క్రికెట్ జాతర ఐపీఎల్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;

Update: 2025-03-12 11:44 GMT

ఐపీఎల్ మొదటి ఎడిషన్ ఏప్రిల్ 2008లో నిర్వహించాలని బీసీసీ నిర్ణయించింది. అప్పటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఎలా జరగాలి, ప్రైజ్ మనీ ఎంత, మిగతా నిబంధనలు అన్ని చర్చించి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఏడు మందితో ఒక కమిటీని తయారు చేసి దానికి ఐపీఎల్ నిర్వహణ మొత్తం అప్పగించారు. ఒక్కో ఫ్రాంచైజీ కి ఒక్కో జట్టును ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికోసం జనవరి 24, 2008 లో వేలంపాట నిర్వహించారు. చివరికి ఏప్రిల్ 18,2008 లో ఐపీఎల్ మొదలైంది. అలా ఐపిఎల్ ప్రధాన కార్యాలయాన్ని బొంబాయి లోని చర్చ్ గేట్ దగ్గర లో ఉన్న వాంఖడే స్టేడియం పక్కన ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ఐపిఎల్ పరిపాలన కార్యక్రమాలన్ని జరుగుతాయి.

ఐపిఎల్ మొదటి ఎడిషన్(2008) లో 8 జట్లు పాల్గొన్నాయి. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, దక్కన్ చార్జర్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కాలక్రమైనా కొత్త ఫ్రాంచైజీలు, జట్లు కూడా ఐపిఎల్ టోర్నమెంట్లలో పాల్గొన్నాయి.

అయితే కొన్ని ఫ్రాంచైజీలు తర్వాత విరమించుకున్నాయి. డెక్కన్ చార్జెస్ (2008 -2012) కోచి టస్కర్స్ కేరళ (2011) మాత్రమే ఆడింది, పూణే వారియర్స్ ఇండియా 2011,2012,2013 సీజన్స్ ఆడారు, రైజింగ్ పూణే సూపర్ జయాంట్స్ 2016 2017,2018 వరకు పాల్గొనింది గుజరాత్ లయన్స్ 2016, 2017,2018 సీజన్లలో ఆడారు. కొన్ని బ్రాంచీలు బీసీసీఐ తో ఆర్థికపరమైన లావాదేవీల వ్యవహారం వల్ల మధ్యలో విరమించుకున్నాయి.

కేవలం ఐపీఎల్ కే వర్తించే కొన్ని నిబంధనలు

ఐపీఎల్ బీసీసీఐ, ఐసీసీ గుర్తింపు పొందినప్పటికీ, దానికే ప్రత్యేకమైన కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకుంది. అందులో కొన్ని ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ టి20 మ్యాచ్ ల కన్నా భిన్నంగా ఉంటాయి. 2008 నుంచి 2024 వరకు వీటిలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి.

* అందులో టెలివిజన్ టైం అవుట్ ఒకటి. ప్రతి జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు గాని, బ్యాటింగ్లో గాని రెండున్నర నిమిషాల వ్యూహాత్మక(strategic) టైం అవుట్ తీసుకోవచ్చు బౌలింగ్ చేసే జట్టు అయితే 6 7 8 లేదా తొమ్మిదో ఓవర్ లలో ఏదో ఒక ఓవర్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు అలాగే బ్యాటింగ్ చేస్తున్న జట్టు 13 14 15 16 ఓవర్ల తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు.

*2018 లో మొదటిసారి డిఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టం) అంటే నిర్ణయ పున సమీక్ష పద్ధతి ని అమలు చేశారు.

2023 సీజన్ నుంచి దీన్ని నోబాల్, వైడ్ లకు కూడా విస్తరించారు. ఇప్పుడు బౌలర్ తన బౌలింగ్లో ఎంపైర్ నో బాల్ ఇచ్చినప్పుడు, దాన్ని పున సమీక్షకు కోరవచ్చు, అలాగే వైడ్ ఇచ్చినప్పుడు కూడా.

* బౌలింగ్ చేస్తున్న జట్టు నిర్ణీత సమయంలో తన ఓవర్లను పూర్తి చేయలేకపోతే, తర్వాత చేసే ఓవర్లకు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్ సర్కిల్ కు బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే నియమించాలి. . అదికాకుండా మ్యాచ్ రిఫరీ భావిస్తే మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించవచ్చు.

*ఇంపాక్ట్ ప్లేయర్" అనే సౌకర్యం రెండు జట్లు తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు సబ్సిట్యూట్ ఫీల్డర్ గా ఉన్న ఆటగాడిని ఆటలోకి తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సౌకర్యం ఏ అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా లేదు. ఇది కేవలం ఐపిఎల్ కే ప్రత్యేకం.

* ఏ ఫ్రాంచైజీ అయినా సరే గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే జట్టులోకి తీసుకోవాలి.

ప్రతి సీజన్ కు ముందు, ఫ్రాంచైజీలు వేలంపాటలో తమకు కావలసిన ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. ఇతర జట్లు వద్దనుకున్న ఆటగాళ్లను కూడా అధిక మొత్తం చెల్లించి తీసుకోవచ్చు.

అలా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడడానికి ఎంతో మంది ఆటగాళ్లు తహతలాడుతుంటారు. ఎందుకంటే తమ దేశంలో ఉన్న క్రికెట్ బోర్డులు ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా ఐపీఎల్ చాలా ఎక్కువ. పైగా తమ దేశం తరపున ఆడుతున్నప్పుడు, కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఐపీఎల్ అలా కాదు. ఐపీఎల్ లో చాలా స్వేచ్ఛ ఉంటుంది. ప్రేక్షకులతో పాటు, ఆటగాళ్లు కూడా ఒత్తిడి లేకుండా ఆడి ఎంజాయ్ చేయగలిగే గుర్తింపు పొందిన టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక్కటే!

డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన మ్యాచ్ లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ 18 ఏప్రిల్ 2008లో మొదలై జూన్ 1,2008లో పూర్తయింది. దీన్ని మాత్రం డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఆడించారు. అంటే ప్రతి జట్టు మిగతా ఏడు మంది ప్రత్యర్థులతో తమ ఫ్రాంచైజీ సొంత స్టేడియంలో ఒక మ్యాచ్, ప్రత్యర్థి ఫ్రాంచైజీ స్టేడియం లో ఒక మ్యాచ్ ఆడారు. అలా మొత్తం 59 మ్యాచ్ లు జరిగాయి. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వేలంలో పాల్గొనలేదు ఎందుకంటే వారిని ఐకాన్ ప్లేయర్స్ గా నిర్ధారించారు. వారు తమ సొంత నగరంలోని ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు కనుక.

మొట్టమొదటి ఐపీఎల్ టోర్నమెంట్(2008) ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. అత్యంత సంచలనాత్మకమైన మ్యాచ్ లలో ఒకటిగా భావిస్తున్న ఈ మ్యాచ్ లో, చెన్నై సూపర్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడించింది.

2008 నుంచి 2024 వరకు విజేతలు ల వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్ 5 (2010,11,18,21,23)

ముంబై ఇండియన్స్ 5 (2013,15,17,19,20)

కోల్కత్తా నైట్ రైడర్స్ 3 (2012,14,24)

డెక్కన్ చార్జర్స్ 1 (2009)

సన్ రైజర్స్ 1 (2016)

రాజస్థాన్ రాయల్స్ 1 (2008)

గుజరాత్ టైటాన్స్ 1 (2022)

(సశేషం)

Tags:    

Similar News