రచయిత్రి రజితకు కత్తి పద్మారావు నివాళి
ప్రముఖ హేతువాది, స్త్రీవాది, మానవతావాది, ప్రరవే ఉద్యమ కార్య నిర్వహకురాలు అనిశెట్టి రజిత అకాల మరణానికి ఘననివాళి.;
గొప్ప హేతువాది, మానవతా వాది, స్త్రీవాద విప్లవకారిణి, సొంత చెల్లెలు కంటే ఎక్కువ, ఆత్మీయురాలు నిరంతరం ప్రజాసేవకు అంకితమైన దీక్షాపరురాలు. జీవితాన్ని పూర్తిగా ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకు అంకితం చేసినటువంటి మహావ్యక్తి. ఇటీవల డా॥బి.ఆర్. అంబేడ్కర్ జీవితం తత్వశాస్త్రం మీద అనేక ఎపిసోడ్‌లు నడిపించిన కార్యశీలి. ప్రరవే అనే సంస్థను మహోన్నతంగా తీర్చిదిద్దిన త్యాగశీలి. గొప్ప కవయిత్రి ఎన్నో పుస్తకాలు నా చేత ఆవిష్కరింపజేసింది. ఎంతోకాలం మేమిద్దరం హేతువాద ఉద్యమంలో కలిసి పనిచేశాం.
ఒక త్యాగపూరితమైన మనిషి, ఆదర్శప్రాయురాలు ఆమె నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని అర్పించిన మహోన్నతురాలు. ఆంధ్రప్రదేశ్ హేతువాద ఉద్యమంలో ఆ తర్వాత మహిళా ఉద్యమంలోనూ అనేక ప్రజా ఉద్యమాలలో నిరంతరం చివరి శ్వాస వరకు అర్పించిన త్యాగశీలి. డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవితం తత్వశాస్త్రం అనే సిరీస్‌ను నాచేత ప్రారంభింపజేసిన ఆత్మీయురాలు. ఆమె రచనలన్నీ సంకలనాలుగా తీసుకురావాలి. ఆమె అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన భావాల్ని వ్యక్తపరిచింది.
కవిత్వం, నవల, వ్యాసం, పాట, తాత్విక గ్రంథాలు, స్త్రీవాద పోరాటం, సంకలనాలు అన్ని ప్రక్రియల్లో తీసుకువచ్చింది. ఆమె నిస్వార్థపరురాలు, నిజాయితీపరురాలు. 67 సం॥లు జీవించి ఉద్యోగస్తురాలుగా పనిచేసి కూడా ఏమి సంపాదించుకోలేదు. సంపాదనంతా ఉద్యమానికే ఖర్చుపెట్టింది. ఈ రోజున ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి మన కళ్ళముందు లేకపోవడం బాధాకరమైన విషయం. రాబోయే కాలంలో తెలంగాణ చరిత్రలో ఆమె ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడగలదని ఆశిస్తున్నాము.
ఆమె జీవితం సావిత్రిభాయి ఫూలేలా మహోన్నతమైందిగా భావిస్తున్నాము. అన్నగా నేనూ, మరియు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఘనమైన నివాళిని అందిస్తున్నాము. ఆమె మిత్రులకు, సహచరులకు, ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాము.