రాజ్యాంగ దినం పాటిస్తున్న నాడు ఆలోచించాల్సిన విషయాలు
రాజ్యాంగం న్యాయవాదులకు బ్రతుకుదెరువుగా మారిందిగానీ, ప్రజల బ్రతుకులను తీర్చిదిద్దే ఆయుధమనే సత్యం మరుగున పడింది. రాజ్యాంగ దినం స్పెషల్
మన దేశంలో నవంబరు 26 వ తేదీన సంవిధాన్ దివాస్ అనే పేరుతో రాజ్యాంగ దినోత్సవం వేడుక చేసుకోవటం గత పది సంవత్సరాలుగా వస్తున్న ఒక మంచి సంప్రదాయం. ఇంతకు మునుపు మనకి ఈ ఆనవాయితీ లేదు. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2015లో చేసిన ఒక మంచి ఆలోచన. స్వతంత్ర భారత దేశానికి ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న అంతిమంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ రోజు తరువాత రాజ్యాంగ సభ తన పనిని విజయవంతంగా ముగించుకుని, స్వతంత్రం భరతభూమి మీద ఎన్నికలు జరిగేవరకు తాత్కాలి పార్లమెంటుగా అవతరించింది. ఎంతో విశేషమైన చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకున్న దినం నవంబరు 26. ఎందుకోగానీ, 2015కి ముందు ప్రభుత్వ పెద్దలు నవంబరు 26 యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేదు. గతంలో సంగతి ఎలా వున్నా నేడు ఆ దినం ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించటం వేడుక చేసుకోవటం హర్షించదగిన పరిణామం. అయితే ఇందులో అర్ధంగాని సంగతి ఒకటుంది. రాజ్యాంగం న్యాయశాఖ పరిధిలోని అంశం. కానీ, రాజ్యాంగ దినోత్సవం వేడుక మాత్రం సామాజిక న్యాయశాఖ అధ్యర్యంలో జరుగుతుంది. ఇది ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఉద్దేశించినది అన్న అనుమానం లేకపోలేదు. అయినప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవించుకునే సందర్భంగాబట్టి ఉద్దేశం ఏదైనా సందర్భంతో సంతోషించాల్సిందే .
స్వతంత్రం ఇస్తామని ఆంగ్లేయులు ప్రకటన చెయ్యక ముందే, కాబోయే స్వతంత్ర భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించటానికి బ్రిటిష్ పాలకులు రాజ్యాంగ సభను ఏర్పాటు చెయ్యటం ఒక గొప్ప ముందడుగు. స్వతంత్ర సమరయోధులు, న్యాయనిపుణులు, మేధావులు సభ్యులుగా వున్న రాజ్యాంగ సభ 1946 డిసెంబరు 9వ తేదీన మొదటిసారి సమావేశమై 1083 రోజులుపాటు పనిచేసి సుదీర్ఘ చర్చలు జరిపి 1949 నవంబరు 26వ తేదీన మన ముసాయిదా రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసుకున్నాము. ముసాయిదా అని ఎందుకు అంటున్నారంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26 న కనుక. అప్పటివరకు అది ముసాయిదానే. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ని ప్రతి ఏడూ గణతంత్ర దినోత్సవంగా అత్యంత వైభవంగా వేడుక చేసుకోవటం అందరికీ తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏడూ నవంబరు 26 వ తేదీని సంవిధాన్ దివస్ అనే పేరుతో రాజ్యాంగ దినోత్సవ వేడుక చేసుకోవటం ఒక కొత్త సంప్రదాయం. కానీ, ఈ సంప్రదాయం ఇంకా బాల్యావస్థలోనే వున్నది. ప్రజల ఆలోచనా విధానంలో రాజ్యాంగం అంతర్లీనం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. వేడుక చేసుకోవడం కన్నా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం, స్పూర్తిని పెంపొందించటం ముఖ్యం.
మన రాజ్యాంగం కేవలం ఒక గ్రంధం కాదు. అది కేవలం ఒక ప్రాధమిక చట్టం మాత్రమే కాదు. మన రాజ్యాంగం ప్రజల ఆశలకు , ఆశయాలకు, కలలకు, కోరికలకు ఒక నిర్దిష్టమైన ప్రతిబింబం. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భూమి మీద పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగాలని మనకి మనం చేసుకున్న మొట్టమొదటి ప్రతిజ్ఞ. ఎన్నో వేల సంవత్సరాలుగా కులము, మతము, లింగము, భాష, ప్రాంతము అన్న సంకుచిత విభేదాలు, వివక్షతలతో తన శక్తిని కోల్పోయి విదేశీ దాస్య శృంఖలాలలో బ్రతికిన ఈ భారత భూమి మొట్టమొదటిసారి ఒక అధునాతన పరిపాలనా వ్యవస్థను, ఆధునిక రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న శుభదినం నవంబరు 26. మనుధర్మం శాస్త్రం సృష్టించిన వర్ణ వ్యవస్థ, కులము, మతము, కర్మ అన్న అంశాల ఆధారంగా మనిషికి మనిషికి మధ్య అసమానతలను అడ్డుగోడలను నిర్మించి ఇది సనాతన ధర్మం అని, దీనిని అందరూ గౌరవించాలి అని గుడ్డిగా నమ్మించిన సామాజిక వ్యవస్థ మనది. ఈ అసమానతల అగాధాలు ప్రజల్లో ఐకమత్యాన్ని నిర్వీర్యం చేసి ఒక జాతిగా ఏకతాటిపై నిలబడటానికి అభివృద్ధిని సాధించటానికి అడ్డుగోడలుగా నిలిచినవి. ఈ దుస్థితికి సనాతన ధర్మం అనే పేరు తగిలించి ప్రజల్లో దీని పట్ల వ్యతిరేకత రాకుండా వేల సంవత్సరాలుగా జాగ్రత్త పడినవి కొన్ని స్వార్థపర శక్తులు. ఒకే ఒక్క పెన్నుపోటుతో సనాతన ధర్మం సృష్టించిన కులము, మతము, లింగము అన్న అడ్డుగోడలను బద్దలుకొట్టి భారతీయులు అందరూ అన్ని విధాలా సమానమైన స్వతంత్ర జాతి అన్న అధునాత ధర్మాన్ని ఆవిష్కరించిన పవిత్ర గ్రంధం మన రాజ్యాంగం. ఏ ధర్మమైనా రాజ్యాంగ ధర్మానికి అతీతం కాదని, శాసనం ద్వారా ఏర్పడిన రాజ్యాంగ ధర్మానికి లోబడే వుండాలని స్పష్టం చేసింది మన రాజ్యాంగం. వారసత్వంతో వచ్చే పేరుకన్నా, వ్యక్తి స్వశక్తితో సాధించినదే గుర్తింపు గౌరవానికి ప్రాదిపదిక అన్న నీతిని మన రాజ్యాంగం నొక్కివక్కాణిస్తుంది. మా తాతలు నెయ్యి తాగారు గనక మా మూతి వాసన చూడండి అన్న పద్ధతిలో బతికిన మనకి, వారసత్వంతో వచ్చినదానికన్నా స్వశక్తితో సాధించింది మిన్న అన్న నూతన ధర్మానికి తెరలేపింది మన రాజ్యాంగం. అందుకే అది కేవలం ఒక పుస్తకం కాదు. మన రాజ్యాంగం ఎన్నో ఏళ్లుగా తొక్కిపెట్టిన ప్రజల అవసరాలకి ప్రతిరూపం. అది మన ఆశల సౌధం, కలల గాధ. సనాతన ధర్మాన్ని పక్కకునెట్టి, ఈ అధునాతన ధర్మాన్ని రాజ్యాంగ సభలో ఏకగ్రీవ అంగీకారంతో ఆమోదించుకుని మనకి మనం కానుకగా ఇచ్చుకున్న చారిత్రక శుభదినం నవంబరు 26వ తేదీ. దీన్ని మర్చిపోకూడదు. దీని విశిష్టతను భావితరాలకు వివరంగా మనమే చెప్పాలి.
మన రాజ్యాంగం కేవలం న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారం కాదు. సింధూనది నాగరికత నుంచి నేటి వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయులు స్వతంత్ర జాతిగా అవతరించిన నేపథ్యంలో మొట్టమొదటిసారి ప్రజలందరికీ సమానంగా వర్తించే ప్రాధమిక హక్కులను ఏర్పాటు చేసుకొని, పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి అని ప్రమాణం చేసుకున్న ఒప్పంద పత్రం మన రాజ్యాంగం. విదేశీ పాలనలో జరిగిన అపార సామాజిక, ఆర్ధిక నష్టాన్ని, వనరుల దోపిడీని అధిగమించి, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి మన జాతిని ఏకతాటిపై నిలబెట్టి అభివృద్ధి పథంలో నడిపించటానికి మనకి మనం ఐచ్చికంగా నిర్మించుకున్న ఆయుధం భారత రాజ్యాంగం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అమలులోవున్న ప్రధాన రాజ్యాంగాలను పరిశీలించి, వాటిలో వున్న మంచి విషయాలను సేకరించి మన రాజ్యాంగంలో అంతర్భాగం గా చేసుకున్నాము. ప్రాధమిక హక్కులనేవి మనకు అప్పటివకు తెలియని విషయం.
మనం ఎన్నో వందల ఏళ్ళు రాజులూ రాణుల పాలనలో బ్రతికాము. రాజు ఇష్టమే చట్టం, రాజు అభీష్టమే పాలనావిధానం. రాజు అభిప్రాయమే అంతిమ తీర్పు. రాజు మంచివాడైతే ప్రజలు శులభంగా ఊపిరి పీల్చుకున్నారు. రాజు చెడ్డవాడైతే ప్రజలు మగ్గిపోయారు. దుష్టపాలన నుంచి రాజు మరణించేవరకు విముక్తి లేదు. రాజు మరణానంతరం ఎవరు పగ్గాలు చేపడతారు అనేదానికి ఒక నిర్దిష్ట విధానం లేదు మన చరిత్రలో. రాజప్రసాదంలో బలవంతులు చేసిన పన్నాగాలు, వేసిన ఎత్తుగడలతో రాజ్యాధికారం దక్కించుకున్న సందర్భాలు ఎన్నో. బలవంతుడికి సేనాధిపతులు, సైనికులు జై కొట్టారు కానీ ఇదేమి పద్ధతి అని అడిగిన దాఖలాలు అక్కడా కనిపించవుమన చరిత్రలో.
ఈ వ్యవస్థకి స్వస్తి పలికి రాజ్యాధికారం మారటానికి ప్రజాభీష్టం మేరకు జరిగిన ఎన్నికలే ప్రాతిపదిక అన్న ఒప్పందం చేసుకున్నాము మన రాజ్యాంగం ద్వారా. పార్లమెంటు, అసెంబ్లీలు చేసే చట్టాలుగానీ, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలుగానీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్న సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ రోజున. పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా సాగాలని, ప్రభుత్వాలు ప్రజలకు జవ్వాబుదారీగా వుండాలని, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలకు పాలకులు సమాధానం చెప్పాలని, చట్టసభల విశ్వాసం ఉన్నంతవరకే పాలకులు అధికారంలో ఉంటారని మనం నవంబరు 26న ఆమోదించుకున్న రాజ్యాంగంలో సుస్పష్టంగా పొందుపరుచుకున్నాము.
కానీ నేడు జరుగుతున్నదేమిటి? రాజ్యాంగం న్యాయవాదులకు బ్రతుకుదెరువుగా మారిందిగానీ, ప్రజల బ్రతుకులను తీర్చిదిద్దే ఆయుధం అన్న సత్యం మరుగున పడింది. రాజ్యాంగం రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. న్యాయస్థానాలు సోద్యం చూస్తున్నాయిగానీ, స్పందించవలసిన రీతిలో స్పందించటం లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్న విషయంకాదనగలమా? ఇటీవల సుప్రీమ్ కోర్ట్ బిల్లుల విషయంలో కాలయాపన మీద వెలువరించిన అభిప్రాయం విస్మయం కలిగించేదిగా వున్నది. రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ శాసన సభ ఆమోదంతో తమ వద్దకు వచ్చిన బిల్లులకు అనుమతి ఇచ్చే విషయంలో ఎంతకాలమైనా నిర్ణయం తీసుకోకుండా కూర్చోవచ్చు అని, వారికి కాలపరిమితిని విధించలేమని చెప్పటం విడ్డూరంగా లేదూ? ఇది సమాఖ్య స్ఫూర్తికి ఇబ్బంది కలిగించే అవకాశం తోసిపుచ్చలేము. గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి రాజకీయ ప్రేరణతో వ్యవహరించిన సందర్భాలు ఎన్నో.
ప్రాథమిక హక్కులు అందరికీ సమానంగా నర్తించేవి అయినప్పటికీ అవి కొందరికి మాత్రమే అందుబాటులో వున్నాయి. రిక్షా కార్మికులు, వ్యవసాయ కర్షకులు లాంటి రెక్కాడితే గానీ డొక్కాడని బడుగుజీవులు కోట్లమంది వున్న ఈ దేశంలో ఎంత మంది పేదవాళ్లు హైకోర్టు మెట్లు, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కగలరు వాళ్ల హక్కులకు భంగం కలిగితే? అసలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులున్న విషయం ఎంతమందికి తెలుసు? చాలా చోట్ల జిల్లా కేంద్రానికి రావటమే వ్యవప్రయాసలతో కూడుకున్న పని. అటువంటిది రాష్ట్ర రాజధానిలో వుండే హైకోర్టు కు గానీ, దేశ రాజధానిలో వుండే సుప్రీంకోర్టు కు గానీ పోగలరా? ప్రాధమిక హక్కుల వుల్లంఘన విషయంలో జిల్లా కోర్టులకు విచారించే అధికారం ఎందుకు వుండకూడదు? జూనియర్ సివిల్ జడ్జికి సుప్రీం కోర్టు జడ్జి కి విద్యార్హతలు దాదాపు సమానమే. అటువంటప్పుడు కనీసం జిల్లా కోర్టులకు ప్రాథమిక హక్కుల విషయంలో విచారణ జరిపే అధికారం ఎందుకు ఇవ్వకూడదు? ఈ రోజు ప్రజలు బిగ్గరగా ఆలోచించవలసిన అంశాలు ఎన్నో వున్నాయి.
రాజ్యాంగం అంటే కేవలం ప్రాధమిక హక్కుల పట్టిక కాదు. హక్కులతో పాటు బాధ్యతలూ వుంటాయని చెప్పే మహా కావ్యం. ఎంత మందికి తెలుసు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక బాధ్యతల గురించి? ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవత్వం, ప్రశ్నించే తత్వం మరియు సంస్కరణ అనే స్పూర్తిని పెంపొందించుకోవాలని ఉద్భోదిస్తుంది. అంతే కాదు! హింసను విడనాడమని, ప్రజా ఆస్తులను కాపాడటం పౌరుల కర్తవ్యమని చెబుతుంది మన రాజ్యాంగం. ఈ నీతిని నేటి నేతలు బోధించజాలరు. ప్రభుత్వం నిర్వహించే కార్యకలాపాల్లో యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు, తంత్రాలతో తరించేవారు ఏ విధంగా శాస్త్రీయ దృక్పథం గురించి, మానవీయత, ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోమని బోధించగలరు? ప్రభుత్వ విధానాలకు తమ వ్యతిరేకతను తెలుపటానికి హింసే మార్గంగా అనుకునే వాళ్లు పిల్లలకు నీతిని బోధించగలరా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా గొంది గొందికీ సందు సందుకీ రాజకీయ నేతలు కనిపిస్తారు గానీ రాజ్యనేతలు ఎక్కడున్నారు? రాజ్యనేతలు భూతద్దంలో వెదికినా కనిపించని విపత్కర పరిస్థితి చూస్తున్నాం కదా నేడు! రాజ్యాంగ స్పూర్తిని అలవరచుకోలేక పోవటమే ఈ పరిస్థితికి హేతువు. కానీ ఈ నీతిని, ఈ విలువలను పిల్లలకు బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రులకుంది. వ్యక్తిగత విశ్వాసాలు వేరు బహిరంగ నడవడి వేరు అన్న నియమాన్ని మన నేతలు పూర్తిగా మరిచారు. మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న కలలను సాకారం చేసుకోవాలంటే సహనం, సౌభ్రాతృత్వం అవసరమన్న విషయాన్ని అందరం గ్రహించాలి. లేకపోతే ఆ ఆశలు అడియాశలుగా, కలలు కల్లలుగానే మిగిలిపోతాయి అని గ్రహించాలి. రాజ్యాంగం ఆచరణలోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలకు ఏమైనా చేరువలో వున్నామా అని మనను మనం ప్రశ్న
సమాజంలో జరుగుతున్న అకృత్యాలను ఎలుగెత్తి చూపాల్సిన ప్రధాన మీడియా సంస్థలు వారి వారి వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా స్వేచ్చని ఫణంగా పెట్టి పాలకుల ముందు మోకరిల్లుతున్న పరిస్థితిని మనం అనునిత్యం చూస్తున్నాం. పాలకులతో కలిసి రాజ్యాంగ స్ఫూర్తిని గాలికొదిలేశాం. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అయిన ఎన్నికల ప్రక్రియ ధన ప్రవాహంతో, కండ బలంతో కలుషితమైపోయింది. గెలుపుగుర్రాలను బరిలోకి దింపే నెపంతో ఎన్నికలను రాజకీయ పార్టీలు కలుషితం చేస్తుంటే, పవిత్రమైన ఓటును అమ్ముకోవటంద్వారా పౌరులుగా మరింత కలుషితం చేస్తున్నాం. దీనిని కాదనగలమా? ప్రతిదానికీ, రాజకీయనేతలను నిందించటం మనకి పరిపాటి అయ్యింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి చేరిన కలుషితానికి ప్రజలు కూడా కారణమే అన్న నగ్నసత్యాన్ని విస్మరిస్తూ, పరనిందతో సరిపెట్టుకుంటున్న వైఖరికి ప్రజలు స్వస్తి చెప్పి, రాజ్యాంగంపట్ల మన బాధ్యతను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవంగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కనీసం ఇప్పుడైనా మేలుకోవాలి. అటువంటి ఆలోచన చెయ్యటానికి ఇదే సరైన సందర్భం. సంక్లిష్టమైన సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమస్యలకు పరిష్కారంగా చట్టం చేసి చేతులు దులుపుకోవడం మన పాలకులకు పరిపాటైనది. చట్టం ఒక్కటే మనిషి దృక్పథంలో మార్పు తీసుకురాలేదు. దానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చెయ్యాలి. అప్పుడే చట్టం ఉపయోగపుడుతుంది. లేకపోతే చట్టం నీటిమీద రాతలా, కాగితం పులిలా మిగిలిపోతుందేగాని, అదొక్కటే మార్పుకి శ్రీకారం చుట్టలేదు.
ఈ స్ఫూర్తి ప్రజల ఆలోచనా విధానంలో అంతర్లీనం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది. అంటే రాజ్యాంగం పట్ల, రాజ్యంగంలో పొందుపరుచుకున్న విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతుత్వం, న్యాయం, లౌకిక వాదం అనే నీతిని ప్రజల ఆలోచనలో జీర్ణం అవ్వాలి. రాజ్యాంగం అనేది హక్కులను కల్పించే పుస్తకం మాత్రమే కాదు, మన ప్రాధమిక బాధ్యతలను గుర్తుచేసే గ్రంధం కూడా. అందుకే రాజ్యాంగం పట్ల సమాజంలో అన్ని వర్గాలవారికి అవగాహన కలగాలి. ఈ అవగాహనతోనే పౌరులుగా మన బాధ్యతలను తెలుసుకోగలం. ఈ అవగాహనతోనే పాలకుల పనితీరును సరిగ్గా అంచనా వేయగలం. అందుకే ఇది ఒక రోజుతో ముగిసే వేడుకగా మిగిలిపోకుండా నిరంతరం మన మదిలో మెదిలేలా చర్యలు చేపట్టాలి. కేవలం పాఠశాలలే కాకుండా కాలేజీలు విశ్వవిద్యాలయాలు నిర్వహించే అన్ని కోర్సుల్లో రాజ్యాంగాన్ని ఒక పాఠ్యంశంగా చేర్చాలి. రాజ్యాంగ దినోత్సవంలో హర్షించదగ్గ విషయం ఏమిటంటే ఏ సినిమాకో షికారుకు వెళ్లి కాలక్షేపం చేసే శలవు దినం కాదు. నవంబరు 26 పని దినమే.
పాఠశాలల్లో పసిపిల్లలచేత ప్రమాణం చేయించి చేతులు దులుపుకునే ప్రహసనంగా మార్చకూడదు ఈ సందర్భాన్ని. రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన పీఠిక, ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాధమిక బాధ్యతలను పాఠ్యంశాలుగా చేర్చాలి. వీటిమీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజిమెంట్ లాంటి ఉన్నత చదువుల్లో కూడా రాజ్యాంగపరమైన అంశాలను బోధించాలి. వారిలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన కల్పించాలి. మన రాజ్యాంగం జాతి మొత్తాన్ని ఒక తాటిమీదకు తీసుకొచ్చే ఐక్యతా రాగం కావాలి. దానికి ఆ శక్తి వుంది. కానీ మనమే గుర్తించలేక పోతున్నాం. మనల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే ఆయుధం మన రాజ్యాంగం అన్న నిజాన్ని నెమరువేసుకునే సందర్భం కావాలి రాజ్యాంగ దినోత్సవం. అప్పుడే ఈ వేడుకకు ఒక అర్ధం, పరమార్ధం ఉంటాయి. ఇది ఒక తంతుగా మిగిలిపోకూడదు అని కోరుకుందాం.