స్టార్టప్ కంపెనీలలో చైనా ఎందుకు ఇండియాకంటే చాలా ముందుంది?

స్టార్టప్ కంపెనీలలో చైనాకు ఇండియాకు తేడా ఏమిటి?;

Update: 2025-04-05 07:57 GMT

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పియూష గోయల్ అంకుర సంస్థ (startup) ల రెండవ మహాకుంభ ప్రారంభ సమావేశంలో 3-4-2025 న మాట్లాడుతూ “మనం యువకుల్ని ఫుడ్ డెలివరీ బోయ్ లు గా మార్చుతుంటే, చైనావారు సెమికండక్టర్లు, కృత్రిమ మేధా రంగాలలో దూసుకు వెళుతున్నారు” అని ఒక వాస్తవచిత్రాన్ని వివరించా రు. భారత , చైనా దేశాలలోని అంకుర సంస్థలను పోల్చి చూపుతూ ఆయన దేశ అభివృద్ది, సాంకేతిక ప్రగతి లో అంకుర సంస్థల పాత్ర, ఆ సంస్థల నిర్వహణలో భారత చైనా దేశాల మధ్య వున్న భేదాల గురించి సోదాహరణం గా వివరించారు. నైపుణ్య సాధనలో గల వ్యత్యాసాల గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్

ఒక స్లయిడ్ ద్వారా రెండు దేశాల మధ్యగల తేడాలను స్పష్టంగా వివరించారు.[ టైమ్స్ ఆఫ్ ఇండియా 4-4-25 ఉదయం వార్తా నివేదిక] అయితే అదే మంత్రి 4-4-25 న అంటే సమావేశం రెండో రోజున భారతీయ యువ స్టార్ట్ అప్ కంపెనీలు సాధించిన ప్రగతి పట్ల తాను చాలా సంతృప్తి చెందానని, ప్రపంచ స్థాయి సాంకేతిక వినియోగంలో మనం ముందు వరసలో వున్నామని ఇప్పటికే ఈ రంగంలో పడిన పునాదులు చాలా బలంగా వున్నాయని, వీరి అన్వేషణల గురించి వింటూ వుంటే మధురమైన సంగీతాన్ని వింటున్నట్లుగా వుందని పత్రికా విలేకరులకు చెప్పారు. [ఎకనామిక్ టైమ్స్ 4-4-25 సాయంత్రం కథనం ] మంత్రి గారి స్వవచనం లోని వైరుధ్యాన్ని కాస్త వివరంగా చూద్దాము.

భారతదేశంలో అంకుర సంస్థలు ఏమి చేస్తున్నాయి?

1. నిరుద్యోగ యువకులని చౌక కార్మికులుగా వాడుకుంటున్న ఆహార సప్లయ్ యాప్స్ : ధనిక యువకులు కాలు కదపకుండా వారి ఇంటికే ఫుడ్ డెలివరీ చేయటం జరుగుతోంది.

2. ఐస్ క్రీమ్, కుకీలు వంటి నిరుపయోగ తిండి పదార్ధాలను ఆరోగ్యకరమైన ఆహారం గా ఏమార్చి మార్కెట్ చేయటం. నిజాని కవి ఆరోగ్యానికి హాని కలిగించేవి అని అందరికీ తెలుసు.

3. కావలసిన నిత్యావసర వస్తువులు, కిరాణా దినుసులు, మరే సరుకుల నయినా అతి శీఘ్రంగా , వేగవంతమైన వాహనాల ద్వారా మీరున్నచోటికే అందించటం. ఆర్డరు పీట్టి నప్పటినుంచి డెలివరీ వరకు వినియోగదారుడు ఆతృతగా ఎదురు చూస్తూ బద్దకంగా టైమ్ వేస్టు చేస్తూ గడపటం, సరుకులకు సర్వీస్ ఛార్జీ తో సహా ఎక్కువ సొమ్ము చెల్లించటం

4. సరదా ఆటలు, బెట్టింగులు , జూదం లాంటి సెల్ఫోను యాప్స్ ను ప్రోత్సహిస్తూ, యువతను వ్యసన పరులుగా దిగ జార్చటం, వారిని నిర్వీర్యులుగా మార్చటం, దానితో వారు నిజమైన ఉత్పత్తి కార్యక్రమా లలో పాల్గొనకపోవటం

5. వృధా కాలక్షేపపు వినోద సంస్కృతిని నింపి రీల్సు, షార్ట్స్ వంటి యాప్స్ ద్వారా ఆకర్షించి నిజమైన జ్ఞానానికి చైతన్యానికి ప్రజలను దూరం చేయటం. మన యువతరానికి అందుబాటులో వున్నవి ఈ కాలహరణం చేసే పాచికలే. ఈ సాంకేతిక యుగంలో ఇవీ మన దగ్గర యాప్స్ ద్వారా సాధిస్తున్నది.

ఇక చైనాలో వున్న పరిస్థితి ఏమిటి?

1. ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయగల స్థాయిలో ఎలక్ట్రిక్[ యి వి], బ్యాటరీ రవాణా వాహనాలను తయారు చేసె కంపెనీలు మొదలు పెట్టటం –BYD లాంటివి

2. సెమీ కండక్టర్లు , కృత్రిమ మేథో రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టి స్వయం పోషకత్వాన్ని సాధించటం, ఆత్మ నిర్భరత తో భవిష్యత్తు అవసరాలకు కావలసిన రీతిలో చిప్స్, ఏఐ మోడల్సు తయారు చేసు కోవటం, వీటిలో యువ కులు అధిక సంఖ్యలో పాల్గొనటం.

3. ప్రపంచం లో మరెక్కడా లేనంత నైపుణ్యం గల రోబోట్లు ఆటోమేషన్ పరికరాలు తయారు చేయటం, రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ది చేయటం

4. ప్రపంచంలోని ఏ మూల కైనా సప్లై చేయగల సప్లై చైన్లు, హైస్పీ డు రవాణా సౌకర్యాలు అభివృద్ది పరచటం— ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించ గల షీన్, DJI, ఆలీబాబా వంటి సంస్థలను అభివృద్ధి చేయటం.

5. స్పేసు టెక్నాలజీ [రోదసీ సాంకేతికత ], బుల్లెట్ ట్రై న్లు , ఎనర్జీ [ ఇంధనం, సోలార్ విద్యుత్ ] వంటి రంగాలలో సాంకేతిక కృషి కొనసాగిస్తూ మౌలిక వసతులను భారీగా పెంచుకోవటం, తమ శక్తి యుక్తులను క్రోడీకరించుకోవటం, యువశక్తిని సామాజిక అభివృద్దిలో భాగం చేయటం, వారిని పూర్తిగా వినియోగించు కొనటం జరుగుతోంది అని వాణిజ్య శాఖ మంత్రి గోయల్ వివరించారు.

అంతే కాదు, మన దేశంలో అభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకి, యువ శాస్త్ర వేత్తల వికాసానికి తోడ్పడగల ఈ అంకుర సంస్థలలో దేశీయ పెట్టుబడి అంతగా సమీకరించ బడటం లేదు. యువ మేధావులు కొద్ది పెట్టుబడికి సైతం విదేశాలపై ఆధారపడుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు స్వలాభార్జన కోసం చిన్న సంస్థ లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆ సంస్థలలో చేరి పెద్ద భాగస్వాములవు తున్నారు . మన యువకుల ఆలోచనల్ని అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. “ 25 ,50 లక్షల చిన్న మొత్తానికి కూడా భారతీయ యువ మేధావి తన అద్భు తమైన మేధో ఆవిష్కరణ ను , విదేశీ పెట్టుబడిదారునికి అమ్మి వేసు కుంటున్నాడని తెలిసి నేను చాలా కలత చెందాను. మనం ఈ స్థితిని మార్చాలి. మీ ఐడియాకు మీరే యాజమాని గా వ్యవహరించండి. మీరు ఒక ఉద్యోగి గానో , చిన్న భాగస్వామి గానో కాదు, మీ సంస్థకు మీరే పూర్తి స్వంతదారునిగా నిలబడాలి. దానికి కావలసిన దేశీయ పెట్టుబడిని సమీకరించటం లో మనం కలిసి కృషి చేద్దాము.” అని మంత్రి సెలవిచ్చారు.

కానీ పెట్టుబడి రుణాలు కూడా సరిగ్గా, సమయానికి అందకా, ప్రభుత్వం లోని బ్యూరోక్రటిక్ పద్దతులు, అవినీతి, బాధ్యతా రాహిత్యం తో విసిగి పోయిన యువకులు నిర్వేదంతో, నిరుత్సాహం తో వచ్చిన మేరకు తృప్తి పది గత్యంతరం లేక తమ పరిశోధనా ఫలితాలను, నూతన ఆవిష్కరణలను విదేశాలకు, అక్కడి పెట్టుబడి దారులకు అందించి తమ బతుకులనే తాకట్టు పెడుతున్నారన్నది అసలు వాస్తవం.

మనదేశంలో STEM [ స్టెమ్ -- సైన్సు , టెక్నాలజీ, ఇంజనీరింగ్ , మాథ మటిక్స్ -గణితం-] పట్టభద్రులు చాలా ఎక్కువ. వేల మంది యువతీ యువకులు ఏటా డిగ్రీలు చేత బట్టుకుని కాలేజీ ల నుండి బయటకు వస్తున్నారు. కానీ మనం వారిని ఎలా వినియో గిస్తున్నాము. వారితో ఏమి చేయిస్తున్నామువారి చదువులకు, నైపుణ్యాలకు తగిన పనిని కల్పించలేకపోతున్నాము. వాళ్ళని స్వీగ్గి , జోమాటొ వంటి వారి సేవకులుగా మారుస్తున్నాము. అదే ఉపాధిగా చూపిస్తున్నాము. ఈ యువతీ యువకులను చూసి గర్వ పడటానికి ఏముంది? ఈ స్థితిని కూడా మంత్రి గారు సరిగ్గానే వర్ణించి “మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. యువతరం కోసం మనం మరింత పూనికతో కృషి చేయాలి.

గతంలో ప్రధాన మంత్రులు గా వ్యవహరించిన లాల్ బహదూర్ శాస్త్రి “ జై జవాన్, జై కిసాన్” అని నినదించారు. దానికి వాజపాయి “ జై విజ్ఞాన్” అని కలిపారు. మోడీ దానిని మరింత విస్తరించి “జై అనుసంధాన్” అంటున్నారు అంటే శాస్త్ర పరిశోధన ను మరింత గా అభివృద్ది చేయాలని అంటున్నారు. మనం ఆ దిశలో అడుగులు వేద్దాం” అని శ్రీ గోయల్ పిలుపు నిచ్చారు. వారిని ఐస్ క్రీమ్ సప్లయికి వాడుకుందామా లేక ఎలక్ట్రానిక్ చి ప్ తయారీకి వాడుకుందామా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు . వెంటనే సరుకులు సప్లై చేసే జేప్టో సంస్థ సహవ్యవస్థా పకుడు “ కన్స్యూమర్ స్టార్టప్ సంస్థను విమర్శించటం తేలికే గాని మేము లక్షన్నర మందికి ఉద్యోగం కల్పించాము” నాలుగేళ్లలో మేము సంవత్సరానికి వెయ్యి కోట్లకు మించి పన్ను కడుతున్నాము అని చెప్పాడు.

గమనించవలసింది ఈ కంపెనీలో వెయ్యి కోట్ల డాలర్లకు మించిన విదేశీ పెట్టుబడులు వున్నాయి. చైనాలో కూడా ఈనాటి పెద్ద సాంకేతిక దిగ్గజాలు ఆహార సప్లై సంస్థలుగానే మొదలయ్యాయని ఆలీబాబా కూడా ఒకప్పుడు నిత్యావసర వస్తువులు ఇళ్లకు చేర్చే వాడే అని కొందరు నసుగుతున్నారు. ఇన్ఫోసిస్ మాజీ సి యి ఒ మోహన్దాస్ పాయి “భారతీయ అంకురా కంపెనీలను చిన్న చూపు చూడవద్దు ప్రభుత్వం తాను కోరుకుంటున్న ఉన్నత సాంకేతిక సంస్థల ప్రారంభానికి తగిన వాతావరణం కల్పించాలి. తగిన వనరులు , ఆర్ధిక పాదార్ధిక సహాయము అందించటం పై కేంద్రీకరిస్తే మేలు జరుగుతుంది. ఉన్నతస్థాయి అంకుర కంపెనీల స్థాపన కోసం గోయల్ ఏమి చేశాడో ముందు చెప్పాలి . నిర్మలాసీతారామన్ వాటికై ఎంత నిధులు ఇస్తుందో చెప్పాలి అని ఆయన అడిగారు. బహుశా పరిశ్రమాధిపతులనుండి ఎదురైన ఇలాంటి విమర్శల వల్ల గోయల్ మరు రోజు కొత్త సంగీతం వినిపించారు.

ప్రభుత్వ నినాదాలయితే నాద స్వరం లా వీనుల విందుగా వున్నాయి కానీ ఆచరణలో ఎందుకు వెనుకబడి వున్నాము అనేది అసలు ప్రశ్న. దేశీయ పెట్టుబడులు ఎందుకు రావటం లేదో తెలుసుకోవాలి. విదేశీ కంపెనీలు వీటిపట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలియాలి. దేశీయ పెట్టుబడిదారులు ఇలాంటి అంకుర సంస్థలకు, యువ మేధావులకు తగిన ప్రోత్సాహం ఇవ్వనందు వలన, కొత్త ఐడియాలను త్వరగా స్వీకరించక పోవటం వల్ల, మన యువ శాస్త్రజ్ఞుల పట్ల విశ్వాసం లేక పోవటం వల్ల , అంతకు మించి మన బడా పెట్టుబడిదారులు స్వయంగా తామే విదేశీ కార్పొరేటు భాగస్వామ్యం కోసం అర్రులు చాస్తూ వుండటం వల్ల- యువకులు విదేశాల వైపు చూస్తున్నారు.

విదేశీ పెట్టుబడిదారులు మంచి లాభాలు వస్తాయని భావించే సంస్థలను గుర్తించి, ఆర్ధిక తోడ్పాటు పేర వాటిని ఆకర్షించి “ఆదుకుని” ఆ పిదప వాటిని తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఈ రకంగా మన పెట్టుబడిదారు విదేశీ పెట్టుబడికి దళారి గా మారి పోతున్నాడు. ఈ పాత్రను తుంచి వేయకుండా, ఆ విదేశీ దోపిడిని తరిమి వేయకుండా మంత్రి గారు ఎంత బాధ పడినా ఏమి ప్రయోజనం వుంటుంది? కనీసం చైనా సాగిస్తున్న స్వతంత్ర అభివృద్ది పంథాను, జాతీయ ప్రయోజనా లకు పెద్ద పీట వేసే విధానాలను అనుసరించ కుండా అభివృద్ది ఎలా సాధ్యం? యువకుల మేధస్సును వారి శక్తి యుక్తులను మన అభివృద్ధి పథం తో అనుసంధానం చేయకుండా పురోగతి ఎలా సాధ్యం ?

Tags:    

Similar News