మూర్తీభవించిన మానవత్వం కామ్రేడ్‌ సీతారాం ఏచూరి

మా అమ్మ చనిపోయాక ఓ మారుమూల గ్రామానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ నేత ఒక చిన్న కార్యకర్త ఇంటికి రావడం కార్యకర్తల పట్ల ఆయనకున్న అభిమానం చూపుతుంది

By :  Admin
Update: 2024-09-13 05:53 GMT

-కొండూరి వీరయ్య

కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మన మధ్య లేరు. కానీ ఆయనతో గడిపిన సమయం, జరిపిన చర్చలు, ఆయన నేర్పిన పాఠాలు, అందించిన గుణపాఠాలు, చేసిన త్యాగాలు, మిగిల్చిన జ్ఞాపకాలే మనతో ఉన్నాయి. దేశ రాజకీయ యవనికలో అవసరమైన మార్పులు జరుగుతున్న తరుణంలో ఆ మార్పులను ఓ దారిలో గాడిలో పెట్టగలిగిన సామర్ధ్యం ఉన్న ఏకైక నాయకుడు ఏచూరి. ఆయనది అకాల మరణం. మనల్ని వీడి వెళ్లిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేని తరుణం. అందుకే దాదాపు మూడు వారాలు మృత్యువుతో పోరాడారు. చివరి నిమిషం వరకూ మృత్వువుపై పై చేయి సాధించటానికి ప్రయత్నించారు. నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట నిర్ధారణ, ఆ నిర్ధారణకు అనుగుణంగా నిర్దిష్ట నిర్ణయం చేయాలన్నది మౌలిక గతితార్కిక మార్క్సిస్టు సూత్రం. దేశ విదేశాల పరిణామాలను పామరులకు సైతం అర్థం చేయించటంలో ఈ సూత్రాన్ని పాటించిన సీతారాం తన ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని పాటించలేకపోయారు. ఆయనకు రేయింబవళ్లు శ్రమించి చికిత్స అందించిన వైద్యుల మాటల్లో ఆయన ఆర్నెల్ల క్రితమే ఆసుపత్రికి వచ్చి ఉండాల్సింది. కనీసం లండన్‌ పర్యటనలో స్వయిన్‌ ఫ్లూ అటాక్‌ అయిన తర్వాతనైనా ఆసుపత్రికి వచ్చి ఉండాల్సింది. సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోవటం చివరకు ప్రాణాంతకంగా మారింది. దాదాపు పదేళ్లు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా, పదికిపైగా ఆయన పుస్తకాలను కూర్చినవాడిగా, ఆయనతో ఉన్న ఇరవయ్యేళ్ల అనుబంధంతో కొన్ని జ్ఞాపకాలు మీ దృష్టికి తేవడానికి చేసిన ప్రయత్నమే ఈ వ్యాసం.

ఆయనతో నా పరిచయం 1998లో మొదలైంది. అప్పట్లో గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి గా నూతలపాటి కాళిదాసు ఉండేవారు. విజయవాడ లో సాంస్కృతిక రంగంలో కమ్యూనిస్టుల పని విధానం గురించిన శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అందులో నన్ను కూడా ఓ విద్యార్థిగా ఎంపిక చేయటంలో కాళిదాసు పాత్ర ఉంది. ఆ విధంగా తొలిసారి ముఖా ముఖి కలసాను సీతారాం ను. తర్వాత ఢిల్లీ ప్రజాశక్తి విలేకరిగా పని చేసే క్రమంలో ఆయనతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. 2002 లో గుజరాత్ నరమేధం లో చిటికిన బతుకులను పరామర్శించడానికి పర్యటించిన సీపీఎం బృందానికి ఆయన నాయకుడు. అప్పటికే ప్రజాశక్తి విలేకరిగా ఆ నరమేధం ప్రభావిత ప్రాంతాల్లో నేను కథనాల సేకరణకు వెళ్ళాను. అక్కడ ఆయా కుంటునాలను ఆయన పరామర్శించిన తీరు వారికి ఓదార్పు తో పాటు ధైర్యాన్ని చెప్పిన తీరు చూస్తే మానవతా కోణంతో పని చేసే ఓ నైపుణ్యం కలిగిన స్వచ్ఛంద సంస్థ నాయకుడు కనిపిస్తాడు. ఆ పర్యటన తర్వాత తిరిగి వచ్చాక గురజాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నరమేధం ప్రభావంతో ఏమైనా మార్పులు వస్తాయా అని అడిగితే ప్రజాస్వామ్యానికి డబుల్ డామేజీ జరుగుతుందని మరింత భయంతో ముస్లింలు తమ స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని వదులుకుంటారనీ విశ్లేషించారు. ఆయన అంచనా రుజువు అయ్యింది. రెట్టించిన బలంతో మోడీ తిరిగి అధికారానికి వచ్చారు. కార్యాకరణ సంబంధం వరకే పరిమితం కాకుండా దాన్ని కూడా గతితార్కిక పద్ధతిలో చూస్తే తప్ప అటువంటి విలక్షణ అంచనాలకు రాలేము. రష్యా విప్లవ కాలంలో లెనిన్ అటువంటి విలక్షణ అంచనాలకు వచ్చేవాడు.

ఆ తర్వాత సీతారాం కోరిక మేరకు నేను ఆయనకు పార్లమెంటరీ కార్యదర్శిగా వచ్చాను. అప్పటి నుండి నాకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని అనుభవాలు ప్రస్తావిస్తాను.

అప్పట్లో ఆయన రాజ్యసభ సభ్యులు. నేను ఆయనకు ప్రైవేటు కార్యదర్శిని. ఒకరోజు పార్లమెంట్‌ కారిదార్‌లో ఇద్దరమూ వెళ్తున్నాము. ప్రతిపక్ష నేత కార్యాలయం నుండి అద్వానీ ఆయనతో పాటు హర్యానా కు చెందిన బిజెపి నాయకులూ వస్తున్నారు. ఇద్దరూ దగ్గరకు వచ్చాక అద్వానీ చేయి చాచి ‘నువ్వు పార్లమెంట్‌కు ఆలస్యంగా వచ్చావు’ అన్నారు నవ్వుతూ... ఏచూరి గడియారం వంక చూసుకుని ‘లేదే... టైం కే వచ్చా కదా’ అన్నారు. దానికి సమాధానంగా అద్వానీ ‘ఈ వయస్సు లో కాదు. ఇంకా పదేళ్ల ముందే నువ్వు పార్లమెంట్‌కు వచ్చి ఉండాల్సింది పార్లమెంట్‌లో చర్చల నాణ్యత మరింతగా పెరిగేది. నువ్వు చేసే ప్రతి ఉపన్యాసమూ పూర్తిగా వింటాను’ అన్నారు. సైద్ధాంతికంగా పూర్తి విరుద్ధమైన శిబిరానికి చెందిన వారు కూడా సీతారాం ని అభిమానించేలా వ్యవహరించటం సీతారాం విషిష్టత.

మరో సందర్భం. నేను ప్రజాశక్తి విలేకరిగా పని చేస్తూనే ఢల్లీిలోని సాహితీ సంస్థలు, తెలుగు సాహితీ సంస్థలుతో పరిచయాలు ఏర్పర్చుకున్నాను. నేను, నీలి అర్జున్‌ (ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌), సూర్వదేవర ప్రసన్నకుమార్‌ (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శి) చంద్రశేఖర్‌ (ఆలిండియా రేడియో ఉద్యోగి) వంటి మరికొందరు మిత్రులతో కలిసి సాహితీ పేరుతో ఓ సంస్థ కూడా ప్రారంభించాము. ఢల్లీిల్లో నాలుగైదేళ్ల పాటు నిర్వహించిన సాహితీ కార్యక్రమాలు అప్పటి వరకూ ఢల్లీి తెలుగు ప్రజలు కనివినీ ఎరుగని రీతిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ధియేటర్‌లో ఆదివారంహిట్‌ సినిమా ఆడుతున్నా మేము నిర్వహించే సభ కిక్కిరిసి ఉండేది. అటువంటి సభల్లో ఒకటి విలక్షణమైన సభ. పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రను తొలిసారి హిందీలో యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఏచూరితో పాటు కేంద్ర మంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి, బిజెపి అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న వెంకయ్యనాయుడులను పిలిచాము. ఆ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘పేరుకేమో సీతారాం. ఆయనేమో అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారు. ఇదెక్కడి గొడవో తెలీదు. అయినా తాను ఎన్నుకున్న మార్గంలో ఎన్నుకున్న పద్ధతుల్లో ఆయన కూడా సమాజ మార్పు కోసం పని చేస్తున్నారు. అందుకే ఆయన్ను మా సైద్ధాంతిక విభేదాలు మర్చి గౌరవిస్తాము’ అన్నారు.

మరో సందర్భంలో శివశంకర్‌ మీనన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న రోజులవి. ఓవైపు బ్రిక్స్‌ (భారత్‌, చైనా, బ్రెజిల్‌, రష్యా కూటమి) గురించి ప్రాధమిక అవగాహన చర్చలు జరుగుతున్న రోజులు. ఆ సందర్భంలోనే వర్ధమాన దేశాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలను బాగు చేసుకోవటం కోసం ప్రపంచబ్యాంకు వంటి వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా మరేదైనా ప్రత్యామ్నాయం చూడాలని ఏచూరి శివశంకర్‌ మీనన్‌ ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత బహుశా రెండేళ్లకే ప్రపంచమంతా సబ్‌ ప్రైమ్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్లమెంట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం డికప్లింగ్‌ సిద్ధాంతం ప్రతిపాదించారు. అంటే సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం ప్రభావం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశంపైనే పరిమితంగా ఉంది. దానికి కారణం భారతదేశ ద్రవ్య విధానం అంతర్జాతీయ ద్రవ్య విధానంతో మరీ అంతగా పెనవేసుకోలేదు కాబట్టి మనం సంక్షోభం ప్రభావం నుండి తేలిగ్గానే బయట పడ్డామన్నది చిదంబరం వాదన. దానికి స్పందనగా పార్లమెంట్‌లో సీతారాం ఏచూరి ‘ప్రపంచీకరణ పేరుతో గుండుగుత్తగా ద్రవ్య పెట్టుబడి రూపొందించే అన్ని విధానాలూ నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేదని, చైనా నుండి నేర్చుకోవాలనీ వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఎం హెచ్చరిస్తోంది అందుకే కదా...’ అన్నారు నవ్వుతూ. ఇటువంటి ఎన్నో విషయాల్లో సందర్భోచితంగా జోక్యం చేసుకుంటూ అటు పార్టీ వైఖరికి తన విద్వత్తును జోడిరచి పార్లమెంట్‌లో రాటు దేలిన ఉపన్యాసకునిగా వెలిగారు ఏచూరి.

యుపిఎ 1 కాలంలో కాంగ్రెస్‌ నుండి ప్రణబ్‌ ముఖర్జీ, సిపిఎం, వామపక్షాల నుండి సీతారాం ఏచూరి కీలకమైన సంధికర్తలు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించటం మొదలు, అణు ఇంధన ఒప్పందం, ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ వరకూ వామపక్షాలు తమదైన డిమాండ్లను రూపొందించి కనీసం కొన్నిటిని అయినా ప్రభుత్వం చేత ఒప్పించటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సీతారాం. ప్రధానంగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నవరత్న హోదా ఇప్పించి దాన్ని అదానీ కంపెనీ చేజిక్చించుకోకుండా అడ్డుకున్న గొప్ప కార్మిక నేత సీతారాం. అంతేకాదు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని అడ్డుకోవటంలోనూ, బిహెచ్‌పివి ని అమ్ముకోకుండా అడ్డుపడి బిహెచ్‌ఇఎల్‌లో విలీనం చేయటం ద్వారా కార్మికుల జీవనోపాధి పాటు వందల ఎకరాల భూములు రియల్‌ ఎస్టేట్‌ మాఫియా చెరబట్టకుండా అడ్డుకున్నారు సీతారాం. ఆ విలీన సభకు ప్రణబ్‌ ముఖర్జీతో పాటు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.

సిపిఎం కార్యక్రమం ఆర్థిక తరగతుల ప్రాతిపదిన పీడిత వర్గాల ఐక్యతకు వ్యూహరచ చేస్తే దాన్ని మరింత విస్తరించి సామాజిక సాంస్కృతిక రాజకీయ రంగాల్లో ఐక్య సంఘటన నిర్మాణాలకి కూడా ఈ వ్యూహాన్ని విస్తరించిన ఘనత సీతారాంది. దేశ రాజ్యాంగ విలువల్లో లౌకికతత్వం ముఖ్యమైనది. దాన్ని కాపాడటం కోసం రాజకీయ పోరాటాలతో పాటు మేధో రంగంలో కూడా పోరాటం అవసరం. అటువంటి మేధో రంగంలో పోరాటానికి కావల్సిన ముడిసరుకును అందించేది చరిత్ర. చరిత్ర రచన. ఈ చరిత్ర రచన రాజకీయ అవసరాలకనుగుణంగా భ్రష్టుపట్టకుండా చూసే పోరాటంలో ఆర్‌ ఎస్‌ శర్మ, రొమిల్లా థాపర్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, అర్జున్‌ దేవ్‌ వంటి ఘనాపాఠీలతో సమాలోచనలు చేసిన మేధో రంగంలో ఓ ఐక్య అవగాహనకు పునాదులు వేయటంలో తనదైన పాత్ర పోషించిన వ్యక్తి ఆయన.

భారత దేశపు రాజకీయాలను మార్చాలంటే విముక్తి రాజకీయాలు విజయం సాధించాలంటే కుల సమస్యను పరిష్కరించకుండా సాధ్యం కాదని గుర్తించిన అతి కొద్దిమంది మార్క్సిస్టు నాయకుల్లో సీతారాం ఒకరు. తనదైన విశిష్ట అధ్యయనం ద్వారా కుల సమస్య పట్ల రాజకీయ రంగంలో మార్క్సిస్టు దృక్ఫధంలో జోక్యం ఎలా చేసుకోవాలన్న ప్రాధమిక అవగాహనను రూపొందించింది సీతారాం. ఆ అవగాహనను 1995లో చండీగఢ్‌లో జరిగిన పార్టీ మహాసభ ఆమోదించింది. దాని పర్యవసానంగానే దేశశ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట వేదికలు ఏర్పాటు జరిగింది. ఎక్కడికక్కడ స్థానికంగా పని చేస్తున్న ఈ వేదికలు చివరకు దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ గా పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు ప్రకాష్‌ అంబేద్కర్‌ మొదలు ఇటు ఆనంద్‌ తేల్తుంబ్డే వరకూ ఎంతో మంది మేధావులను ఒక వేదిక మీదికి తెచ్చి వారు కలిసివచ్చినంత వరకూ కలుపుకుని పని చేసేలా సరళ కార్యాచరణ రూపొందించటంలో ఏచూరి అందించిన తోడ్పాటును విముక్తి పోరాటాల చరిత్ర గుర్తిస్తుంది.

ఢల్లీిలో జర్నలిస్టుగా పని చేసిన అనుభవంతో వివిధ రాజకీయ దృక్కోణాలున్న పత్రికలు చదవటం, ఎవరు ఎందుకు ఏమి రాస్తున్నారో, రాయల్సివారు ఎందుకు రాయటం లేదో అర్థం చేసుకోవటం వృత్తిలో భాగమైంది. ఆ క్రమంలో హిందీ పత్రికల్లో 2001 `2004 మధ్య కాలంలో బిజెపి వ్యతిరేక సంఘటన నిర్మాణాననికి కృషి చేస్తున్న హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గురించి పత్రికా మర్యాద మరిచి మరీ రాసిన వ్యాఖ్యలు చూశాను. ఆయా పత్రికా యాజమాన్యపు రాజకీయ లక్ష్యాలు ఆశించిన ఆశ్రిత ప్రయోజనాలకు అనుగుణంగా ఈ రాతలుండేవి. ఈ క్రమంలో మతోన్మాద వ్యతిరేక కూటమి నిర్మాణంలో సూర్జిత్‌ లాంటి నాయకుడి అవసరం ఉందన్న చర్చలు అడపాదడపా అభిప్రాయా సారూప్యత కలిగిన విలేకరుల మధ్య జరిగేవి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని 2014 తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి కర్తవ్యం ఒకటి ఉంది కదా అన్న చర్చ నడిపాను. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాధానం రాజకీయాల పట్ల ఆయనకున్న సునిశిత పరిశీలన సామర్ధ్యం, లక్ష్య సాధనతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎత్తుగడల్లో బిగువు లఘువు ఉండాలన్న సూత్రాన్ని ఆయన ఆకళింపు చేసుకున్న తీరు అబ్బురపరుస్తుంది. 2019 తర్వాత అటువంటి కూటమి ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలే నేడు చివరకు మనకు ఇండియా బ్లాక్‌ రూపంలో కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మోడీ యాగాశ్వాన్ని నిలువరించటంలో రాహుల్‌ గాంధీ, సీతారాం లు లవకుశుల పాత్ర పోషించిన సంగతి ఇప్పుడు చరిత్ర.

భారతదేశంలో వామపక్ష రాజకీయలకు ప్రాసంగికత ఉందా అన్న అంశంపై స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో అద్భుతమైన ప్రసంగం చేసి ఆ సమావేశానికి హాజరైన మేధావులు భారతదేశం భారతదేశంగా మిగలాలంటే బలమైన వామపక్ష ఉద్యమం అవసరం అని అంగీకరించేలా ప్రభావితం చేసిన మేధావి సీతారాం. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏ వేదిక మీద ప్రసంగించినా ఓ కొత్త పరిచయం ఏర్పర్చుకుంటారు. ఆ పరిచయం జీవితాంతం కొనసాగిస్తారు. అంతటి స్నేహశీలి.

సంకీర్ణ రాజకీయాల లోతుపాతులు అవగాహన లేని తరం నాయకత్వంలోకి వస్తున్న తరుణం ఇది. సంకీర్ణ రాజకీయాలు మౌలికలక్ష్యాన్ని సాధించే క్రమంలో మజిలీలే తప్ప అంతిమ మజిలీ కాదన్న మౌలిక సూత్రాన్ని గుర్తించి తదనగుణంగా ఎక్కడ మజిలీ అవసరమో అక్కడ ఆగితేనే మరో ప్రయాణానికి గట్టిపునాదులు పడతాయి. అటువంటిదే 1996 యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికైన ప్రభుత్వాలకు దూరమైన జమ్ము కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ క్రమానికి ఊపిరిలూదింది యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం. చివరకు ఈ ప్రజాస్వామిక ప్రస్థానాన్ని బిజెపి కూడా ఎక్కువకాలం అడ్డుకోలేకపోయింది. సూర్జిత్‌తో కలిసి ఈ వ్యూహాన్ని తెరమీదకు తేవటంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ దురంధరుడు సీతారాం.

ఆయనతో పని చేయటం అంటే రోజూ ఓ రాజకీయ పాఠం నేర్చుకోవటడమే. ఈ క్రమంలో నేర్చుకోవడానికి సదా సిద్ధపడే నిరంతర విద్యార్థి సీతారాం. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో ఆయనతో తీవ్రంగా ఘర్షణపడే అవకాశాలు వచ్చాయి. ఆయనతో ప్రతి ఘర్షణా మరో మేధా వికాసానికి పునాదులు వేసిన ఘర్షణే. ఈ విధంగా సీతారాంతో నా రెండు దశాబ్దాల పరిచయం నాయకుడు కార్యకర్త సంబంధం నుండి వయసుతో నిమిత్తం లేకుండా స్నేహితులుగా అన్ని విషయాలు లోతుగా చర్చించుకునే స్థాయికి చేరింది.

ఎన్నేళ్లు ఎన్న నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు జీవించామన్నది కాదు ముఖ్యం. మనం బతికి ప్రతి క్షణంలోనూ ఎంత జీవితం ఉన్నదన్నది ముఖ్యం అని పదేపదే గుర్తు చేసే సీతారాం 72 ఏళ్లల్లో ప్రతి క్షణంలోనూ జీవితాన్ని నింపిన మానవత నిండిన మార్క్సిస్టు సీతారాం.

(కొండూరి వీరయ్య, న్యాయవాది, హైదరాబాద్)

Tags:    

Similar News