మొదటి బాలికా విద్య నిర్మాత సావిత్రిబాయి ఫూలే
బ్రిటన్, రష్యా, అమెరికాలలో బానిసత్వం 1833లోనే అంతమైంది. భారతదేశంలో మాత్రం కొనసాగుతూ వచ్చింది మతం ముసుగేసుకుని....;
-డాక్టర్ కత్తి పద్మారావు
సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో స్త్రీ విద్యా విప్లవాన్ని ప్రారంభించిన సాంస్కృతిక యోధురాలు. ఆమె మహోజ్వలమైన చరిత్ర భారతదేశంలో స్త్రీల సాధికారితకు బాటలు వేసింది. ఈనాడు స్త్రీలు విద్యలో సామాజిక సాంస్కృతిక సాంకేతిక రంగాల్లో అద్వితీయ పాత్ర వహించడానికి పునాది వేసింది సావిత్రిబాయి ఫూలే. ఆమె ఒక సాహసవంతురాలు చరిత్రను మలుపు తిప్పిన యోధురాలు. స్త్రీలకు విద్య కలిగితేనే వారు ప్రపంచ మానవులుగా ఎదుగుతారని గుర్తించిన సామాజిక శాస్త్రవేత్త. సావిత్రిబాయి ఫూలే వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య, జ్ఞానం, సంస్కరణ, విప్లవం, ప్రత్యామ్నాయం దాగి వున్నాయి. లింగ భేదాన్ని, కుల భేదాన్ని, భాషా భేదాన్ని, జాతి భేదాన్ని, వర్ణ భేదాన్ని నిరాకరించిన గొప్ప ప్రయోక్త. స్త్రీలను అన్ని వర్ణాల వారు అణగదొక్కుతున్నారు అని తెలుసుకొని బ్రాహ్మణవర్ణం నుండి అస్పృశ్యుల దాకా అన్ని తరగతుల స్త్రీలలో విద్యా దీపాలు వెలిగించిన మానవతా దీదితి ఆమె. ఆంగ్లేయుల పాలనలో కూడా బ్రాహ్మణవాదం, మూఢాచారాలు స్త్రీ అణచివేత బలంగా ఉన్నాయని గమనించిన ఒక విద్యమ్నుని ఆమె. సావిత్రిభాయి ఫూలేని ఒక ఉపాధ్యాయునిగా, ఉద్యమయోధురాలుగా తీర్చిదిద్దిన మహత్మాఫూలే ఎన్నదగిన కీర్తి గలవారు.
నిజానికి జ్యోతిరావ్ ఫూలే జీవితం, సావిత్రిబాయి ఫూలే జీవితం విడదీయరానివిగా సాగాయి. భారతదేశ చరిత్రలోనే భార్యాభర్తలు సామాజిక సేవలో ఇంత మమేకమై చేసినవారు లేరు. గాంధీకి తన భార్యకీ, నెహ్రూకీ తన భార్యకి ఇంకా జాతీయ నాయకుల కుటుంబాల్లో ఎన్నో కలహాలు వుండేవి. ఒకరి జీవితాలకు ఒకరికి పొంతన వుండిది కాదు. అయితే సావిత్రిబాయిపూలే తన భర్తలోని జ్యోతికి నూనె పోసి వెలిగించే దానిగానే కాకుండా తన క్రియాశీలకమైన కృషిలో భాగస్వామిగా వుండేది. వీరిద్దరు కలిసి రాత్రిస్కూలుని తమ ఇంట్లో నడిపించారు. ఈ విషయాన్ని గురించి ధనుంజయ్ కీర్ విశ్లేషణాత్మకంగా తన గ్రంథంలో చెప్పారు.
దళిత స్త్రీల విముక్తికి విద్య మూలహేతువని సావిత్రిబాయిపూలే అప్పుడే గుర్తించారు. వీరి మార్గంలోనే అంబేడ్కర్ విద్యను ప్రధాన నినాదంగాను, ఆయుధంగాను స్వీకరించాడు. నిజానికి బుద్ధుని దగ్గర బోధనను అందుకున్నది అంబేడ్కర్. సావిత్రిబాయి ఫూలే, మహాత్మాఫూలే దగ్గర నుండి విద్య అనే ఆయుధాన్ని స్వీకరించారు. 1830 వరకు శూద్ర స్త్రీలకు, దళితులకు విద్య అనేది ఊహించే పరిస్థితులలో భారతదేశం లేదు. ముఖ్యంగా అగ్రవర్ణ ఆధిపత్యానికి, హిందూ నియంతృత్వానికి, బ్రాహ్మణ సంస్కృతీ జటిలత్వానికి కంచుకోట అయిన మరాఠారాజ్యం స్త్రీలను అతి దారుణంగా అణిచింది. నలభైవేల మంది బ్రాహ్మణులకు షడ్రషోపేతాన్నాలు పెట్టి, మరాఠా పీష్వాలు శూద్రుల్ని, దళితుల్ని, స్త్రీలను అణిచివేశారు. ఆ పరిస్థితి నుండి వీరిని లేవనెత్తడానికి మొదట్లో నడుముకట్టిన భార్యాభర్తలు సావిత్రిబాయిపూలే, మహాత్మాఫూలే. నిజంగా సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే జీవనగాథ జేగీయమానమైనది. భార్యాభర్తలు కలిసి ఉంటే ఏమైనా సాధించవచ్చు అనే దానికి భారతదేశంలోనే వీరిద్దరు ఒక సజీవ సాక్ష్యం. మహత్మఫూలే మొదట సావిత్రిబాయి ఫూలే గురువు. సావిత్రిబాయి ఫూలే మొత్తం సమాజానికే గురువు అయింది. నిజానికి ఆమె వ్యక్తిత్వంలో ప్రేమ, అనునయం, నైతికత ఈనాటి మొత్తం సమాజానికి అవసరం. సావిత్రిబాయి ఫూలే గొప్ప నిర్మాత. ఎన్నో సంస్థలను, వ్యవస్థలను నిర్మించిన విద్యాదాత. నిజానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేది విడదీయలేని బంధం.
ఆనాడు భార్యను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావ్ వ్యక్తిత్వం అద్వితీయమైనది. ఆనాడు అనేక స్త్రీలపై అనేక ఆంక్షలు పెట్టారు. ఇది పూర్తిగా హేతువాదానికి వ్యతిరిక్తమైన విషయం. అందుకే జ్యోతిరావు ఫూలే తన భార్యని ఒక బానిసగా కాకుండా, ఒక వ్యక్తిత్వం వున్న ఉపాధ్యాయురాలిగా, నాయకురాలిగా తీర్చిదిద్దారు. సావిత్రిబాయిపూలే తన భర్త అనే జ్యోతికి ఒక నూనెలా వ్యవహరించింది. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగు లేదు అన్నంతగా మమేకం అయ్యింది. ఆమె సహచర్యం వల్ల మహాత్మాఫూలే ఆలోచనలు స్త్రీలవైపు మళ్ళాయి. మహాత్మాఫూలే అందరి స్త్రీలను శూద్రులుగానే భావించారు. ఆయన బ్రాహ్మణ స్త్రీలను వేరుచేయలేదు. బ్రాహ్మణు స్త్రీలు, బ్రాహ్మణ పురుషులచేత ఎలా అణగద్రొక్కబడుతున్నారో చాలా శాస్త్రీయమైన విశ్లేషణ చేశారు. వారిమీద బలవంతపు వైధవ్యాన్ని రుద్దుతున్నారని బి.ఎం. మలబారి సమర్పించిన నివేదికకు సమాధానంగా ఇలా చెప్పారు.
‘‘నేనిప్పుడు బ్రాహ్మణ స్త్రీల మీద మోపబడ్డ బలవంతపు వైధవ్యమనే సున్నితమైన వేదన కల్గించే అంశాన్ని స్పర్శిస్తాను. పక్షపాతంతో కూడిన ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ ఎటువంటి పట్టింపు లేకుండా తమ మగవాళ్ళకు ఎంతమంది ఆడవాళ్ళనైనా పెళ్ళి చేసుకునేందుకు అనుమతిస్తున్నది. ఇది మగవాళ్ళ దుష్ప్రవర్తనకు దారి తీసేందుకు వీలు కలిగిస్తున్నది. ఈ పురుషులు చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్న మొదటి భార్యమీద మోజు తీరిపోగానే, కొత్త రుచుల కోసం సానివాడల్లో దూరుతున్నారు. దీనితో సుఖవ్యాధుల పాలై తమ భార్యలనూ రోగాల పాలుచేస్తున్నారు. ఆ రుగ్మతల నుండి బయట పడేందుకు విపరీతంగా ఖరీదైన వైద్యం చేసుకోవాల్సి వస్తున్నది. రోగం వైద్యానికి లొంగనప్పుడు ఈ మగవాళ్ళు పిల్లలు పుడతారన్న నమ్మకం కోల్పోతున్నారు. ఈ దీనస్థితిలో తన భార్య రాత్రిళ్ళు బయటికి పోతేచాలు అనుమాన పిశాచిలా మారి ఆమె తప్పుడు నడతగలదై పోయిందని తీవ్రంగా శిక్షిస్తారు. ఇంటి నుంచివెళ్ళగొడతారు. వయసులో ఉన్నప్పుడు కామంతో కళ్ళు కప్పుకుపోయి దుర్మార్గంగా శీలరహితంగా ప్రవర్తించి ముదిమి మీద పడేసరికి తనకున్న చెడ్డపేరు తొలగించుకునేందుకు ఈ సిగ్గులేని వెధవలు ధర్మ ప్రవర్తకుల్లా మారిపోతారు. ఎటువంటి లజ్జ లేకుండా నాట్యగత్తెలకు డబ్బిచ్చి వారితో దేవాలయాల్లో రాతి విగ్రహాల ముందు పాటలు పాడించి నాట్యం చేయించి దైవ సేవ పేరిట తమ కోరికనూ తీర్చుకుంటారు.’’
సావిత్రిబాయి ఫూలే కూడా అనేక సంస్థల నిర్మాతగా ముందుకు నడిచింది. వీరిద్దరు కలసి 1842లో అన్ని వర్ణాల బాలికలకు విద్యాలయం ప్రారంభించారు. 1863లో సావిత్రిబాయిపూలే వితంతువుల రక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇదే కాలంలో వీరొక బ్రాహ్మణ విధవరాలి యొక్క కుమారుణ్ని దత్తత చేసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలకు భర్తచనిపోతే శిరోముండనం చేసే ఆచారాన్ని సావిత్రిబాయి పూలే వ్యతిరేకించింది. దీనికోసం మంగళ్ళలను సమీకరించి ఈ దురాచారానికి వ్యతిరేకంగా మేము కత్తి పట్టమని శపథం చేయించారు. బ్రాహ్మణ శూద్ర, అతిశూద్ర స్త్రీలందరిని విముక్తి చేయాలని సావిత్రిబాయిపూలే, జ్యోతిరావుఫూలే భావించారు.
నిజానికి సావిత్రిబాయి ఫూలే ఒక చరిత్రను నిర్మించింది. నూత్న సంస్కృతికి బాటలు వేసింది. స్త్రీ ఒక మౌఖిక విద్యా సంపన్నురాలు. ఆమెని లిఖిత సమాజంలోకి గాని తీసుకొస్తే ఆమె ప్రపంచాన్ని వెలిగించగలిగిన స్థాయికి వెలుతుందని సావిత్రిబాయి ఫూలే నమ్మింది. అందుకే ఆమె విద్యా వ్యవస్థ నిర్మాణానికి కృషి చేసింది. సావిత్రిబాయిఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఎన్నో బాధలు పడ్డారు. వారు సత్య శోధక్ సమాజ్ ద్వారా కూడా సమాజాన్ని పునరుజ్జీవించ చేశారు. దానికి గులాంగిరిలో వారి భావాలు మనకు ప్రస్ఫుటమవుతాయి. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో కూడా అధికార యంత్రాంగంలో ఎక్కువ బ్రాహ్మణులే ఉండేవారు. ఒక జాతిపరంగా అధికారులు, ఒక జాతిపరంగా పీడితులు ఉండటం అయనకు బాధ కలిగించింది. తరతరాలుగా ఉన్న జాతి వైషమ్యాలతోపాటు నిరుపేదలైన శూద్రులనూ అతిశూద్రులనూ పీడిరచే బ్రాహ్మణ పురోహితులు అధికారులు కావటం తప్పలేదు. న్యాయవాదులు, షావుకార్లు, ప్రభుత్వోద్యోగులు అంతా ఒకే వర్గానికి చెంది ఉండటం సాంఘిక ఆర్థిక సంక్షోభానికి దారి తీయక తప్పదని ఆయన అన్నాడు. ‘‘గులాంగిరీ’’ (స్లేవరీ, బానిసత్వం) అనే మాట మనుషులను అమ్మడం - కొనడం అనే అర్థంలోనే జోతిబా వాడారు. ఆ విధమైన బానిసత్వం బ్రిటిష్ సామ్రాజ్యంలో రష్యా అమెరికాలలో కూడా 1833లోనూ అంతమైంది. భారతదేశంలోని సమస్య అలాంటి సమస్య కాదు. ఇది మతం ముసుగులోని బానిసత్వం. శూద్రులు అతి శూద్రులు శతాబ్దాలుగా వంశపారంపర్యంగా బ్రాహ్మణుల బానిసలు. అస్పృశ్యల సంగతి ఇక చెప్పనవసరమే లేదు. వారికి మనుషులుగా గుర్తింపే లేదు. ఇక్కడిది అమ్మడం కొనడం అనే వ్యవహారంలేని బానిసత్వం. ఈ రచనకు అమెరికా సంయుక్త రాష్ట్రాల పోరాటం స్ఫూర్తినిచ్చిందని జోతిబా సమకాలికుల అభిప్రాయం.
బ్రాహ్మణులలోని చాలా శాఖలు ప్రాచీన కాలంనుంచీ వున్నవి కావనీ అనంతర కాలంలో పురాణాలు సృష్టించుకొని వాటికి ప్రాచీనతనూ గౌరవాన్నీ ఆపాదించారనీ జోతిబా అభియోగం. అప్పుడే కర్మకాండ కూడా అపారంగా మతంలోకి ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. బుద్ధుని కాలంలో ఒకే విధమైన ఆచార వ్యవహారాలు, వస్త్రధారణారీతులు కలిగి ఉన్న హిందూసమాజం అప్పుడే కులానుగుణంగా బాహ్యమైన మార్పులకు లోనయింది. ఉత్తర భారతదేశపు బ్రాహ్మణుల కట్టు, బొట్టు, ఆహార నియమాలు, ఆచారాలు అక్కడి క్షత్రియులతోనూ, శూద్రులతోనూ అంతగా భేదించలేదు. కానీ, దక్షిణాదిన మాత్రం బ్రాహ్మణులు ఇతర కులాల వారికి భిన్నంగా శాఖాహారులుగా మారారు. పశ్చిమ భారతదేశంలో బ్రాహ్మణులు అధికారం పదవులు సంపాదించి ఇతర కులాల నుంచి వేరయ్యారు. పౌరోహిత్యమూ అధికార పదవులూ మతపరంగానూ, సాంఘిక పరంగానూ, ఆర్థికంగానూ, బ్రాహ్మణులను సంఘంలో నిరంకుశులుగా చేశాయి. అది ఇతర కులాల వారికి కంటగింపైంది. జోతిబా జీవితం ఈ వ్యవస్థపైనే తిరుగుబాటు.. సావిత్రిబాయి ఫూలే విద్యా పోరాటం వెనుక ఒక తాత్విక దృక్పథం ఉంది. ఒక సంస్కృతిక విప్లవ పోరాట దృష్టి ఉంది. వారు బ్రాహ్మణుల ద్వేషాన్ని ప్రేమతో జయించారు. వారిది ఒక ప్రత్యామ్నాయ జీవన సంస్కృతి వికాస ఉద్యమశక్తి. వారిలో ఒక త్యాగ గుణం పట్టుదల నిరంతరాయంగా ఉంది. వారు దేనికి భయపడలేదు. ఎప్పుడూ వెనుదిరగలేదు. వారి పోరాటంలో ద్విగుణీకృత శక్తి ఉంది. మేము విజయం పొందగలము అనే ఒక పట్టుదలతో ఈ అభేద్యమైన పోరాటాన్ని కొనసాగించారు. వీరిలో బౌద్ధ, తాత్విక, సంస్కృతీ వికాసం ఉంది. మానవులందరు సమానం అనే భావన ఉంది. దమ్మపద జీవన గమనం ఉంది. మహత్మఫూలే, సావిత్రిబాయి ఫూలేలు గొప్ప అధ్యయనపరులు. గొప్ప రచయితలు కూడా. వారి రచనల్లో వారు బ్రాహ్మణవాదాన్ని తిప్పికొట్టారు.
ఈనాడు సావిత్రిబాయి ఫూలే జీవితం మనకు ఆదర్శం కావాలంటే దళిత ఉద్యోగులైన స్త్రీలు వందలకు వందలు వస్త్రాలకు ఖర్చుపెట్టడం మాని, పుస్తకాలు కొనాలి. ప్రతి ఇంట్లో ఒక గృహ గ్రంథాలయాన్ని రూపొందించుకోవాలి. ఇండ్లలో పుస్తకాలు లేనట్లైతే మస్తకాలు బూజుపడతాయి. ఇండ్లను చిన్న చిన్న ఆశ్రమాలుగా రూపొందించుకోవాల్సిన అవసరం వుంది. ఉద్యమకారులైన భర్తలను వేధించకుండా వారికి సహకారాన్ని అందించడంలో సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి. సావిత్రిబాయి ఫూలే ఒక సజీవమైన జీవన స్రవంతి. మానవతా పరిమళాన్ని వెదజల్లిన కార్యకర్త. ఆమె కరుణ శీలి. భర్తని కాపాడటంలో వీరమాత. భారతదేశంలో ఇంత వ్యక్తిత్వం కలిగిన స్త్రీ మరొకరు లేరు అనడంలో అత్యుక్తి లేదు. తన భర్త మహాత్ముడిగా వెలుగొందడానికి ఆమె కారణమైంది. ‘మహాత్మా’ అనే బిరుదుని ఫూలే నుండి గాంధీ తస్కరించి ప్రచారం చేసుకున్నారు. నిజానికి మహాత్మాఫూలే సావిత్రిబాయి పూలే లేకుండ లేరు. ఆమె ఆయన జీవితానికి ఊపిరి. ఆమె నడక గంభీరమైంది. పిరికితనాన్ని పారద్రోలింది. తన భర్తను తనను చంపడానికి వచ్చిన వారిని ఎదిరించింది. స్త్రీలకు విద్యను అందించడానికి ఆమె టీచరుగా మారడమే గాక భారతదేశంలో వున్న టీచర్లకు ఆమె మార్గదర్శకమైంది. ఆమెను చూసే చాలా మంది టీచర్లు కాండక్టు నిర్ణయించుకున్నారు. ఆమె కార్యశీలి. ఆమె వాచకం మృదువైంది. ఆమె పలుకులు సూత్రబద్ధమైనవి. ఆమె కోరికల్ని నిరాకరించింది. ఆమె పరిసరాల్ని సేవామయం చేసింది. ఆడంబరాల్ని తృణీకరించింది. భర్తకు దారిచూపించే కాగడాగా వెలిగింది. ఈనాడు దళిత ఉద్యోగినులు సావిత్రిబాయి పూలే దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నిరాడంబరమైన వస్త్రధారణ, చేతిలో పుస్తకం, ముఖంలో నవ్వు, ఆమె వ్యక్తిత్వం. ఇప్పటి స్త్రీలు ఆందోళనతో కనిపిస్తున్నారు. అప్పులలో మునిగిపోయి వుంటున్నారు. కోరికలు వారిని ముసురుతున్నాయి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని మన దళిత స్త్రీలు నూత్న ఉత్తేజాన్ని పొందవలసిన చారిత్రక సందర్భం ఇది.
ఆమె మార్గదర్శి, ఆమె నాయకురాలు, ఆమె ఉపాధ్యాయిని, ఆమె బోధకురాలు, సంస్థల నిర్మాత, ఆమె వెన్నెల, ఆమె వెలుగు, సూర్యచంద్రుల్ని మమేకం చేసిన క్రాంతిగోళం. ఆమె మార్గంలో నడుద్దాం.........ఊ
(డాక్టర్ కత్తి పద్మారావు, లుంబిని వనం, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, అంబేద్కర్ కాలనీ,
పొన్నూరు పోస్ట్, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)