గద్దర్ కు కాంగ్రెస్ ‘పట్టాభిషేకం’: ఎందుకు?

నంది అవార్డులను ఇక మీద గద్దర్‌ అవార్డులుగా అందిస్తాం. వచ్చే ఏడాది గద్దర్‌ జయంతిన కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డు అందజేస్తాం: సిఎం రేవంత్

By :  Vanaja
Update: 2024-04-05 04:00 GMT

 -రమణాచారి

రాష్ట్ర ప్రభుత్వం సినీరంగంలో ఇచ్చే "నంది అవార్డు" పేరును "గద్దర్ అవార్డు"గా పేరు మార్చినంత మాత్రాన తెలంగాణ కవులు, కళాకారులు,ప్రజలకు ఒనగూరేది శూన్యం.

ప్రజల ఆకాంక్షల అమలుకు క్రుషి చేయకుండా, ద్రుష్టి మర్లించి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసే ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. పేరు మార్పు తో అవార్డు ప్రకటన గద్దర్ స్థాయిని తగ్గిస్తుంది. పండిత పామరులను పరవశింపజెసే శక్తిగల, ప్రజా యుద్ధ నౌక గా కీర్తింపబడే గద్దర్ మీద గౌరవం ఉంటే ప్రత్యేకంగా ఒక అవార్డు ఏర్పాటు చేయాలి. దానిని జానపద కవులు- కళాకారులకు ఇచ్చి సత్కరిస్తే గొప్పగా ఉండేది.

అవార్డులు, రివార్డుల కోసం ... ఏ ప్రజా కళాకారుడు ఏనాడూ గోచికట్టి, గొంగడేసి, గజ్జెకట్టి ఆడలేదు, పాడలేదు. పీడిత ప్రజల విముక్తి కోసమే గద్దర్ శ్రమించారు. బాధలు పడ్డారు. నిర్భంధాలను, కేసులను ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్ళారు. కవులు కళాకారులు తెలంగాణ విముక్తి కోసం, వనరులు పరిరక్షణ కోసం, స్వీయ గౌరవం కోసమే పాటుపడ్డారు ,ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాలకవర్గాలు ప్రజల ఆకాంక్షలను సొమ్ము చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే... ముఖ్యంగా తెలంగాణాలో ఈ వినియోగం పరాకాష్టకు చేరింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం అంశాలపై చర్చ జరుగుతోంది. నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని పలు రాజకీయ పార్టీలు పోటీపడి వివిధ పేర్లతో పలు కార్యక్రమాలు నిర్వహించడం చూశాం. పోరాట వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలను గమనించాం.


ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో "ఇంద్రవెల్లి అమరుల స్థూపం"ను దర్శించి నక్సలైట్లే దేశభక్తులన్నాడు. ఆతర్వాత తీవ్ర నిర్భంధం పెంచి బూటకపు ఎన్ కౌంటర్లు చేయించాడు. మామను దింపి గద్దెనెక్కిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అంతటా రక్తపుటేరులు పారించాడు. అసెంబ్లీలో "తెలంగాణ" అనే పదం వాడొద్దనీ, వెనుకబడిన ప్రాంతం అనాలని "హుకుం జారీ" చేశాడు. గద్దర్ పై కాల్పులు జరిపింది.., బెల్లి లలితను హత్య చేయించింది.., పౌరహక్కుల నేతలను పొట్టన పెట్టుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే. "ఆటా-పాటా- మాట బంద్" చేసి అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసింది, ప్రపంచ బ్యాంకు సి.ఇ.ఓ. గా కీర్తింపబడింది చంద్రబాబే కదా! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో పౌరహక్కుల సంఘం సభలకు అతిథిగా హాజరైన కె.సి.ఆర్. అవసరమైతే పౌర హక్కుల సంఘానికి అధ్యక్షుడు అవడానికే తాను ఇష్టపడతానని గాంభీర్యం ప్రదర్శించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అయిన తర్వాత పౌర ప్రజాస్వామిక వాదులపై అక్రమ కేసులు, శ్రుతి-సాగర్ వంటి ఎన్ కౌంటర్లు పరిపాటిగా మారాయి.

పాలకులు ఇప్పుడు కొత్త వేషాలలో వస్తున్నారు.తెలంగాణా ప్రజల త్యాగాలను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విప్లవాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను కలలుగని, అక్రమ కేసులు ఎదుర్కోలేక రాజీమార్గం పట్టిన వాడు గద్దర్. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాగించిన దుర్మార్గ పాలనా చరిత్రను అనేక వేదికలపై విడమరిచి వివరించాడు, తూర్పారబట్టాడు .పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం రాజకీయ పార్టీల వెంట నడిచాడు.

రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలని మాత్రమే, ప్రతిపక్ష కాంగ్రెస్ కు మద్దతు పలికాడు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని, పౌర ప్రజాస్వామిక వాదులు మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది‌. ప్రజాస్వామ్య పునరుద్ధరణ"ఓట్ల గారడీ" లో అంశం మాత్రమే. ఉద్యమకారులపై బనాయించిన కేసులు ఎత్తివేయలేదు. ఎన్ కౌంటర్లు ఉండవని ప్రకటించలేదు. ప్రభుత్వ భూములలో వేసుకున్న పేదల గుడిసెల పైకి బుల్డోజర్లు పంపి కూల్చివేయడం కొనసాగుతోంది. పెద్దలు చేసిన అక్రమ నిర్మాణాల జోలికి పోయే నాధుడే లేడు. పారిశ్రామిక కాలుష్యం నివారించడానికి "ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి, ఫార్మా విలేజ్ "నిర్మాణం చేస్తామని ప్రకటించడం ఎవరి కోసం ? తెలుగుదేశం పాలనలో, తర్వాత మూతపడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు తెరిపించే ప్రయత్నాలు కానరావడం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసులేదు. రాజకీయ రాబందుల, కబంద హస్తాలనుండి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోగలరా? ఇలాంటి ఎన్నో సమస్యలు ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయి.

తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నిన్నటి వరకు అడ్డుకున్నారు. తెల్లాపూర్ ప్రజలు ధర్నాలు, నిరసన దీక్షలు, నిరసన ర్యాలీలు చేసిన తర్వాత ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వివాద పరిష్కారానికి, విగ్రహం ఏర్పాటు ఆటంకాలను తొలగించాలని కోరేందుకు సి.ఎం. రేవంత్ రెడ్డి ని కలిసేందుకు ఇన్నారెడ్డి, జె.బి.రాజు లతో కలిసివెళితే తమను కలవకుండానే వెళ్ళి పోయాడని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి స్వయంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సంస్మరణ సభలో వక్కాణించారు.ఆ తర్వాత గద్దర్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు .

ఇప్పుడు మరో ముందడుగు వేసి సినీ పరిశ్రమలో (నిజానికి ఇది పరిశ్రమ కాదు) నటులకు ఇచ్చే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది‌‌. ఈ పరిణామాలను ప్రజలు అంత తేలికగా మరచిపోతారా?ఎన్నికల సమయంలో ఇలాంటి "గారడీ, గజకర్ఢ-గోకర్ణ టక్కుటమార విద్యలు" ప్రదర్శించడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, భాగస్వామ్యం లేనివారు అధికార పదవులను దక్కించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఆడే "పాచికల ఆటలాంటి"వని ప్రజలు గుర్తెరగాలి.

ప్రధానంగా తెలంగాణ ప్రజల "భావోద్వేగాలతో ఆటలాడుతూ" అధికార అందలాలు దక్కించుకోవడం పరిపాటిగా మారింది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా, తాత్సారం చేసేందుకు, ప్రజలను ఏమార్చి విప్లవాభిమానులను ఓట్లుగా మలుచుకునేందుకు వేసిన ఎత్తుగడే "గద్దర్ అవార్డు" ప్రకటన."ప్రజాస్వామిక తెలంగాణ సాధనతోనే తెలంగాణ ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం ఉందని" నినదించిన, పోరాడిన, ఉద్యమకారులు,ప్రజలు ఎవరూ అంత తేలికగా "పాలకుల మాయాజాలానికి" మోసపోరు‌. ఆరు దశాబ్ధాల సుదీర్ఘ ఉద్యమంలో రాజకీయ లబ్ధి కోసం పార్టీలు పెట్టె ప్రలోభాలు ఎన్నింటినో చూసిన ప్రజలు , ప్రజాస్వామిక వాదులు జాగురూకులై గమనిస్తారని మర్చిపోవద్దు సుమా! కవులు, కళాకారులారా. తస్మాత్ జాగ్రత్త!

(The Federal Telangana seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal.)

Tags:    

Similar News