పాక్ ఆటగాళ్లతో భారత హకీ ఆటగాళ్ల ‘హై ఫైవ్’ సంబరాలు
క్రికెట్ లో దాయాదీ ఆటగాళ్లతో కరచాలనం కూడా చేయని భారత ఆటగాళ్లు
By : Praveen Chepyala
Update: 2025-10-15 06:22 GMT
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆసియా కప్ వేదికగా, అలాగే భారత్ ఆతిథ్యం ఇస్తున్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో కూడా ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య కనీసం కరచాలనం కూడా జరగలేదు.
అయితే హకీ ఆటగాళ్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యండ్ ఇవ్వనప్పటికీ మ్యాచ్ అనంతరం ఆ దేశ ఆటగాళ్లతో ‘హై ఫైవ్’ సెలబ్రేషన్ చేసుకున్నారు.
మలేషియాలోని జోహర్ బహ్రులో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ లో తలపడిన ఇరుజట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అనంతరం ఈ విధంగా పలకరించుకున్నారు.
పిచ్ పై హై ఫైవ్స్..
భారత్- పాకిస్తాన్ ఆటగాళ్లు ఇద్దరు మైదానంలో ఉండగానే రెండు దేశాలకు చెందిన జాతీయ గీతాలు వినిపించాయి. తరువాత భారత ఆటగాళ్లు, పాక్ ఆటగాళ్లతో హై ఫైవ్ చేశారు.
మలేషియాలో అండర్ -21 క్రీడాకారులు చేసిన ఈ పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఏ క్రీడలలో కూడా ద్వైపాక్షిక సిరీస్ లకు అనుమతి ఇవ్వమని భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది.
పాక్ అనుసరిస్తున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంతం అయ్యే వరకూ ఇది కొనసాగుతుందని తెలిపింది. పహల్గాం ఉగ్రవాద దాడి, తరువాత ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ తో జరిగిన ఏ క్రీడలతో క్రీడాకారులతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి నిరాకరించారు.
ఆసియాకప్ లో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై పాక్ అగ్గిమీద గుగ్గిలం అయింది. తరువాత పాక్ అంతర్గత మంత్రి మెహ్ సిన్ నఖ్వీ చేతుల మీదుగా కనీసం ఆసియాకప్ తీసుకోవడానికి కూడా భారత ఆటగాళ్లు ఇష్టపడలేదు.
పీహెచ్ఎఫ్ ఏం చెప్పిందంటే..
పాకిస్తాన్ హకీ సమాఖ్య(పీహెచ్ఎఫ్) జాతీయ జట్టు ఆటగాళ్లకు కీలక సూచన చేసింది. మైదానంలో భారత ఆటగాళ్లతో ఎలాంటి ఘర్షణకు దిగకుండా ఉండాలని, సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ లో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించింది. భారత జట్టు కరచాలనం ఇవ్వదనే విషయాన్ని అర్థం చేసుకుని అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని కూడా వివరించినట్లు పీహెచ్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
‘‘భారత ఆటగాళ్లు మ్యాచ్ కు ముందు లేదా తరువాత కరచాలనం చేయకపోతే దానిని విడిచిపెట్టి ముందుకు వెళ్లాలని చెప్పాం. ఆటలో ఎలాంటి భావోద్వేగాలు, గొడవలు, సంజ్ఞలు ఇవ్వొద్దని కూడా చెప్పాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఆగష్టులో బీహర్ లోని రాజ్ గిర్ లో జరిగిన ఆసియా పురుషుల హకీ కప్ పోటీలకు పాక్ తన జట్టును పంపలేదు. వీరి స్థానంలో బంగ్లాదేశ్ వచ్చింది.