సర్కారు మారింది.. లులూ మళ్లీ కదిలింది

టీడీపీ పాలనలో ముందడుగు.. వైసీపీ హయాంలో వెనకడగు ఈ మాల్ కోసం 13.83 ఎకరాల కేటాయింపు.. ఆపై రద్దు.. విశాఖను ఆరేళ్లుగా ఊరిస్తున్న లులూ మాల్..

By :  Admin
Update: 2024-10-02 06:50 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం) 

మాల్ మాల్.. లులూ మాల్! అరేడేళ్లుగా ఈ పేరు విశాఖ వాసుల నోళ్లలో నానుతోంది. అందాల వైజాగ్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో లులూ మాల్ వచ్చేస్తోందంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఊదరగొట్టింది. కొన్నాళ్లకు టీడీపీ సర్కారు అధికారం కోల్పోయింది. ఆ తర్వాత పాలనలోకి వచ్చిన వైసీపీ అభ్యంతరాలతో లులూ వెనక్కి పోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక రాదనుకున్న లులూ మరోసారి ముందుకు వస్తానంటోంది.

తెలుగుదేశం ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ప్రఖ్యాత లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ విశాఖలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనిపై ఆ సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకుంది. ఎంఓయూలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఏపీఐఐసీ సంస్థకు చెందిన 11.23 ఎకరాలు, దానికి ఆనుకుని ఉన్న సీఎంఆర్ గ్రూపునకు చెందిన మరో 2.60 ఎకరాలు వెరసి 13.83 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం లులూకు కేటాయించింది. దీంతో ఆ సంస్థ శంకుస్థాపన ప్రక్రియను కూడా పూర్తి చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లులూ మాలు భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిపిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ పరిణామంతో లులూ సంస్థ వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లులూ సంస్థ యాజమాన్యంలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. దీంతో సెప్టెంబర్ 28న అమరావతిలో లులూ గ్రూప్ చైర్మన్ ఎం.ఎ. యూసఫ్ ఆలీ.. తనకు 18 ఏళ్ల సోదర అనుబంధం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. విశాఖలో స్థలాన్ని కేటాయిస్తే అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఎనిమిది స్క్రీన్ల ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్ మాల్ను నిర్మించడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ మాల్తో పాటు విజయవాడ, తిరుపతిల్లో అధునాతన హైపర్ మార్కెట్లను, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని 'ఎక్స్' లో వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబుతో తమ చర్చలు ఫలప్రదమయ్యాయని కూడా ఆయన చెప్పుకున్నారు.

లులూకు స్థలంపై సందిగ్ధత..

తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖలో గతంలో లులూకు కేటాయించిన స్థలాన్నే తిరిగి ఇస్తారా? లేక మరోచోట మంజూరు చేస్తారా? అన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. తొలుత లులూకు కేటాయించిన 13.83 ఎకరాల ను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఆ స్థలంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. అడుగు ధర రూ.6,500 చొప్పున నిర్దేశించింది. అయితే ఆ ప్రతిపాదనకు స్పందన కనిపించలేదు. దీంతో లులూ స్థలంతో పాటు గాజువాక సమీపంలోని అగనంపూడి, ఫకీర్అక్యాల్లోని మరో మూడెకరాలు కలిపి రూ.1,465 కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఇందులో లులూకు కేటాయించిన 13.83 ఎకరాలకు రూ. 1,452 కోట్ల విలువ కట్టింది. ఇలా అమ్మకానికి పెట్టిన భూములు కొనడానికి అంతగా ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా టీడీపీ హయాంలో లులూకు తక్కువ ధరకే భూములను కేటాయించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటితో పోల్చుకుంటే ఈ భూముల విలువ ఎంతో పెరిగింది. పైగా ఇప్పుడు అదే స్థలాన్ని కేటాయిస్తే విశాఖ వాసుల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితులున్నాయని చెబుతున్నారు. పైగా ఆ స్థలం సీఆరెడ్ పరిధిలో ఉన్నందున బహుళ అంతస్తుల నిర్మాణం కుదరదని అంటున్నారు. అందువల్ల విశాఖలో ఇంటర్నేషనల్ మాల్ ఏర్పాటుకు లులూ ముందుకొస్తే మరో చోట ఎక్కడైనా స్థలాన్ని కేటాయించాల్సిందేనని పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తోందని సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులూ చైర్మన్ భేటీ అయిన నేపథ్యంలో త్వరలోనే ఆ సంస్థ ప్రతినిధి బృందం త్వరలో విశాఖ వస్తారని తెలుస్తోంది.

వేలాది మందికి ఉపాధి..

విశాఖలో లులూ మాల్ ఏర్పాటైతే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కనీసం 10 వేల మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే వీలుంటుంది. ఈ మాల్లో ఐదు వేల సీటింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్, ఎమ్యూజ్మెంట్ పార్కు, ఇతర వసతులను కల్పించే అవకాశం ఉంది.

దేశంలో ఏడు చోట్ల లులూ మాల్లు..

లులూ ఇంటర్నేషనల్ గ్రూపునకు దేశంలో ఏడు చోట్ల మాల్స్ ఉన్నాయి. కేరళలోని కొచ్చి, పాలక్కాడ్, తిరువనంతపురం, కోజికోడ్, కర్నాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఉత్తరప్రదేశ్లోని లక్నోల్లో లులూ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఎనిమిదవది విశాఖపట్నంలో ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (గల్ఫ్)లోని అబుదాబి ప్రధాన కేంద్రంగా లులూ సంస్థ షాపింగ్ మాల్స్తో పాటు హైపర్ మార్కెట్ కార్యకలాపాలు, తయారీ, సరకు వర్తకం, ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో చురుగ్గా ఉంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, ఈజిప్ట్ తదితర దేశాల్లో లులూ గ్రూప్ 255 వరకు షాపింగ్ మాల్స్ నిర్వహిస్తోంది. ఈ సంస్థకు 8 బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉంది. 

Tags:    

Similar News