జైలు కెళ్లిన తొలి తెలుగు జర్నలిస్టు గాడిచర్ల

గాడిచర్ల హరి హరిసర్వోత్తమ రావు 141వ జయంతి సందర్భంగా నివాళి

Update: 2024-09-14 01:30 GMT

-చందమూరి నరసింహారెడ్డి


ఆంధ్ర ప్రాంతం నుంచి 1906లో తెలుగులో మాస్టర్స్ (MA) పట్టా పొందినవారు ఇద్దరు. అందులో ఒకరు పానుగల్లు రాజకాగా, రెండో వ్యక్తి కర్నూలు కు చెందిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు. అపుడు వేదం వేంకటరాయశాస్త్రి అధ్యాపకుడు. భోగరాజు పటాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, గిడుగు సీతాపతి మిత్రులు. ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం ప్రస్తావన వస్తే మొదట స్మరించుకోవలసి పేర్లలో గాడిచర్ల మొదటి వరసలో ఉంటారు.

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబర్ 14 న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులు కడప జిల్లా, సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు.

మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో చదివి 1906లో తెలుగు ఎం.ఏ. పాసయ్యారు. చదువు పూర్తయింది.జాతీయోద్యమంలోకి దూకాడు. ఆయనకు ఎన్నోకష్టాలు ఎదురయ్యాయి. దేనిని లెక్క చేయని ధీరుడాయన.

చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో మద్రాసు లో ఎంఏ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907లో స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. ‘స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908లో తిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు క్రూరమైన విదేశీ పులి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది.

మూడేళ్ళ జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత గాడిచర్లను పలకరించడానికి జనం భయపడేవారట తమకు కూడా శిక్ష పడుతుందేమోనని! అలాంటి సమయంలో మిత్రులు కొమర్రాజు లక్ష్మణరావుతో సాంగత్యం చిరకాలం నడిచింది.

1914లో బాల గంగాధర తిలక్ ‘హోం రూల్ లీగ్’ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు.

శాసనసభ్యునిగా నియోజకవర్గానికి, ఆంధ్రవిశ్వవిద్యాలయ అభివృద్ధికి అపార సేవ చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు పెక్కు రాయలసీమ నాయకులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో సర్వోత్తమరావు వారి సంకుచిత ధోరణిని విమర్శించి ఆంధ్రోద్యమానికి నూతన జీవము పోశారు. శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించడంలో ప్రధాన పాత్రను పోషించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.

పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:

ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు ఆయన తొలి సంపాదకుడు. 1916 నుండి 1918 వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.

ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు. మహిళల సమస్యలు పరిష్కరం కోసం ” సౌందర్యవల్లి ” అనే పత్రిక నడిపాడు.

‘మద్రాసు గ్రామ పంచాయితీ’ అనే పత్రిక తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నాడు. జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాసాడు. స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకం రాసాడు. ఆయన రాసిన శ్రీరామ చరిత్ర అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.

ఆయన రచించిన ‘పౌరవిద్య’ అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.

ఆయన రాసిన ఆబ్రహాము లింకన్ చరిత్ర (1907) అనే పుస్తకాన్ని కొమర్రాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.

తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు కొన్ని:రాయలసీమ కు ఆ పేరు ప్రతిపాదించి ఆయనే .

1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు. రాయలసీమ పేరును మొదట సూచించింది చిలుకూరి నారాయణరావు. నాడు జరిగిన సభలో గాడిచర్ల, చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు.

అప్పటికే రాయలసీమ పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఆంధ్ర దేశాన్ని కాకతీయ, ముసునూరి సార్వబౌముల పరిపాలన తరువాత విజయనగర వంశాలు పాలించాయి. రాయల కాలంలో సీడెడ్ ప్రాంతాన్ని ని పెమ్మసాని, రావెళ్ళ, సాయపనేని వంశాలు పాలించాయి.

ఏనాటి నుండో తెలుగు ప్రాంతం అంతా ఆంధ్రదేశముగా పిలువబడినది. రాయలకు ఆంధ్రభోజా బిరుదులు ఉండటం సీడెడ్ (నిజాం బ్రిటిష్ వారి దత్తతచేసిన మండలాలు) ప్రాంతములో రాయల ప్రభావం ఎక్కువగా ఉండటం ఆంధ్రదేశములోని అనంతపూర్, కర్నూల్, చిత్తూర్, కడప జిల్లాలకు రాయలసీమ పేరు ప్రస్తావించడం జరిగినది.

రాయలసీమగా ప్రకటించమని కొందరు, అలాగే విజయనగరానికి గుండెకాయలాంటి గండికొట నుండి ఏలి, రక్షణ వలయములా పోరాడిన పెమ్మసాని యోధుల పేరు పెట్టాలని కూడా కొందరు ప్రస్తావించారు. సంపాదకుడు, భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.

1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు.

ప్రజలకు చదువు చాలా అవసరమని బలంగా నమ్మిన హరిసర్వోత్తమరావు ఆంధ్రదేశంలో పెక్కు వయోజన విద్యా కేంద్రాలను నెలకొల్పారు. 1934లో రైతు సంఘాన్ని స్థాపించి రైతుల స్థితిగతులు మెరుగుపర్చడానికి నిర్విరామ కృషి చేశారు. అస్పృశ్యతను రూపుమాపడానికి తన ఇంట్లోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు.

ప్రముఖవక్తగా, రచయితగా, పాత్రికేయునిగా, జాతీయవాదిగా, విజ్ఞాన చంద్రిక ప్రథమ సేవకునిగా, ఆంధ్రోద్యమ అతిరథునిగా, ఆంధ్ర గ్రథాలయోద్యమ మొదట్టి పెద్దగా, వయోజన విద్యా గురువులలో ప్రప్రథమునిగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకింత చేసిన మహాత్యాగి, మహా పురుషుడు, ఆంధ్రుల పాలిట దైవం – గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగు ప్రజలకు చిరస్మరణీయులు.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం విజయవాడలో ‘సర్వోత్తమ భవనం’ వెలసింది.

(నరసింహారెడ్డి, జర్నలిస్టు, రచయిత, అనంతపురం, ఆంధ్రప్రదేశ్)


Tags:    

Similar News