ ల వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా గెలుచుకోవడం సంతోషంగా ఉంది. నేను కూడా అలాంటి అంతర్జాతీయ వేదిక లలో ఆడే మ్యాచ్ లలో భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను. దానిని సాధిస్తాను అన్న నమ్మకం ఉంది.
క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం : దండు శివప్రసాద్, దండు చక్రిక తండ్రి. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురు క్రికెట్ ఆడతాను అని చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. అయితే చిన్న వయసులో అమ్మాయికి ఏమి తెలియదు అనుకున్నా కానీ తాను పట్టుబట్టి క్రికెట్ ఆడడానికి ఒప్పించింది. దీంతో నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. అమ్మాయిని అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెంచాను. క్రికెట్ లో రాణించేలా శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఏపీఎల్ లో ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లా నుంచి భారత జాతీయ మహిళల క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలని కోరుకుంటున్నాను.
నరేంద్ర హీర్వాణీతో చక్రిక
ఇష్టంగా ఆడుతుంది : కోచ్ సాగర్
చక్రిక నెట్స్ లతో పాటు వివిధ మ్యాచ్ లలో ఇష్టంగా ఆడుతుంది. తను చాలా నేచురల్ గా ఆడుతుంది. తనలో ఉన్న నేచురల్ టాలెంట్ ను చూసి లెగ్ స్పిన్ బౌలింగ్ విభాగంలో ఒక సంవత్సరం పాటు కొన్ని కొన్ని స్పెసిఫిక్ కరెక్షన్ లు చేశాను. దీంతో రాష్ట్ర స్థాయిలో చక్రిక బౌలింగ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆలిండియా ర్యాంకింగ్ లో ఆంధ్ర టీం సెమీఫైనల్ లో ఓడిపోయినప్పటికీ చక్రిక మాత్రం ఏడవ స్థానం లో నిలిచింది. ఒకవేళ మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం చక్రిక ర్యాంకింగ్ లో ఒకటవ స్థానానికి చేరుకునేది. రానున్న రోజుల్లో జాతీయ మహిళ జట్టులో ఒక మంచి ఆల్ రౌండర్ గా స్థానం సంపాదింకుంటుంది.