కొండా సురేఖపై వేటు... కాంగ్రెస్‌కి మేలా కీడా?
సభ్యత సంస్కారం సున్నా. మంచి మర్యాద శూన్యం. బూతు తెలుగు నాట ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. తెలుగు రాజకీయాల్లోకి బూతులు ఎలా వచ్చాయి, మొదట నోరుజారిందెవరు?
గత పది పదిహేనేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నాయకుల మాటలు వింటుంటే పరమ రోత కలుగుతోంది. సభ్య సమాజం ఏమనుకుంటుందోనన్న స్పృహ లేకుండా ప్రచురించడానికి వీలులేని పదాలతో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. పార్టీలోని నాయకులు, ముఖ్యులు బూతులు దోకుతుంటే, మాటల విషం చిమ్ముతుంటే నివారించాల్సిన అధినేతలే స్వయంగా నోటి తీటగాళ్ళు కావడంతో బూతు పురాణానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రాజును ఖుషీ చేయడానికి బంట్లు రోత ఆరోపణలు, బూతు మాటల స్థాయి పెంచి ఇంకా కంపు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నడో మాయమైన విలువలు, మంచి సంప్రదాయాల సంగతి దేవుడెరుగు....కనీసం ఈ రాజకీయ నాయకులు మంచి భాష మాట్లాడితే చాలని జనం కోరుకుంటున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, వంగ్యాస్త్రాలు సంధించడం వేరు... నీచాతి నీచమైన చెడ్డ మాటలను తూటాలుగా చేసుకుని దాడి చేయడం వేరు. చాణక్యుడు చెప్పిన వ్యూహప్రతివ్యూహాలు, యుక్తులు కుయుక్తులు, కుతంత్రాలు, మాయలు రాజకీయాల్లో ఉంటాయి కానీ నాయకులు మరీ బరితెగించి చౌకబారుగా మాట్లాడడం అంతకంతకూ ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది. నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహా రావు, కోట్ల విజయభాస్కర రెడ్డి తదితర ముఖ్యమంత్రులు పెద్దరికం, హుందాతనంతో మెలిగేవారు. మాటలు పొదుపుగా, ఆచితూచి మాట్లాడేవారు. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగినంత కాలం (ఎనిమిదో దశకం దాకా) మరీ ఇప్పుడున్న లాంటి బరితెగింపు లేదు. రాజకీయాల్లో దాదాపు అన్ని స్థాయుల్లో హుందాతనం కనిపించేది. తర్వాత దిగజారుడు మొదలయి వేగం పుంజుకుని జుగుప్స స్థాయికి చేరుకుంది.
తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో రాజకీయాలు చేసిన ఎన్టీఆర్ కాలంలో మొగ్గతొడిగిన బూతు... తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఉద్యమం నడిపిన కే సీ ఆర్ ఆధ్వర్యంలో వటవృక్షమయ్యింది. రేవంత్ రెడ్డి కాలం నాటికి బూతు వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఇరగకాయడం మొదలయ్యింది. అవినీతి ఆరోపణలు చేసే సమయంలో వాడే భాషకు భిన్నంగా, వ్యక్తిగత విమర్శలు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. పొలిటికల్ ప్రకటనల్లో బూతు వాడని నాయకుడు పాపాత్ముడై పోయాడు. పువ్వాడ నాగేశ్వర రావు, నర్రా రాఘవ రెడ్డి, ధర్మ భిక్షం, గుమ్మడి నర్సయ్య లాంటి కమ్యూనిస్టు నాయకులు ఎన్నడూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు. వారిని ఆదర్శంగా తీసుకునే వారు ఇక్కడ ఎవ్వరూ లేరు.
"మహా ఆవేశపరుడైన ఎన్టీఆర్ కాలంలో సంస్కారవంతమైన బూతులు ఉండేవి. ఒకసారి అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ ఎం ఎల్ ఏ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే పేపర్లు చూపిస్తే.... మడిచి పెట్టుకోండి.... అన్నట్లు అయన కోపంగా సైగ చేశారు. అది దుమారానికి దారితీస్తే తర్వాత అయన తాను ఆవేశంలో అట్లా అన్నానని ఒప్పుకున్నారు," అని ఆ నాటి సమావేశాలను కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టు ఒకరు గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించాక రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని చెబుతారు.
అత్యధికకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కిరికిరి రాజకీయ వ్యూహకర్తే గానీ స్వతహాగా బూతు మాటలు వాడే స్వభావం లేని నేత. "బాబు గారిది పాష్ వ్యవహారం. మరీ పరుషంగా మాట్లాడలేడాయన. అయితే, ఎంత కసి రగిలినా అయన ప్రత్యర్థులను డైరెక్ట్ గా తిట్టరు కానీ ప్రభావశీలంగా తిట్టే సహచరులతో ఆ పని చేయిస్తారు," అని ఆ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల డిస్ కోర్స్ దారుణమైన మలుపు తిరిగింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ లతో పాటు సినీ నటి రోజా బండ బూతు లను నార్మలైజ్ చేశారనడంలో సందేహం లేదు. ఈ మధ్య విశాఖపట్నంలో పర్యటించిన నేను జగన్ అభిమాని అయిన ఒక ఆటో డ్రైవర్ ను అడిగాను అయన దారుణ పరాభవం గురించి. "నాని, వంశీ, రోజా లే కంపు కంపు చేశారు. జనాల కోసం ఎంతో చేసిన జగనన్న పోవడానికి వీళ్ళ నోటి తీట పెద్ద కారణం," అని అయన స్పష్టంగా చెప్పాడు.
మంచి చదువరి, మాటకారి అయిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో బూతు రాజకీయాలను వేరే లెవల్ కు తీసుకుపోయి వర్తమాన రాజకీయ నాయకులకు విజయవంతమైన 'బూతు నమూనా' అందించారని ఆ జర్నలిస్టు విశ్లేషించారు. కే సీ ఆర్ గారు వాడినది బూతు అనడం కన్నా, దారుణమైన పరుష పదజాలం, రెచ్చగొట్టే మాటలు అనడం సమంజసం. ఉద్యమ కాలంలో ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రెచ్చగొట్టడానికి అయన ఆంధ్రా పాలకులపై చెప్పిన పిట్ట కథలు, వాడిన పదాలు (సన్నాసులు, రాక్షసులు వగైరా) శృతి మించినా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించాయి. ఈ క్రమంలోనే.... 'ఒక అబ్బకు, అమ్మకు పుట్టి ఉంటే...' అనే లాంటి దారుణమైన మాటలు పుట్టుకొచ్చి ఇప్పుడు దాదాపు అందరు వంకర రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతున్నాయి. 'కడుపులో మండితే మాటలు గిట్లనే వుంటాయన్నా," అన్న చెత్త వాదన ఒకటి మొదలు పెట్టి ఆ స్కీమ్ లో భాగంగా నాలుకను మురికి కాల్వను చేసుకోవడం చూశాం, చూస్తున్నాం.
అధినేత స్పూర్తితో, వారి ప్రాపకం కోసం కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ లలో, టీవీ స్టూడియోల్లో సభ్య సమాజం తలవంచుకునేలా మాట్లాడే ఒక సెక్షన్ నాయకులు పదేళ్ల పాటు వర్దిల్లారు. చక్కగా నాలుగు మాటలు మాట్లాడడం చేతగాక బూతునే రాజకీయ భాష చేసిన కుసంస్కారులకు వీరతాళ్ళు దక్కాయి. మొదటి ఐదేళ్ళలో సంసార పక్షంగా మాట్లాడినట్లు అనిపించిన కే టీ ఆర్ మీద మొదట్లో జనాలకు ఎంతో నమ్మకం ఉండేది. బూతు రాయుళ్లను నివారించాల్సింది పోయి అయన కూడా శృతి తప్పిన సందర్భాలు ఉన్నాయి. తండ్రి భాష వాడకుండా మిత వాదిగా కేటీఆర్ ఉండి ఉంటే, మొన్నటి ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పరిస్థితి మరీ అంత ఘోరంగా అయ్యేది కాదని నా నమ్మకం.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోరు కూడా కే సీ ఆర్ టైపే. 'ముడ్డి మీద తంతా...', 'పండబెట్టి తొక్కుతా...', 'తొక్కి నార దీస్తా...' అన్నవి ఆయన కామన్ డైలాగ్స్. అనూహ్యంగా దక్కిన అధికారాన్ని సవ్యంగా చక్కబెట్టకుండా ఈ తరహా మాటలతో రాజకీయం చేయడం వారికి నష్టం తెస్తున్నది. కేటీఆర్ మీద కోపంతో చాలా అమానుషమైన మాటలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖ ను మందలించక పోవడం అయన చేసిన పెద్ద తప్పు. ఆమె వాడిన పదాలు, చేసిన ఆరోపణలు, మరో మహిళను దారుణంగా కించపరిచిన బజారు భాష అత్యంత ఘోరమైనవి. ఇతరేతర కారణాల రీత్యా అక్కినేని నాగార్జున మీద గౌరవం లేకపోయినా తెలుగు సినిమా కు విశేష ప్రతిష్ఠ తెచ్చిన ఏ ఎన్ ఆర్ కుటుంబానికి, జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుకుంటున్న నటీమణికి అయినా గౌరవం దక్కేలా స్పందించాలి.
సురేఖ మాటలు కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అమ్మ సోనియా గాంధీ, అక్క ప్రియాంక లతో పాటు రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను కూడా దారుణంగా దెబ్బతీశాయి. కంటి తుడుపుగా మొక్కుబడి సారీతో పోయే పాపం కాదిది. తక్షణమే సురేఖ కు పదవి నుంచి ఉద్వాసన పలకకపోతే కాంగ్రెస్ కు అపారమైన నష్టం కలుగుతుంది.
పొలిటీషియన్స్ ఇష్టానుసారం బూతులు వాడుతుంటే, మేధావులు, విద్యావంతులు మౌనం వహిస్తున్నారు. ప్రధాన మీడియా బూతులను లైవ్ టెలికాస్ట్ చేయడంలో బిజీ అయిపోయింది. నకిలీ జర్నలిస్టులు బూతు పదబంధాలను హ్యాపీగా థంబ్ నెయిల్స్ గా పెట్టుకుని పరమానందభరితులై ప్రసారం చేస్తున్నాయి. వెర్రి జనాలు సోషల్ మీడియాలో ఒకటికి పదిసార్లు ఆ వీడియాలు చూసి తెలీని కుతి తీర్చుకుంటున్నారు. కోర్టులు వేగంగా స్పందించడం లేదు. ఈ క్రమంలో-- పొలిటీషియన్ అంటే అబద్ధాలు, అవినీతితో పాటు బూతుల్లో కూడా రాణించాల్సిన వాడిగా అయిపోయాడు. అది పాలిటిక్స్ కు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. అచ్చేసినంత మాత్రాన తెలంగాణ-పెడరల్ వాటిని సమర్థించినట్లు కాదు.)