మిథున్ కు ‘ఫాల్కే’నా? ష్... గప్ చుప్...!

ఆయనకు ‘ఫాల్కే’ అవార్డు అంటే అది ఈ రాజకీయ వాతావరణంలో వీచిన ‘తూర్పు గాలి’ ప్రాభవం అనేది మాత్రం ఒక చారిత్రిక సత్యమవుతుంది.

Update: 2024-10-02 08:49 GMT

అవి వేటికవి విడివిడిగా కనిపిస్తాయి, కానీ చరిత్రకారులు వాటిని కలిపి చూసినప్పుడు గానీ విషయం మనకు బోధపడదు. ఈ లోపు అవి ఎవరెవరో వేరువేరు ఖాతాల్లోకి చేరుకొని, అక్కడ మరేదో పేరుతో చెలామణి అవుతుంటాయి. అయితే, అవి ఎక్కడ ఉన్నప్పటికీ, వాటిని ఏరుకుని మరీ తెచ్చుకుని ‘హిస్టోరియన్’ వాటికి చారిత్రిక గౌరవం కల్పిస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది.

మిధున్ చక్రవర్తికి భారత అత్యున్నత సినిమా పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30న ప్రకటించింది. దాంతో ఆ నటుడు వెండితెరపైకి వచ్చినది ఇప్పటివరకు జరిగింది అందరూ చెబుతున్నారు. కానీ దానికి వెనక్కి వెళితే, అక్కడ ‘కళింగ యుద్ధం’ అంత చరిత్ర వుంది. అయితే, మరీ అంత వెనక్కి మనం వెళ్ళకుండా, ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడడం వెనుక వున్న కాలం 2000 వద్ద బయలుదేరి, ఇప్పటి మన వెండితెర కధనం వద్దకు వద్దాం.

ఒడియా రచయిత భాగబతి చరణ్ పాణిగ్రాహి రాసిన ‘షికార్’ పేరుతొ చిన్న కథ రాసారు. దీని ఆధారంగా- ‘మృగయా’ (ది రాయల్ హంట్) పేరుతో 1976లో ఒక చిత్రం విడుదల అయింది. మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె. రాజేశ్వరరావు నిర్మాత. ఇందులో 1930లలో భారత స్వాత్యంత్ర ఉద్యమం సమయంలో ఈ కథ ఒక ఒక ఒడిశా గ్రామంలో కఠినమైన జీవితాన్ని గడుపుతున్న గిరిజన సమాజం యొక్క జీవితాలను వివరిస్తుంది.

అసలు కథ 1930 లలో సెట్ చేయబడినప్పటికీ సినిమా స్క్రిప్ట్ 1850 లలో జరిగిన- ‘సంతాల్ తిరుగుబాటు’ నేపథ్యంలో వెండితెర కోసం సెట్ చేయబడింది. కథ ‘ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగి ఉండవచ్చు’ అని సేన్ అంటారు. మిథున్ చక్రవర్తి మమతా శంకర్ జంటగా ఈ చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసారు24వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ‘మృగయా’ ఉత్తమ చలనచిత్రం, మిథున్ చక్రవర్తికి ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. ఇది 1977లో జరిగిన 10వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్ ప్రైజ్‌’కి నామినేట్ కావడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది.

కధా నేపథ్యం:

సంథాల్‌లు అటవీ వనరులపై ఆధారపడి జీవించేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1832 లో ప్రస్తుత జార్ఖండ్‌లోని డామిన్-ఇ-కోహ్ ప్రాంతాన్ని గుర్తించి, ఈ ప్రాంతంలో స్థిరపడటానికి సంథాల్‌లను ఆహ్వానించింది. భూమి ఇస్తామని, ఆర్థిక సౌకర్యాలు కల్పిస్తామనీ కంపెనీ చేసిన వాగ్దానాల కారణంగా కటక్, దల్భుమ్, మంభుమ్, హజారీబాగ్, మిడ్నాపూర్ మొదలైన చోట్ల నుండి పెద్ద సంఖ్యలో సంథాల్ ఆదివాసీలు స్థిరపడటానికి వచ్చారు.

త్వరలోనే కంపెనీ తరపున పన్ను వసూలు చేసే మధ్యవర్తులుగా మహాజన్‌లు, జమీందార్లు వచ్చారు, ఆర్థిక వ్యవస్థపై వారు ఆధిపత్యం వహించారు. దాంతో చాలా మంది సంథాలులు అవినీతిమయ రుణ విధానాల బారినపడి వాటికి బలయ్యారు. వారు అన్యాయమైన వడ్డీ రేట్లకు అప్పులు తిసుకోవాల్సి వచ్చింది. అప్పులు తీర్చలేనప్పుడు, వారి భూములను బలవంతంగా లాక్కొని, వారిని కట్టు బానిసలుగా మార్చారు. ఇది తిరుగుబాటుకు దారి తీసింది.

బెంగాల్ ప్రెసిడెన్సీ లోని గిరిజన ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, స్థానిక జమీందార్లు, పోలీసులు, న్యాయ వ్యవస్థ నెలకొల్పిన న్యాయస్థానాలు ద్వారా జమీందారీ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థను, వడ్డీ పద్ధతులను అమలు చేస్తుండేవి. ఇది లోపభూయిష్టమైన రెవెన్యూ వ్యవస్థ అని ప్రచారం చేసి దీన్ని అంతం చేయడానికి ప్రతిచర్యగా ఇక్కడ సంథాల్ తిరుగుబాటు మొదలైంది. ఇది వలస పాలన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు.

ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం విడుదల అయిన సినిమా కధ మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడంలో ఔచిత్యం ఏముంటుంది గానీ, ఈ కధను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు మృణాల్ సేన్ ఒక సంథాల్ యువ జంట ద్వారా ప్రధాన పాత్రధారి మిథున్ చక్రవర్తి ద్వారా ఏమి చెప్పాలని అనుకున్నాడు, దరిమిలా దానినుంచి ఈ సమాజానికి ఏమి అర్ధమయింది? కాలక్రమంలో అది ఎలా విస్తరించింది అనేది ఇక్కడ ప్రధానం.

మనం కన్యాకుమారి వద్ద నిలబడి కాశ్మీర్ వైపు చూస్తూ, సెంట్రల్ ఇండియాకు కుడిపక్క తూర్పు వైపుకు చూస్తున్నప్పుడు, ఎంతకాలం నుంచి ఈ తూర్పుకనుమలు వార్తల్లో ఉన్నదీ ఒకసారి వెనక్కి వెళుతూ గుర్తుచేసుకుంటే; అది అలా... అలా... వెనక్కి క్రీ.పూ.నాటి ‘ల్యాండ్ మార్క్’ అయిన ‘కళింగ యుద్ధం’ వరకూ మనల్ని తీసుకువెళుతుంది. అక్కణ్ణించి అది చివరికి అలిమి కాక పాతికేళ్ళ క్రితం ‘యునియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ ఆ ప్రాంతాన్ని మూడు కొత్త రాష్ట్రాలుగా విడగొట్టింది, అనే వాస్తవం వద్దకు మనల్ని నడిపిస్తుంది.

జరిగింది ఇది, 1850లో జరిగిన ‘సంతాల్ తిరుగుబాటు’ నేపథ్యంలో రాసిన కధలో- అడవుల్లో వేటలో అసాధారణ నేర్పరి అయిన విలుకాడు మిథున్ చక్రవర్తి సినిమా చివరి సీన్లలో ‘రాజ్యం’ అల్లిన వ్యూహంలో అతడు చిక్కుకుని, జనరాణ్యం మధ్యకు తెచ్చిన బోనులోని- ‘బ్లాక్ పాంథర్’ మాదిరిగా కోర్టు బోనులో అతడు మనకు కనిపిస్తాడు. మొలకు తలకు తప్ప ఒంటిమీద బెత్తెడు గుడ్డ లేని పాతికేళ్ళ ఆదివాసీ యువకుణ్ణి, ‘రాజ్యం’ ఉరితీసి చంపబోతున్నది అనే విషయం అతడికి తెలిసాక, థియేటర్లలో మనం చూసే సీనది! కెమెరా ముందు తెరమీద మనకు నిజంగా ‘బ్లాక్ పాంథర్’ కళ్ళనే మిథున్ చక్రవర్తి తన కళ్ళతో మనకు చూపిస్తాడు! ఆ సీన్లో కోర్టు బోనులో ఒక మృగం కదిలికలు మనకు దర్శనమిస్తాయి.

చివరికి జరిగింది ఏమిటి? గడచిన యాభై ఏళ్ళలో మానవ హక్కుల ఉద్యమాలు మొదలు ఆయుధ పోరాటాలు వరకు మధ్యలో తలయెత్తిన అస్తిత్వ ఉద్యమాలను కూడా కలుపుకుని సాగిన ‘సరళీకరణ’ క్రమంలో; దేశంలోని కళా రూపాల్లోనూ వాటిని సృష్టించిన రచయితలు, దర్శకులు, సినిమా, డ్రామా, టెక్నీషియన్లలోనూ ‘మృగయా’ చిత్రం మిగిల్చిన ‘ఆదివాసీ’ పాదముద్రలు ఎప్పటికీ చెరిపివేయ లేనివి. విస్తరించిన మ్రాను జీవితకాలం కాలాన్ని, అందులోని కాలం సృష్టించిన వలయాలను బట్టి లెక్కకట్టే శాస్త్రాన్ని- 'డెoడ్రోక్రోనాలజీ' అంటారు.

జరిగింది ఏమిటి? పవనాలు ఎటునుంచి ఎటైనా అవి కదలవచ్చు కదా. అప్పటికే ఇక్కడ ‘దిగంబర కవిత్వం’, ‘తిరుగుబాటు కవిత్వం’ వంటి కవిత్వ కదలికలు ఒక ‘రూపం’ తీసుకోవడం కోసం అవి తమ ‘అండాన్ని’ వెతుక్కుంటున్నాయి. చివరికి 1970 నాటికి వాటి చిరునామా- ‘విప్లవ రచయితల సంఘం’ (‘విరసం’) అయింది.

ఇది జరిగిన మూడేళ్ళకు ‘మృగయా’ చిత్రం విడుదల అయితే, సరిగ్గా మూడంటే మూడు ఏళ్ళకే బి. నరసింగరావు పిలుపుతో బెంగాల్ నుంచి గౌతం ఘోష్ హైదరాబాద్ వచ్చి నల్గొండ గ్రామీణం నేపధ్యంగా 1979 నాటికి ‘మా భూమి’ తీసాడు. ఇలా... కొత్త గాలులు మనవైపు వచ్చిన దిశను ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడి సమాంతర సినిమాపై దాని ప్రభావంతో ఓంపురి, రేవతి జంటగా 1993లో ‘అంకురం’ తెలుగు సినిమా సి. ఉమామహేశ్వరరావు తీసారు.

అల్పపీడనం అన్నిసార్లు సముద్రాలు మీదే రానక్కరలేదు. అవి అడవులలోనూ కొండల మధ్య మైదానాల్లోనూ, లోయల్లోనూ ఎక్కడైనా రావొచ్చు. అయితే, తెలుగునాట మేధ, సృజన, రాష్ట్రం నలుమూల నుంచి 80-90 దశకంలో కేవలం విశాఖ, శ్రీకాకుళం వైపుకు ‘క్యూ’ కట్టడం వెనుక ఉన్న అయిస్కాంత శక్తి ఏమిటి?

సరే, హైదరాబాద్ ను కాసేపు పక్కన పెట్టండి, అనంతపురం నివాసి బాలగోపాల్ విశాఖపట్టణం ప్రాంతంలో మానవ హక్కుల కోసం పనిచేయడం ఎలా జరిగింది? తెలంగాణా నుంచి అల్లం రాజయ్య, సింగరేణి బొగ్గు గనుల నుంచి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, గోదావరి జిల్లాల వాసి ‘వివిన మూర్తి’ బెంగుళూరు నుంచి, శ్రీకాకుళం వెళ్లి కాళీపట్నం రామారావుతో ‘కధా నిలయం’ కేంద్రంగా ‘విరసం’ కోసం పనిచేయడం అంటే, ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఈ కాలపు అల్పపీడనం వాతావరణ ప్రభావమే.

‘మృగయా’ తో వెండితెరకు పరిచయమయిన మిథున్ చక్రవర్తి కొందరికి ‘డిస్కో డ్యాన్సర్’గా తెలిసివుండవచ్చు, ఒకప్పుడు ‘తృణమూల్ కాంగ్రెస్’ తోనూ, ఇప్పుడు బిజెపి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన మనకు తెలిస్తే తెలిసివుండవచ్చు. కారణాలు ఏమైతేనేమి, ఇప్పుడు ఆయనకు ‘ఫాల్కే’ అవార్డు అంటే, అది ఈ రాజకీయ వాతావరణంలో వీచిన ‘తూర్పు గాలి’ ప్రాభవం అనేది మాత్రం చారిత్రిక సత్యమవుతుంది.

Tags:    

Similar News