పగడాల ప్రవీణ్ ‘శాటిలైట్ లాంచ్ వెహికల్’ వంటివాడు
రాయలసీమ కు చెందిన పగడాల చాలా కాలం గుజరాత్ లో మిషనరీ కార్యకలాపాలలో పాల్గొని హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు.;
నలభై ఐదేళ్ళ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలది ఎలా చూసినా అది అకాల మరణం. ఆయన మధ్య వయస్కుడు అనే కాదు, ఇండియాలో ఇప్పుడు నడుస్తున్న చరిత్ర రీత్యా కూడా ప్రత్యేకించి దక్షణాది విషయంలో అది- ‘రాంగ్ టైమింగ్’. అయితే దాన్ని అలా ఎంచుకున్నది ఎవరు? అంటే ఈ ప్రశ్నకు ఇప్పట్లో జవాబు లేదు. అది ప్రమాదమైనా మరొకటి అయినా, ‘టైం అండ్ స్పేస్’ దృష్ట్యా అయితే, అది ఇప్పుడు ఇలా జరగాల్సింది అయితే కాదు.
ఎన్డీఏ ప్రభుత్వం మొదటి ఏడాదిలో పూర్తి చేయాలి అనుకున్న అంశాల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం ఒకటి. ఆ బిల్లుకు పార్లమెంట్ లో మద్దత్తు ఇస్తున్న టిడిపి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పగడాల శవము దొరకడంతో, రాజకీయంగా విషయం పనిమాలా ‘ఎన్డీఏ’ ఆవరణలోకి వచ్చినట్టుగా అయింది. హైదరాబాద్ లో నివసించే పగడాల మార్చి 24 మిషనరీ పని మీద రాజమండ్రి వచ్చాడు. ఆరాత్రే రాయల్ ఎన్ ఫీల్డ్ మీద వెళ్లిపోయాడు. అయితే, ఆ మరుసటి రోజు రాజమండ్రి సమీపాన రోడ్డు పక్కన రాళ్ల లో ఆయన శవమౌకనిపించాడు. పక్కనే మోటార్ సైకిల్ పడిపోయి ఉంది.
పగడాల రాయలసీమ వాడు గుజరాత్ లో పదేళ్ళు పైగా ఉండి, నార్త్ ఇండియన్ ను వివాహం చేసుకుని ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. అటువంటిది వెతుక్కుంటూ వచ్చినట్టుగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కొత్త జిల్లాకు పేరుపెడితే, నిరసనతో మంత్రుల ఇల్లు తగలబెట్టిన గోదావరి ప్రాంతాన్ని తన మరణానికి ఎంచుకున్నాడు.
దాంతో ఒకేసారి తెలుగు నాట ముస్లింలు క్రైస్తవుల ఆందోళనకు స్థానిక ‘ఎన్డీఏ’ చీఫ్ చంద్రబాబు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, దానికి ఆయనవద్ద ఉండే ‘చిట్కాలు’ ఆయనకు ఎటూ ఉంటాయి కనుక, ఉన్నట్టుండి నడుస్తున్న విషయాల స్థానంలో- “ఇప్పుడు అమరావతికి మరో 44 వేల ఎకరాలు ఎందుకు?” అనేది చర్చావేదికలపై కొత్త టాపిక్ అయింది. కానీ బాబు తాను తెచ్చాను అని చెప్పుకునే ‘టెక్నాలజీ’ ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పి కూడా అయింది. ఈ ‘సోషల్ మీడియా’ కాలంలో పగడాల మరణం వంటి అంశం కనిపించకుండా దాచి పెట్టే విషయంలాగ కనిపించడం లేదు.
అయితే, ఈ విషయం ఇక ముగిసిపోతే బాగుణ్ణు అని కోరుకుంటున్న వాళ్ళు కూడా తక్కువ ఏమీ కాదు. ఎందుకంటే ఇందులో నుంచి ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకుంటున్నట్టే, ఇది ఇలాగే కొనసాగితే రేపది తమ పునాదుల భద్రతకు ప్రమాదం అని బెంగ మొదలయిన వారు కూడా ఉన్నారు. అందుకు ఎవరి కారణాలు వారివి. ఇదే సమస్య. ఈ ‘సోషల్ మీడియా’ ద్వారా యువతరం ఈ మరణం కేంద్రంగా మొదలుపెట్టిన పరిశోధనాత్మక చర్చ చివరికి అది ఎక్కడికి వెళుతుందో అని. ఈ భయానికి కారణం రేపది కొత్త తరం క్రైస్తవుల విశ్వాసాలను ఎటుగా మళ్ళిస్తుందో అనేది వారి ఆందోళన.
ఇండియాలో ఉంటూ ఈ విషయం అర్ధం చేసుకోవడానికి విహంగ వీక్షణంగా అయినా ఈ విషయం చారిత్రిక నేపధ్యం తెలియాలి. రాజ్యము-దేవాలయము ఒక్కటిగా ఉంటూ సమాజాన్ని పరిపాలిస్తున్న కాలంలో జీసస్ అనే యువకుడు నజరేతు అనే ఒక గ్రామ ప్రాంతంలో కొత్తగా ఒక సరళీకరణ ఉద్యమాన్ని ప్రతిపాదిస్తాడు. దాంతో అమలులో ఉన్న యూదా మతానికి ఇది ప్రత్యామ్నాయం అవుతుంది. దాంతో దేవాలయ అధికారులు చేసిన కుట్రతో ఏవో కొన్ని రాజద్రోహ నేరాలు ఆయనపైన మోపి, జీసస్ కు రోమా చక్రవర్తి ఒక శుక్రవారం నాడు శిలువ మరణం శిక్ష అమలు చేస్తాడు. దాన్ని ‘గుడ్ ఫ్రైడే’ అంటారు.
మూడవరోజు ఆదివారం (‘ఈస్టర్ సండే’) వేకువన జరిగిన పునర్థానం తర్వాత, జీసస్ క్రైస్ట్ సమాధి ఉన్న తోట నుంచి బయటకు వస్తూ, ఆయన్ని కలిసిన స్త్రీలతో ఆయన తన పదకొండు మంది శిష్యుల్ని గలలియలోని కొండపైకి రమ్మని చెబుతారు. అలా ఆయన దేవాలయం వున్న జేరుసలేము కాకుండా, గలలియ గ్రామానికి వెళ్ళారు. గలలియ వ్యవసాయం, చేపలు పట్టుకోవడం వృత్తిగా వున్న బహుజనుల ప్రాంతం. అక్కడ కలిసిన శిష్యులతో- “పరలోకమందును భూమి మీద నాకు సర్వాదికారం ఇవ్వబడింది. కనుక మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి” అని చెబుతాడు.
ఇది జరిగాక, వారు తమకు అప్పగించిన పనిలో నిమగ్నమవుతారు. వారి బోధనలకు ప్రభావితం అయినవారిని ‘క్రైస్తవులు’ అన్నారు. అయితే జీసస్ శిష్యులకు దేవాలయం లేదు. “మొదటి శతాబ్దిలో క్రైస్తవులకు ఆలయాలు లేవు. యూదా మతం ఆచరిస్తున్నవారి మందిరాలలోనే వారు కూడా తమ ఆరాధనలకు అక్కడ కలిసేవారు” అని అమెరికాలోని యూనియన్ ప్రేస్బిటేరియన్ సెమినరిలో హిస్టరీ ప్రొఫెసర్ జేమ్స్ ఎలిషా తానేటి అంటారు. అయితే, జీసస్ ఉద్యమం వ్యాప్తి క్రమంలో యూదులు కానివారికి క్రైస్తవ్యంలోకి ప్రవేశం విషయమై వివాదం అవుతుంది.
ఈ విషయమై జెరుసలేములో జీసస్ శిష్యులు యూదా పెద్దలకు మధ్య కీ.శ. 45 లో జరిగిన సమావేశంలో సుదీర్ఘ చర్చలు తర్వాత ఏకాభిప్రాయంతో ప్రవేశానికి వారు అనుమతి ఇస్తారు. అయితే, కీ.శ. 70లో జేరుసలేములో పైన యూదులపై రోమన్లు చేసిన దాడిలో దేవాలయాన్ని వాళ్ళు కూల్చడంతో యూదులు ప్రపంచమంతా చెల్లాచెదురు అవుతారు. అలా వారితో ఆ ‘క్రైస్తవ్యం’ కూడా వ్యాప్తి చెందింది. అప్పటికే రహదార్లు ఏర్పడడంతో యూదులు కొందరు ఇండియా కూడా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. “భూమి మీద నాకు సర్వాదికారం ఇవ్వబడింది. కనుక మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి” అనే పిలుపులో ఒకరిని- ‘శిష్యులను’గా చేయడానికి కావాల్సింది ‘విషయం’ (కంటెంట్) మాత్రమే అనేది స్పష్టంగా మనకు అర్ధమవుతూనే ఉంది.
ఇక ఆ పిలుపులోని మరొక అంశం -“భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది” కనుక మళ్ళీ నా పేరుతో భూములు వాటిలో శిఖరాల నిర్మాణాలతో పనిలేదు అని స్వయంగా జీసస్ అంటున్నారు. “భూమి మీద నాకు సర్వాధికారం” అనే క్లెయింలో తన పేరుతొ ప్రాచుర్యమైన క్రైస్తవంలో- ‘సరళీకరణ’ తో పాటుగా నా ప్రవేశానికి అడ్డుగోడలు లేవు, ‘ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్’ అనే ‘ప్రపంచీకరణ’ సూత్రం కూడా కనిపిస్తున్నది. అయితే ఆచరణలో అదేమంత తేలిక కాలేదు. క్రైస్తవ్యంలో 16వ శతాబ్దానికి పెరిగిన రాచరికపు ఛాయలను ప్రశ్నించి ‘రోమన్ కేథలిక్ చర్చి’ నుంచి బయటకు వచ్చినదే ‘ప్రోటేస్టెంట్ చర్చ్’, కేథలిక్ చర్చి ప్రపంచమంతా పోప్ పరిపాలనలో ఉండవలసిందే. ఇండియాలో దానికున్న భూములు గురించి ఇటీవల వార్తలు కూడా చూసాము.
అయితే ‘ప్రోటేస్టెంట్ చర్చ్’ వ్యాప్తి కూడా ప్రపంచమంతా వేగంగా జరిగింది. డేనిష్ మిషినరీల ద్వారా 1706లో అది మన దేశంలోకి ప్రవేశించింది. లండన్ చర్చ్ మిషనరీ సొసైటీ 1799 నాటికీ ఏర్పడింది. అది పలు దేశాల్లో చర్చి వ్యాప్తికి కృషి చేసింది. ఇండియాలో బాప్టిస్ట్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, మెథడిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, పెంటికోస్ట్ చర్చ్ వంటివి సంప్రదాయ పురాతన చర్చ్ సంస్థలు. వీటికి అనుబంధంగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సాంఘిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వీటికి భూములు ఉన్నాయి.
బందరులో 1843 లో ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించిన రాబర్ట్ టి నోబుల్ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే స్కూల్ ప్రవేశం అనుమతి ఇస్తారు. ఇతర శూద్ర కులస్తులు సీటు కోసం వస్తే, నిర్ణయం తీసుకోలేక ఆయన లండన్ ప్రభుత్వ అనుమతి కోసం ఉత్తరం రాస్తారు. అక్కడ బ్రిటిష్ రాణి వద్దకు కూడా ఈ విషయం వెళ్లి, ఆమె అనుమతి ఇచ్చాక మాత్రమె ఇతరులకు స్కూల్లో ప్రవేశం దొరికింది. అప్పటికే జీసస్ బోధనలు ఇండియాలో సామాజిక పరివర్తనలో ప్రతిఫలించడం ఈ సంఘటనలో మనకు కనిపిస్తుంది.
స్వాత్యంత్రం తర్వాత ఇంకా ఇండియాలో పని చేస్తున్న మిషనరీలు, డాక్టర్లు, టీచర్లు క్రమంగా తమ బాధ్యతలు స్థానికులకు అప్పగించి వాళ్ళు తమ దేశాలకు వెళ్ళిపోయారు. అయితే, చర్చి ఆస్తులు కొంత కాలం పాటు ఉభయుల స్వాధీనంలో ఉండేవి. కాలక్రమంలో పర్యవేక్షణ కష్టమై వారు ఆ బాధ్యతలు ఇక్కడ తమ సంఘాల పెద్దలకు అప్పగించారు. పట్టణీకరణ, నగరాల అభివృద్ధి క్రమంలో మిషన్ ఆస్తుల విలువ పెరిగింది. డెభై దశకం నాటికి సాంప్రదాయ చర్చ్ కి సమాంతరంగా కొందరు వ్యక్తులు కేంద్రంగా భక్తి ఉద్యమం మొదలయింది. హైదరాబాద్ లో భక్త సింగ్ అనే క్రైస్తవ బోధకుడు అబిడ్స్ వద్ద హేబ్రోన్ చర్చ్ ప్రారంభించారు. చెన్నైలో ఉండే జాషువా డేనియేల్ ఏపిలో- ‘లేమెన్స్ ఎవాన్జిలికల్ ఫెలోషిప్’ అని మరో గ్రూప్ చర్చి ప్రారంభించారు.
ఎనభైల నాటికి ఆధునిక జీవితంలో పెరుగుతున్న అసంతృప్తులను ‘అడ్రెస్’ చేసే బైబిల్ బోధనలు మొదలయ్యాయి. అందుకోసం అమెరికా వంటి దేశాల్లో సువార్త బోధనలో కొత్త శైలులు మొదలు అయ్యాయి. అవి ఇక్కడి యువ మిషనరీలను ఆకర్షించాయి. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో, ప్రాధమిక బైబిల్ సూత్రాలకు భిన్నమైన పద్దతిలో- ‘నీ వ్యక్తిగత అవసరాలు అన్ని ఇక్కడ పరిష్కరించ బడతాయి అనే ‘ప్రాస్పరిటీ గాస్పెల్’ కూడా విరివిగా వ్యాప్తి చెందింది. భూమి లేని కులాల్లో ఉద్యోగం దొరకని డిగ్రీలు ఉన్న యువకులు వాటితో ఏదో ఒక బైబిల్ కాలేజిలో చేరి సర్టిఫికేట్ తీసుకుని ‘చర్చ్’లు పెట్టడం కూడా గత ముప్పై ఏళ్లలో పెరిగింది.
ఊళ్లలో పని లేక గ్రామాలు నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసల కుటుంబాలు ఎక్కువగా ఉండే శివార్లలో ‘చర్చ్’ లు వారికి తొలి ఆదరణ కేంద్రాలు అయ్యాయి. ఇటువంటి ‘ప్యాకేజి’ మొత్తం కలిపి శక్తివంతమైన సందేశాలు ఇచ్చే యువ ‘కమ్యునికేషన్’ నిపుణులు సువార్త సభలు పేరుతొ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. గత పదేళ్ళలో విస్తరించిన ‘సోషల్ మీడియా’ వల్ల వాసి కంటే రాసి పెరిగిన బైబిల్ బోధనలు విస్తరించాయి. ముప్పై ఏళ్లలో పెరిగిన ఈ ‘మార్కెట్’ ధోరణితో కార్పోరేట్ తరహాలో ‘మాల్ చర్చ్ కల్చర్’ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం.
ఇదే కాలంలో ‘వాసి కంటే రాసి’ సమస్యలో నుంచి వచ్చిందే, ‘యూ ట్యూబ్’లో భిన్న విశ్వాసాల మధ్య అధ్యాత్మిక చర్చలు వాదాలు-వివాదాలు. ప్రవీణ్ పగడాల వీటిలో క్రియాశీలంగా పాల్గొంటూ పైన చెప్పుకున్న ‘చర్చ్’ పెడ ధోరణలను సైతం ప్రశ్నిస్తూ, క్రైస్తవ్య ప్రక్షాళన దిశలో కూడా అడుగులు మొదలు పెట్టినట్టుగా ఆయన మరణం తర్వాత వాటిని వింటున్నప్పుడు తెలుస్తున్నది. కొత్తదేమీ కాదు ‘రొటీన్’ ను ప్రశ్నిస్తే కొందరికి కష్టమే.
అయితే, పగడాల మరణం ఇంతమంది యువజనులను కదిలించి వారిని ఒక్కటిగా చేయడం మూడవ ‘టర్మ్ ఎన్దేఎ’కి తెలుగు రాష్ట్రాల్లో ఆశనిపాతమై, అడుగంటిన వారి ఆశలను అది తుడిచిపెట్టేసింది. అది ‘చర్చ్’కి బయట విషయం అయితే, ఇక లోపల విషయంగా తెలుగు చర్చ్ లోతుగా తనను తాను సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఈ మరణం అనివార్యం చేసింది. పగడాల మరణం స్వభావం ఏమైనా, అతడొక చరిత్ర. అతడు ‘శాటిలైట్ లాంచ్ వెహికల్’ (SLV) వంటివాడు. అది పైకి వెళ్లి తనంతట తాను కాలిపోయి బూడిదై అదృశ్యం అవుతుంది. అయితే, అది తాను మోసుకెళ్ళిన ‘ర్యాకెట్’ను కక్ష్యలోకి చేర్చిన తర్వాత ఇక కనిపించదు. అనుమానం లేదు, పగడాల కేంద్రమైన ఈ చర్చ తెలుగు క్రైస్తవ్యం మూలాలను తాకింది.