ఆగ్రా ఎర్రకోట ప్రతిగోడకి ఒక కథ ఉంది...

ఇది మొగల్ ఖజానా... అక్బర్ నిర్మించిన ఆగ్రా కోట! తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-5;

Update: 2025-04-09 10:48 GMT
ఆగ్రా కోట

అదిగో..మొగల్ రాజవంశ ఖజానా! అక్బర్ పునర్నిర్మించిన ఆగ్రా కోట! అందమైన రాణులకే కాదు, వందలాది మంది అంత:పుర కాంతలకూ అదొక అందమైన జీవిత ఖైదు! కన్న కొడుకు ఔరంగాజేబు తిరుగుబాటుతో మొఘల్ చక్రవర్తి షాజహాన్ కు జీవిత కారాగార మైన చోటు!

ఎర్రటి ఇసుక రాళ్ళతో ఎంత అందంగా నిర్మించారో! చక్రవర్తినే కాదు, మొగల్ రాజ వంశస్తులెవరినీ కన్నెత్తి చూట్టానికి, పన్నెత్తి ప్రశ్నించడానికి సాహసించ వీలు లేని శత్రు దుర్భేద్యమైన కోట! ఎర్రటి ఇసుకు రాళ్ళతో కట్టిన ఈ కోట కోసం ఎందరి ఎర్రటి రక్తం ఏరులుగా పారిందో! భారత దేశాన్ని మూడు శతాబ్దాల పైగా పాలించిన మొఘల్ రాజవంశ వైభవోజ్వల చరిత్రలో అగ్రభాగాన నిలిచింది ఈ ఆగ్రాకోట. నాలుగు శతాబ్దాలైనా చెక్కుచెదరని ఇదొక లాల్ ఖిల్లా.

చరిత్రను ఎంత తవ్వినా, ఆగ్రా కోటకు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తాజ్ మహల్ నిర్మాణ కౌశలం నీడలో దాగిన విషాదం బైటపడదు! చక్రవర్తి షాజహాన్ కోసం పద్నాలుగు మంది పిల్లల్ని కన్న ముంతాజ్ బేగం తన మరణానికి ముందు పారించిన రక్త ప్రవాహాన్ని గుర్తుకు చేసుకుని నిట్టూర్పులు విడవాల్సిందే. మా మధ్యాహ్న భోజనానికి కాస్త ఆలస్యమైంది. ఒక హోటల్ లో పన్నీర్ కర్రీ రోటీ తిన్నాం. పొడవాటి ముతక బియ్యంతో వండిన అన్నంలో పెరుగేసుకునీ తినేశాం.

మా నలుగురిలో ఒక సందేహం. ముందుగా ఆగ్రా కోట చూడాలా? ఫతేపూర్ సిక్రీ వెళ్లాలా? దగ్గరగా ఉంది కనుక ఆగ్రా కోట చూద్దామన్నాను. వాకా ప్రసాద్ సరే అన్నారు. పరమేశ్వరరావు, హరీష్ కాదనలేదు. మా డ్రైవర్ కిషన్ ఆగ్రాకోట వైపు కారు మళ్ళించాడు. కోట ముందు కూడా రిక్షాలు, ఈ రిక్షాలు, ఆటోలు, అందంగా అలంకరించిన జట్కా బండీలు కొత్తపాతల మేలుకలయికగా అలరించాయి. తాజ్ మహల్ వద్దే కాదు, ఆగ్రా కోట దగ్గర కూడా సందర్శకులు ఎక్కువగా ఉన్నారు.

ఎర్రటి ఇసుక రాళ్ళతో నిర్మించిన ఎత్తైన కోట గోడలు. తొమ్మిది మీటర్ల వెడల్పు, పది మీటర్ల లోతుగా, శత్రువు లోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా కోట చుట్టూ కందకాన్ని తవ్వించారు. ఒకప్పుడు ఈ కోటకు నాలుగు గేట్లుండేవి. తరువాత రెండు గేట్లను మూసేశారు. ప్రస్తుతం అమర్ సింగ్ గేటు నుంచే పర్యాటకులను అనుమతిస్తున్నారు.

మొగల్ సామ్రాజ్యం ఉథ్థానపతనాలు

హిందూకుష్ పర్వతాల్లో శరణార్థిగా బతుకుతున్న బాబర్ 1504లో కాబూల్ ను స్వాధీనం చేసుకున్నాడు. కాబూల్ లో వచ్చే ఆదాయంతో తృప్తి చెందక, హిందూస్థాన్ వైపు దృష్టి సారించారుడు. ఖైబర్ కనుమల గుండా అదృష్టాన్ని వెతుక్కుంటూ భారత్ లోకి ప్రవేశించిన బాబర్ మళ్ళీ వెనక్కి చూడలేదు. ఇక్కడ పారుతున్న నదులు, వీస్తున్న చల్లని గాలులు, ఆ గాలులకు తలలూపుతున్న పచ్చటి పంటపొలాలను చూసి మైమరచిపోయినట్టు తన ఆత్మకథలో రాసుకున్నాడు బాబర్. పానిపట్టులో ఇబ్రహీం లోడీని ఓడించి, ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.

మూడువందల సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించిన మొగల్ సామ్రాజ్యానికి బాబర్ బలమైన పునాది వేశాడు. బాబర్ విదేశీయుడే కావచ్చు. కానీ, అతని వారసులైన, తరువాత వచ్చిన మొగల్ చక్రవర్తులంతా ఇక్కడ పుట్టిన వారే. ఈ దేశా వాసులే, ఈ దేశ పాలకులే. మొగల్ సామ్రాజ్య స్థాపన కోసం పానిపట్టు యుద్ధంలో ఎన్ని కుత్తుకలను తెగ్గోశాడో! ఎంత రక్తం పారించాడో! చరిత్రలో ఎంత వెతికినా దొరకదు! అనేక యుద్ధాలతో సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన బాబర్ 1530లో మరణించాడు.

బాబర్ తన ఆత్మకథ ‘బాబర్ నామా’ను పర్షియా భాషలో రాశాడు. అది అతని సాహిత్య ప్రతిభను చాటుతుంది. బాబర్ కుమారుడు హుమయూన్ మొగల్ చక్రవర్తి గా కొనసాగి మరణించేనాటికి అక్బర్ వయసు కేవలం పదమూడేళ్ళు. ఆ వయసులో రాజ్య బాధ్యతలు చేపట్టి, మొగల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆగ్రా కోటను పునర్నిర్మించాడు.

మధ్య యుగాల్లో జాతీయ వాదం, లౌకికత్వం అన్న భావనలు లేవు. వాటి గురించిన ఊహలు కూడా వచ్చేవి కావు. అలాంటి కాలంలో అక్బర్ మత సామరస్యాన్ని పాటిస్తూ, మొగల్ చక్రవర్తిగా భారత దేశాన్ని 47 ఏళ్ళు పాలించాడు. మధ్య యుగాల్లో పాలకుల మతమే ప్రజల మతంగా చెలామణి అయ్యేది. అక్బర్ హిందూ స్త్రీని వివాహం చేసుకుని, ఆమె ఆరాధనా స్వేచ్ఛను గౌరవించాడు. ఇస్లాం నుంచి బయటకు వచ్చేసి ‘దిన్ ఇలాహి’ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. కానీ, ఆమతంలో చేరమని ఎవ్వరినీ ఒత్తిడి చేయలేదు. ఆ మతంలో తానొక్కడే ఉండిపోయాడు.

మొగల్ చక్రవర్తులు సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, వాస్తు నిర్మాణ రంగంలో భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేశారు. మొగలాయి పెంయింటింగ్ లు అనేక సజీవ దశ్యాలను చూపించాయి. వారు కొత్త రంగులను వాడారు. అక్బర్ ఆస్థానంలో ఇద్దరు చిత్రకారులు మహాభారత దృశ్యాలను చిత్రించారు. ఈ కాలంలోనే కవి ఫైజీ ఆధ్వర్యంలో మహాభారతం ఫర్షియా భాషలోకి అనువాదమైంది. ఆ కాలంలోనే రామాయణ మహాభారతాలు స్థానిక భాషల్లోకి అనువాదమయ్యాయి. పర్షియన్ నిఘంటువు తయారైంది.

మధ్యయుగాల్లోని రాజాస్థానాల్లో మతానికి ఉత్కృష్టమైన విలువ ఉండేది. అక్బర్ హిందువుల నుంచి జిజియా పన్ను వసూలు చేసినట్టు, ముస్లింల నుంచి జకత్ పన్ను వసూలు చేశాడు. మొగల్ చక్రవర్తులు ఎన్ని కోటలు కట్టినా, ఎంత అద్భుతమైన రాజ సౌధాలు, మసీదులు నిర్మించినా, వారి వ వైభోగమంతా ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి వసూలు చేసిన పన్నుల తోనే కదా! పొరుగు రాజ్యాలను కొల్లగొట్టిన సొమ్ముతోనే కదా! మధ్య యుగాల రాజులు చక్రవర్తులంతా ఒక రకంగా వ్యవస్థీకృతమైన బందిపొట్లే కదా! అక్బర్ విశాలమైన మొగల్ సామ్రాజ్యాన్ని తన కుమారుడు జహంగీర్ కు అప్పగించడంతో, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో కులాసా జీవితాన్ని గడిపాడు. జహంగీర్ ఎంతగానో ఆరాధించిన నూర్జహాన్ ను పెళ్ళి చేసుకుని, పరిపాలననంతా అమెకు అప్పగించాడు.

బాబర్ కొడుకు హుమయూన్ ఈ ఆగ్రాకోటలోనే పట్టాభిషక్తుడయ్యాడు. తరువాత మొగల్ సామ్రాజ్య చక్రవర్తిగా వచ్చిన అక్బర్ ఈ కోటను పునర్మిర్మించడానికి ఎనిమిదేళ్ళ పట్టింది. మొగలుల రాజధాని ఢిల్లీకి మారే దాకా, దాదాపు శతాబ్దం పైగా ఈ ఆగ్రా కోటే మొగలుల నివాసమైంది. మరాఠాల ఆధీనంలో ఉండగా ఇది బ్రిటిష్ వారి వశమైంది. ఇది చరిత్ర.

ఈ ఆగ్రా కోటను 94 ఎకరాల్లో అక్బర్ మొగల్ వాస్తు శైలిలో నిర్మించాడు. ఈ కోట గోడనే రెండున్నర కిలోమీటర్ల పొడవుంటుంది. అందు చేత ఇది గోడ కట్టిన నగరంగా పేరుపడింది. ఆగ్రా కోట భూగర్భంలో ఉండే ప్రాంతమంతా ప్రస్తుతం మూసివేశారు. ఈ భూగర్భంలోనే మొగలులు బంగారం, వెండి, వజ్రాలు దాచేవారు. మొగలులకు ఇది ఒక అతి పెద్ద ఖజానా. ఎంత సంపద ఉందో, ఈ కోటలోపల అంతకు మించిన దుర్మార్గమూ దాగి ఉంది. మొదటి అంతస్తులో ఉరి తీయడానికి పజ్జెనిమిదిన్నర అడుగుల కొయ్యదూలం ఏర్పాటు చేశారు.

 ఆగ్రా కోట లో ఇక్కడి నుంచే కనిపిస్తున్న తాజ్ మహల్ ను ప్రతి రోజూ షాజహాన్ చూసే వాడు

మొదటి అంతస్తులో అనేక గదులున్నాయి. ఒక బావితో పాటు, కారిడార్ లో నీటి కొలను ఉంది. రెండవ అంతస్తు చాలా విశాలంగా ఉంది. వాయువ్య దిశలో రెండున్నర కిలోమీటర్ల దూరంలో నిర్మించిన తాజ్ మహల్ ఈ ఆగ్రా కోట నుంచి కనిపిస్తుంది. ముంతాజ్ బేగం మరణించాక, ఆమె జ్ఞాపకార్థం కట్టిన తాజ్ మహల్ ను షాజహాన్ ఈ కోట నుంచే ప్రతిరోజూ వీక్షించేవాడు.

ఈ కోటలో అనేక రకాల భవనాలున్నాయి. ఇందులో షీష్ మహల్, ఖాసా మహల్, జహంగీర్ మహల్ ముఖ్యమైనవి. ఈ ఆగ్రా కోటను అక్బర్ నిర్మించినప్పటికీ, ఎక్కువ భాగం షాజహాన్ పాలరాతితో దానికి అందాలు చేకూర్చాడు. అక్బర్ తన భార్య జోదా అక్బర్ కోసం నిర్మించిన భవనం, తరువాత జహంగీర్ మహల్ గా ప్రసిద్ధి చెందింది. షాజహాన్ ఖాసా మహల్ ను ఇస్లామిక్ పర్షియన్ వాస్తు శైలిలో నిర్మాంచాడు. ఇందులో హిందువుల నమూనాలు కూడా ఉన్నాయి.

షి ష్ మహల్

వేసవి విడిదిగా షీష్ మహల్ ను నిర్మించడానికి తొమ్మిదేళ్ళు పట్టింది. దీని కప్పుపైన, గోడలపైన గ్లాస్ మొజాయిక్ వర్క్ కనిపిస్తుంది. ఈ గ్లాస్ ను సిరియా నుంచి తెప్పించారు. ఇది చీకట్లో కూడా మెరుస్తుంది. లాహోర్, ఢిల్లీలో కూడా గ్లాస్ ప్యాలెస్ ను నిర్మించారు కానీ, ఆగ్రా కోటలో ఉన్నంత అద్భుతంగా అవి లేవు. షీష్ మహల్ మహిళల డ్రెస్సింగ్ కు కూడా ఉఫయోగించేవారు. తరువాత అద్దాలతో అందంగా నిర్మించారు.

వేసవిలో విశ్రాంతి కోసం షాన్ బురుజును నిర్మించారు. ఇక్కడ అత్యద్భుతమైన నెమలి సింహాసనం ఉండేది. షాజహాన్ నిర్మించిన రెండు అద్భుతాల్లో తాజ్ మహల్ ఒకటైతే, రెండవది నెమలి సింహాసనం. ఈ సింహాసనాన్ని తరువాత ఎర్రకోటకు తరలించారు. మొగల్ అంత:పుర స్త్రీల కోసం నగీనా మజ్దీద్ ను నిర్మించారు.

సభా మందిరం

అందమైన సమావేశ మందిరాన్ని ఎటు వైపు నుంచి చూసినా, వెంట్రుక వాసి తేడా కనిపించదు. అంత గొప్పగా నిర్మించారు. దీని ముందు చక్కని మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచారు. ఎన్ని వైభోగాలను అనుభవించిన షాజహాన్ జీవిత ఖైదీగా శేష జీవితాన్ని ఈ కోటలోనే గడిపాడు. ఆ సమయంలో నైనా తాను చేసిన దుర్మార్గాలకు, మఖ్యంగా పద్నాలుగు మంది పల్లల్ని కనేదాకా ముంతాజ్ బేగంను పీల్చి పిప్పి చేసినందుకు, తన సోదరుల కుటుంబంలోని మొగవాళ్ళందరినీ చంపించినందుకు పశ్చాత్తాపం చెందాడో లేదో ఎవరికి తెలుసు? తాజ్ మహల్ వద్దే అతని పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఈ ఆగ్రా కోటలోనే ఔరంగా జేబు, శివాజీ సమావేశమయ్యారు.

పాలరా తి తో నిర్మించి న మండ పం

ఇంత చరిత్ర కల ఆగ్రాకోట, అద్భుతమైన తాజ్ మహల్, నెమలి సింహాసనం వంటి మొగల్ సామ్రాజ్య వైభవం సరే.. సామాన్యుల శవాలపై కట్టిన నిర్మాణాలేంటి? వారు పారించిన రక్తం సంగతేంటి? అసలు సామాన్యుల సంగతేంటి? వారి జీవన స్థితిగతులేమిటి? శతాబ్దాలుగా జరుగుతున్న ఈ పరిణామాలకు మౌన సాక్షిగా నిలబడిన ఆగ్రా కోట ప్రశ్నిస్తూనే ఉంది.

(ఇంకా ఉంది)

Tags:    

Similar News