రాయలసీమ రైతును కాటేస్తున్న ‘సోలార్’
కరువు భూముల కన్నేసిన కార్పొరేట్ పెద్దలు;
-సిహెచ్ వేణుగోపాలరెడ్డి
విద్యుత్ లేని ఆధునిక సమాజాన్ని ఊహించలేము. నిత్య జీవితంలో విద్యుత్ వాడకం పెరుగుతున్నది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి పెరగాలి. శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ఫలితంగా గాలి, సూర్యరశ్మి, అణుశక్తితో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 72 శాతం బొగ్గుతో తయారయ్యేది. ఇది చాలా ఖర్చుతో కూడుకోవడమే కాక, పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే ఈ గ్రీన్ ఎనర్జీ పేరుతో వ్యవసాయాన్ని బలి పెట్టడాన్ని ప్రశ్నించాలి. గ్రామీణ వ్యవస్థను తీవ్రంగా ఛిద్రం చేసే ఈ సోలార్ ఉత్పత్తి రాష్ట్రాభివృద్ధికా? కార్పొరేట్ల కోసమా? తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే గాలి, సూర్యరశ్మి విద్యుత్‌ను ప్రభుత్వం ఉత్పత్తి చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోకి వచ్చి, కేంద్ర ప్రభుత్వ అండదండలతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన విధానాలను తెచ్చుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చాటున లక్షల ఎకరాల భూములను ఈ కంపెనీలు కొనడం లేదా లీజు పద్ధతుల్లో స్వాధీనం చేసుకోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. వ్యవసాయాన్ని ముంచేందుకు ఈ సోలార్ కంపెనీలు సిద్ధమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కరువు జిల్లాల్లోనే సోలార్ ప్రాజెక్టులు ఎందుకు?
ప్రజల జీవితాలను ఛిద్రం చేసే కరువును కూడా ‘కొందరు’ ప్రేమిస్తారని చాలా సంవత్సరాల క్రితం ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. కరువును అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడే అధికారులు, పేదలకు ఇచ్చే బియ్యం అమ్ముకుని కార్లు, బంగ్లాలు కొనే రాజకీయ నాయకులు, కరువు పనుల పేరుతో చేయని పనులకు బిల్లులు పెట్టుకుని కొల్లగొట్టే కాంట్రాక్టర్లు కరువును ప్రేమిస్తారని ఆయన పరిశోధనాత్మకంగా విశ్లేషించారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు కరువును ప్రేమిస్తున్నాయి. కరువు నుండి ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తున్నాయి. భూముల నుండి రైతులను ఖాళీ చేయిస్తున్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సగటు వర్షపాతం తక్కువగా వుంటుంది. అందువల్ల వేడి ఎక్కువగా వుంటుంది. సంవత్సరంలో సుమారు 324 రోజులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ ప్రాంతంలో వుంది. ఇక్కడి పగటి వేడి, రాత్రి, పగలు వీచే గాలులు విండ్ మిల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలంగా వున్నాయి. అందువల్ల సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి గత పది సంవత్సరాల్లో ఈ జిల్లాల్లో భారీగా పెరిగింది. అనంతపురం జిల్లాలో 2022-23 నాటికి డిస్కమ్ (డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో 3,755.26 మెగావాట్ల సోలార్ విద్యుత్, 3,693.55 మెగావాట్ల గాలిమరల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్‌లో 89 శాతం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనే తయారవుతుంది. అనంతపురం జిల్లాలో 43 శాతం, కర్నూలు 28, కడప 18 శాతం సోలార్ ఉత్పత్తి అవుతుంది. నీటి పంపింగ్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఐదు హైడ్రో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం జరిపిన అన్ని మంత్రివర్గ సమావేశాలు ఈ ప్రాంత భూములను సోలార్, విండ్ మిల్ కంపెనీలకు కేటాయించా యంటే కరువును వారు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది.
మరో 38 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కి ప్రణాళిక
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సోలార్, గాలిమరల విద్యుత్ ప్రాజెక్టులు కాకుండా అదనంగా మరో 38 గిగావాట్ల విద్యుత్‌ను సోలార్ ద్వారా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక గిగావాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావాలంటే 5 వేల ఎకరాలు కావాలి. అంటే 38 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 1,90,000 ఎకరాలు భూమి కావాలి. ఇందుకోసం కర్నూలు జిల్లాలో 31,450 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 29,983, కర్నూలు జిల్లాలో 29,549, ప్రకాశం జిల్లాలో 9,630 ఎకరాలు మొత్తం 1,00,612 ఎకరాల సర్వే పూర్తి చేశారు. ఇందులో అదానీ కంపెనీకి 75,000 ఎకరాలు, అంబానీ కంపెనీకి 46,555 ఎకరాల భూమిని ఇవ్వనున్నారు. ఇది కాకుండా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 10 వేలు, కళ్యాణదుర్గంలో 15 వేలు, పుట్టపర్తిలో 15 వేలు, రాప్తాడులో ఐదు వేల ఎకరాలు సేకరించనున్నారు. ఈ రకంగా భూములు సేకరించడాన్ని ప్రతిపక్షంలో వున్నప్పుడు విమర్శించిన తెలుగుదేశం ప్రస్తుతం అదే ఒప్పందాలను కొనసాగిస్తూ భూ సేకరణకు సిద్ధపడింది.
లీజు పేరుతో భూముల సేకరణ
సోలార్ కంపెనీలు ప్రారంభ రోజుల్లో భూములను కొనుగోలు చేసి విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేవారు. భూముల ధరలు పెరగడంతో పాటు కంపెనీలు కావాలనుకున్నంత భూమి ఒకే చోట సమీకరించుకోవడం కంపెనీలకు కష్టమైంది. దీంతో లీజు ఒప్పందాలు అని కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి కొత్త అవతారం ఎత్తాయి. రెవిన్యూ శాఖ మరియు ఎన్.ఆర్.ఇ.డి.సి.ఎ.పి (న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ప్రభుత్వం ఈ కంపెనీలకు సంపూర్ణంగా తోడ్పడుతున్నది. పంటలు పండకపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇప్పటికే కరువు జిల్లాల రైతులు వ్యవసాయం మీద విశ్వాసాన్ని కోల్పోయారు. నిరాశ, నిస్పృహలతో ఈ సోలార్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి పోటీలు పడుతున్నారు. రైతులకు సాగునీరు ఇచ్చే అవసరం, పంట నష్టపరిహారాలు ఇవ్వాల్సిన అవసరం, గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేకుండా పోతుంది. అందుకే పాలకులు వ్యవసాయ వినాశకరమైన ఈ విధానాన్ని పెంచిపోషిస్తున్నారు.
లీజుల పేరుతో దందా
ఎకరాకు రూ.30 వేలు లీజు, 30 సంవత్సరాల వరకు అని కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీల ఎం.ఎల్.ఏ లు, ఎంపీలు, స్థానిక పలుకుబడి కలిగిన నాయకులు రైతులను మభ్యపెడుతూ భూములు లీజుకు ఇచ్చేటట్లు ఒప్పిస్తున్నారు. రైతుల్లో వున్న సందేహాలు తీర్చకుండానే పెద్ద రైతులు భూములు ఇచ్చారని చెబుతూ మానసిక ఒత్తిళ్ళను పెంచి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ లీజు ఒప్పంద పత్రాలు ఇంగ్లీషులో వుండడమే కాక, కనీసం 20-30 పేజీలు వుంటున్నాయి. ఇందులో వారు ఏం రాసుకున్నారో రైతులకు తెలిసే అవకాశం తక్కువ. కంపెనీలు రైతులతో చేసుకుంటున్న ఈ ఒప్పందాల్లో ప్రభుత్వ బాధ్యత ఏమిటో స్పష్టంగా లేకపోవడం అనేక సందేహాలను కలిగిస్తుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లీజు మొత్తాన్ని పెంచుతామని కంపెనీలు అంటున్నాయి. ఒకవేళ లీజు మొత్తం సకాలంలో ఇవ్వకపోయినా, పెంచకపోయినా కోర్టుకు వెళ్లవచ్చు అని ఈ పత్రాల్లో రాశారు. కంపెనీ కేంద్ర కార్యాలయం ఎక్కడ వుంటే ఆ ప్రాంత కోర్టులో కేసు వేసుకోవాలని ఇందులో వుంది. ఉదాహరణకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో లీజు ఒప్పందం చేసుకున్న ‘అక్మే (ఎ.సి.ఎం.ఇ) ఉర్జా ఒన్’ అనే కంపెనీ కేంద్ర కార్యాలయం హర్యానాలోని గుర్గావ్‌లో వుంది. ఈ కంపెనీపై వివాదం వస్తే సాధారణ రైతు అక్కడికి వెళ్లి కేసు వేయాల్సి వుంటుంది. ఇది ఆచరణ సాధ్యమేనా? లీజుకు ఇచ్చిన రైతు ఆ భూమిని అమ్మినా లేదా వాటాలుగా పంచుకున్నా కొన్నవారు లేదా వాటాదారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి వీలులేదు. కొత్త భూ యజమాని కూడా పాత ఒప్పందానికే కట్టుబడి వుండాలి. వందల మంది రైతుల నుండి తీసుకున్న వేల ఎకరాల భూమిని కంపెనీలు పూర్తిగా చదును చేస్తాయి. హద్దులు చెదిరిపోతాయి. 30 సంవత్సరాల తర్వాత ఎవరి భూమి ఎక్కడుందో గుర్తు పట్టడం అసాధ్యమవుతుంది. 30 సంవత్సరాలు భూమికి దూరమైన వ్యవసాయదారులు తిరిగి వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. కావున తమ భూములను కంపెనీలకు అమ్మడం అనివార్యంగా మారుతుంది. ఈ రకంగా వెనుకబడిన జిల్లాల్లోని లక్షల ఎకరాల భూమి ఇలా కొన్ని కంపెనీల చేతుల్లోకి వెళ్ళి లక్షలాది రైతులు నిరాశ్రయులుగా మారతారు. గ్రామీణ వ్యవస్థ ధ్వంసం అవుతుంది.
సాగునీటి వనరులను కొల్లగొడుతున్న హైడ్రో గ్రీన్ ఎనర్జీ
పైనుండి నీటిని యంత్రాల మీదకు వేగంగా పడేటట్టు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం పాత పద్ధతి. కొత్త సాంకేతికతను ఉపయోగించి కింద నుండి పైకి నీటిని కొట్టేలా వేగంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ హైడ్రో విద్యుత్ ఉత్పత్తి పద్ధతి. దీని కోసం నీరు కావాలి. కరువు జిల్లాల్లో నీటి వనరులే తక్కువ. ఉన్న కొద్దిపాటి నీటి వనరుల నుండి హైడ్రో విద్యుత్ కంపెనీలకు నీటిని కేటాయిస్తున్నారు. తీవ్ర కరువు వున్న శ్రీసత్యసాయి జిల్లాలో చిత్రావతి నది నుండి అదానీ హైడ్రో కంపెనీకి ఒక టి.ఎం.సి నీటిని కేటాయించారు. అనంతపురం జిల్లా శింగనమల చెరువుకు హంద్రీ నీవా కాలువ నుండి ఒక టి.ఎం.సి నీటిని గత ప్రభుత్వం కేటాయించింది. ఇది తమ ఘనత అని వైసిపి, టిడిపి పోటీలు పడి ప్రచారం చేసుకున్నాయి. అయితే కేటాయించిన ఈ ఒక్క టి.ఎం.సి నీటిని అక్కడ నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టుకు కేటాయించారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ హైడ్రో కంపెనీలకు నీటిని ఇస్తామని ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే రైతుల భూములను, గ్రామ చెరువులను ఎండబెట్టి అయినా ఈ కంపెనీకి నీరు ఇస్తారు.
సోలార్ కంపెనీల వల్ల కరువు జిల్లాలకు ప్రయోజనం ఏమిటి ?
కరువు జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్, గాలి, హైడ్రో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఈ ప్రాంత విద్యుత్ చార్జీలు తగ్గవు. వేల ఎకరాల భూములు కోల్పోయిన గ్రామీణ యువతకు ఈ ప్రాజెక్టులలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. కంపెనీలు పొందుతున్న లాభాలు ఇక్కడ ఖర్చు కావు. కానీ వీరి లాభాలన్నీ ఈ జిల్లా అభివృద్ధిలో చూపించి తలసరి ఆదాయం పెరిగిందని పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. రైతుల చేతుల్లో వుండాల్సిన భూమి ఇలా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళే వినాశకర సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వల్ల కరువు ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయో పాలకులను ప్రశ్నించాలి.
ప్రజల జీవనోపాదులు దెబ్బతింటాయి : బొజ్జా దశరథరామిరెడ్డి
రాయలసీమలో మెజార్టీ ప్రజలు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తూన్నపుడు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన సోలార్, విండ్ ప్రాజెక్టుల వల్ల ప్రజల జీవనోపాదులైన మేకలు, గొర్రెలు,ఆవులు లాంటి వాటికి మేత దొరకకుండా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. “ప్రభుత్వం కర్నూలు ప్రాంతాన్ని సీడ్ హబ్ గా, అనంతపురం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని గొప్పలు చెప్పుకున్నాయి. కానీ వాటికి కావాల్సిన కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ఇలా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటాలు చేయడం తప్పించి ఈ ప్రాంతాలకు చేసిందేమీ లేదు. బ్రిటిష్ పరిపాలన కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని “రా మెటీరియల్” గా వాడుకున్నారు. ఇప్పటి పాలకులు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని “రా మెటీరియల్” గా వాడుకుంటూ దోపిడీ చేస్తున్నారు. దీనివలన ప్రజల జీవన పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి.ఇపుడు సోలార్ విద్యుత్తు కూడా రాయలసీమను బలిచేస్తున్నారు,” అని ఆయన అన్నారు.
భూములు లాక్కునే ప్రయత్నం
రైతులు స్థిర ఆస్తిగా భావిస్తున్న భూములపై కార్పొరేట్ లు కన్నువేయగా వారికి పరోక్షంగా ప్రభుత్వాలు వంత పాడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి రాంభూపాల్ అన్నారు. “అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని ప్రకటిస్తూ సోలార్, విండ్ పవర్ హబ్ గా మారుస్తూ రైతుల భూములను లాక్కుంటున్నారు. గుత్తి-పామిడి మధ్య సుమారుగా 1000 ఎకరాలను సోలార్ కు కేటాయించడాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వాలు పేద ప్రజల భూముల కాపాడటం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఆ భూములను పండకుండాచేసి కార్పొరేట్లు ఏదో రూపంలో అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది,” అని ఆయన అన్నారు.
సోలార్, విండ్ ప్లాంట్లను ప్రభుత్వమే నిర్మించాలి
ప్రయివేటు రంగంలో కాకుండా ప్రభుత్వం రంగంలో సోలార్ విండ్ ప్రాజక్టులను నిర్మిస్తే, గ్రామాలకువిద్యుత్ వస్తుంది,రాబడి పెరుగుతుందని ఎపి వెనకబడిన తరగతుల వేదిక అధ్యక్షుడు కెవి రమణ అన్నారు. “ సోలార్ ప్రాజక్టుల పేరుతో కార్పొరేట్లను దించితే రైతుల భూములు కోల్పోయి గ్రామాలు వదిలి పట్టణాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. శాశ్వతంగా రైతులు భూములకు దూరమైపోతారు. వారి భూములలో ఏర్పాటు చేసుకున్న విండ్ ,సోలార్ యూనిట్ల కార్పొరేటర్లు కోట్లకు పడగలెత్తుతారు. భవిష్యత్తులో రాయలసీమ సంపద అంటే ఇసుక, గాలి, ఎండ ,గనులు మాత్రమేనని ప్రభుత్వం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది,” అని రమణ అన్నారు.
( వేణుగోపాల్ రెడ్డి , సీనియర్ జర్నలిస్టు ,అనంతపురం)