రాహుల్‌ గాంధీ తెల్ల టీషర్ట్‌ ఉద్యమం అంతరార్థం ఏమిటి?

బాపూ తెల్ల ఖాదీకి రాహుల్‌ వైట్‌ టీషర్ట్‌ ప్రత్యామ్నాయం అవుతుందా?;

By :  Admin
Update: 2025-01-24 06:57 GMT

-నాంచారయ్య మెరుగుమాల

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ తాజా పోకడలు తెలుగు ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. గతంలో ఈ పాత రాజకీయపక్షం (Gran–జీఓపీ) కాంగ్రెస్‌తో బలమైన సంబంధం కలిగిన జనం తెలుగు వారు. అవిభక్త తెలుగు రాష్ట్రంలో 1982లో రాజకీయ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అవతరించినప్పటికీ హస్తం పార్టీని తెలుగు జనం 1989, 2004, 2009 జమిలి ఎన్నికల్లో గద్దెనెక్కించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలు కొన్నింటితో పాటు తెలంగాణలో 8 స్థానాలు రావడం వల్లే కాంగ్రెస్‌ స్కోరు జాతీయ స్థాయిలో 99 కి చేరింది. రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైంది. తెలంగాణలో పదేళ్లు అధికారం లేకున్నా చివరికి 2023 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓటర్లు గెలిపించారు. రెండు తెలుగు ప్రాంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా చివరిసారి జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన అత్యధిక స్థానాలు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌కు మొత్తం 42 సీట్లకుగాను 29, 2009లో 33 స్థానాలు వచ్చాయి. ఈ సీట్లే కేంద్రంలో పది సంవత్సరాలు యూపీఏ సర్కారుకు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చాయి కాంగ్రెస్‌ పార్టీకి కల్పించాయి. మరి కాంగ్రెస్‌ పార్టీతో నూరేళ్లకు పైగా అనుబంధం ఉన్న తెలుగువారికి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాం్రVð స్‌ ఇటీవలి రాజకీయ వ్యూహాలు, రాహుల్‌ గాంధీ రాజకీయ విన్యాసాలు, వ్యాఖ్యలు వింతగొలుపుతున్నాయి. తాజాగా ఆయన దేశంలో శ్రమ దోపిడీకి గురి అవుతున్న ప్రజలందరూ తాను ప్రారంభిస్తున్న ‘తెల్ల టీషర్ట్‌ ఉద్యమం’లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ వినూత్న జనాందోళన వివరాలు తెలుసుకున్న భారత ప్రజానీకం ముఖ్యంగా తెలుగువారు, ‘‘ అసలు కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌కు ఏమైంది? ప్రజలతో మమేకమయ్యే ఉద్యమాలు రూపొందించే శక్తిని కాంగ్రెస్‌ పూర్తిగా కోల్పోయిందా?’ అని ప్రశ్నిస్తున్నారు. భారత్‌ జోడో యాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ వార్తల్లోకి కాంగ్రెస్‌ ప్రచారంలోకి తెసుకొస్తున్న రాహుల్‌ తెల్ల టీషర్ట్‌ స్వల్పకాల చరిత్రను గుర్తుచేసుకుందాం.

రాహుల్‌ తెల్ల టీషర్ట్‌ ‘బ్రాండ్‌ వాల్యూ’ పెంచే ప్రయత్నం?

రెండేళ్ల నాలుగున్నర నెలల క్రితం 2022 సెప్టెంబర్‌ 7న రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి జనంలో మద్దతు కూడగట్టడానికి ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ 4080 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ యాత్రలో 54 సంవత్సరాల ఈ యువనేత మొదటి నుంచి చివరి వరకూ ఖాకీ ట్రౌజర్స్‌పై వేసుకున్న తెల్ల రంగు టీషర్ట్‌ కొట్టొచ్చినట్టు అందరికీ కనిపించింది. 136 రోజులకు యాత్ర ముగిసిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాహుల్‌ తెల్ల టీషర్ట్‌నే ధరిస్తూ వస్తున్నారు. పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు దిగువసభ తొలిరోజు సమావేశంలో, అలాగే లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన రోజు మాత్రం రాహుల్‌ తాను పూర్వం క్రమం తప్పకుండా ధరించిన తెల్ల ఖద్దరు కుర్తా, పైజామా ధరించారు. మళ్లీ లండన్, అమెరికా పర్యటనల్లో కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకున్నారు. మధ్యమధ్యలో వెస్ట్‌ కోట్‌తో భారతీయ దుస్తులతో కొన్ని వేదికలపై దర్శనమిచ్చారు. అన్ని రాజకీయ సమావేశాల్లో, ఇంకా పార్లమెంటులో తెల్ల టీషర్ట్, ఖాకీ లేదా నల్ల రంగు ప్యాంట్‌ ధరించి రాహుల్‌ కనపడడం ఆనవాయితీగా మారింది. 2024 జూన్‌ 19న తన 54వ పుట్టినరోజు రాహుల్‌ గాంధీ మరోసారి తెల్ల టీషర్ట్‌ విశిష్ఠత గురించి చెప్పి, దాని ‘బ్రాండ్‌ వాల్యూ’ పెంచే ప్రయత్నం చేశారు. ‘పారదర్శకత, దారుఢ్యం, నిరాడంబరతకు తెల్ల రంగు టీ షర్ట్‌ చిహ్నం,’ అని ఆయన కొత్త భాష్యం చెప్పడం దేశ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. రహదారులపై ఆరు బయట ఎండలో నాలుగున్నర మాసాలు సాగిన పాదయాత్రలో సునాయాసంగా నడవడానికి రాహుల్‌కు తెల్ల టీషర్ట్‌ ధరించడం చాలా సుఖంగా, అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అందులో తప్పులేదు. అంతేగాని కాటన్‌ టీషర్ట్‌కు పారదర్శకత, దారుఢ్యం, నిరాడంబరత అనే గొప్ప గుణాలను నెహ్రూ–గాంధీ కుటుంబ ఐదో తరం వారసుడు ఆపాదించడమే కోట్లాది మందికి మింగుడు పడడం లేదు. ఒక నాయకుడు అనుకోకుండా ఒక ‘చారిత్రక సందర్భం’లో ధరించిన దుస్తులకు అంత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆదివారం ప్రకటించిన ‘వైట్‌ టీషర్ట్‌ ఉద్యమం’ ఉరకలు వేసేదెన్నడో మరి!

‘నరేంద్ర మోదీ సర్కారు కొద్ది మంది పెట్టుబడిదారులను మరింత ధనికులను చేస్తుండడంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి,’ అంటూ రాహుల్‌ కిందటి ఆదివారం ‘తెల్ల టీషర్ట్‌ ఉద్యమం’ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగే ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ ‘తన శ్రామికవర్గ సహచరులు’, యువతకు ఆయన విజ్ఞప్తిచేశారు. ఈ ఆందోళనలో పాల్గొనాలనుకునేవారు తాను ఇక్కడ ఇస్తున్న లింక్‌ను క్లిక్‌ చేసి, రాసిన మొబైల్‌ నంబర్‌కు మిస్సడ్‌ కాల్‌ ఇవ్వాలని విశాల సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆయన కోరారు. ఈ వినూత్న ఉద్యమం వెబ్‌సైట్‌లో ‘వైట్‌ టీషర్ట్‌ కేవలం ఒక గుడ్డ ముక్క కాదు. కరుణ, సమైక్యత, అహింస, సమానత్వం, అందరికీ ప్రగతి అనే ఐదు మార్గదర్శక సూత్రాలకు ఇది చిహ్నం. ఈ విలువలు సామరస్యం, భిన్నత్వం పునాదిగా నిర్మించిన ఎనిమిది వేల ఏళ్ల భారత నాగరికతను ప్రతిధ్వనిస్తాయి,’ అని పేర్కొనడం ఆలోచనాపరులకు కాస్త వింతగా కనిపిస్తోంది. ఒక్క తెల్ల టీషర్ట్‌కు వేలాది సంవత్సరాల నాగరికతను, అది చెప్పే విలువలను ఆపాదించడం గొప్ప రాజకీయ సాహసం. రాహుల్‌ గాంధీకి మారుపేరుగా, ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా అవతరించిన తెల్ల రంగు టీషర్ట్‌ను శ్రామికవర్గం చిహ్నంగా మార్చాలని దశాబ్దాల పాలనా అనుభవం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చూడడం నిజంగా తెలివితక్కువతనమే అవుతుంది. తమ అధినాయకుడు నిత్యం ధరించే వైట్‌ టీషర్ట్‌ను వేసుకునే తీరును కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అనుసరించవచ్చేమో గాని దోపిడీకి గురయ్యే శ్రామికులందరూ తెల్ల టీషర్ట్‌ వేసుకోవాలని కోరుకోవడం.

తెల్ల దొరల దోపిడీకి ప్రతిఘటనా చిహ్నంగా ఖాదీ ధారణకు పిలుపినిచ్చిన బాపూ!

బ్రిటిష్‌వారి పాలనలో తెల్ల దొరల దోపిడీకి చిహ్నంగా మారిన ఇంగ్లిష్‌ మిల్లు బట్టల కొనుగోలు బహిష్కరించి, చేతితో వడికిన నూలు వస్త్రం ఖాదీ (ఖద్దరు) ధరించాలని నూరేళ్ల క్రితం 20వ శతాబ్దం ప్రథమార్ధంలో మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. బ్రిటిష్‌ వారి దోపిడీకి నిరసనగా భారతీయులంతా ఖాదీ బట్టలు వేసుకోవాలని బాపూ విజ్ఞప్తి చేయడమేగాక నిరంతరం ఆచరణ ద్వారా దాన్ని ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలూ ఖద్దరు బట్టలు ధరించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. స్వాతంత్య్ర వచ్చాక కూడా కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు ఖాదీ దుస్తులు ధరించడాన్ని అలిఖిత శాసనంగా అమలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిపాలన మూడు దశాబ్దాలు దాటి 1977 ప్రాంతానికి వచ్చేసింది. అప్పటికి దేశంలో ఖాదీ అంటే కాంగ్రెస్‌ అధికార దాహానికి, అవినీతికి గుర్తుగా కొందరు ప్రజలకు కనిపించడం నిజంగా దురదృష్టం. కాంగ్రెస్‌ పార్టీ నేపథ్యం ఉన్న సోషలిస్టులు, జనతాపార్టీ, జనతాదళ్, లోక్‌దళ్‌ వంటి పార్టీల నేతలు సైతం ఖాదీ దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలకు చెందిన నేతలు, చట్టసభల సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఖాదీ బట్టలు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. వస్త్రధారణలో ఆహ్వానించదగిన వైవిధ్యం పార్లమెంటులో, అసెంబ్లీలు, ఇతర చట్టసభల్లో కనిపిస్తోంది. మరి, ఈ నేపథ్యంలో దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులు తెల్ల రంగు టీషర్ట్‌ ధరించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పిలుపునివ్వడం హేతుబద్ధంగా లేదు.

కమ్యూనిస్టుల రెడ్‌ షర్ట్స్, టీడీపీ పసుపు చొక్కాలను ఎగతాళి చేసిన కాంగ్రెస్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అంతకు ముందు మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రా స్టేట్‌లో దేశంలో రెండో జాతీయపక్షంగా పరిగణించే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నేతలు కొందరు ఎర్ర రంగు చొక్కాలు (రెడ్‌ షర్ట్స్‌) ధరించేవారు. ఇప్పుడు కూడా జాతీయ, రాష్ట్ర, జిల్లా మహాసభల్లో సీపీఐ, సీపీఎం నాయకులు తెలుగునాట, కేరళ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో రెడ్‌ షర్టులు, తెల్ల ప్యాంటులతో దర్శనమివ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే, కమ్యూనిస్టులు బలంగా ఉన్న 1940ల చివర్లో, 1950లు, 1960ల ఆరంభంలో తెలుగు ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఎర్ర చొక్కాలు, నిక్కర్లు వేసుకోవడాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎగతాళిచేసేవారు. ‘ఎర్ర రంగు ఎవరిదిరా? ఫలానా ఎస్టీ కులం పురుషులు ధరించే గోచీ రంగు కదా?’ అంటూ కాంగ్రెస్‌ నాయకులు ‘వ్యగ్యం పండించే’ ప్రయత్నం చేసిన సందర్భాలు పాత తరం తెలుగువారికి ఇంకా గుర్తున్నాయి. అలాగే, తెలుగుదేశం పార్టీ జెండా రంగు పసుపు కావడంతో పసుపు రంగు షర్టులు, తెల్ల రంగు ప్యాంట్లు వేసుకునే టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా కాంగ్రెస్‌ నాయకులు విమర్శనాత్మకంగా చూసేవారు. దేశంలో వివిధ రాజకీయపక్షాల నాయకులు, కార్యకర్తలు అనేక రంగుల చొక్కాలు వేసుకున్న చరిత్ర ఉండగా ఇప్పుడు కేంద్రంలో పాలకపక్షం పెత్తనం, పెట్టుబడిదారుల దోపిడీకి గురయ్యే శ్రామికవర్గం ప్రజలు తెల్ల రంగు టీషర్టులు వేసుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పిలుపునివ్వడం ఒకమోస్తరు రాజకీయ ఎత్తుగడ మాత్రమేగాని తెలివైన వ్యూహం కానే కాదు.

Tags:    

Similar News