కాకతీయ తోరణం,చార్మినార్ తీసేయాలనుకోవడం ప్రజాస్వామ్య అవలక్షణం

ప్రభుత్వం చిహ్నం నుంచి కాకతీయ, గోలుకొండ రాజుల ఆనవాళ్లు తీసేయాలనుకుకోవడం రాజకీయ నేరం అంటున్నారు న్యాయనిపుణుడు ప్రొఫెసర మాడభూషి శ్రీధర్

By :  Admin
Update: 2024-06-02 07:22 GMT

- ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్


తెలంగాణ సాధించిన తరువాత పదేళ్లు పనికి వచ్చిన కాకతీయ ద్వారం, చార్మినార్ ఎందుకు ఇప్పుడు పనికి రాకుండా పోతున్నాయి? రబీంద్ర నాథ్ టాగూర్ ఎపుడో రాసిన ‘జన గణ మన’ జాతీయ గీతం ప్రభుత్వం  మారిందా? రాజ్యాంగం  మొత్తం మార్చేద్దాం అనుకుంటున్న బిజెపి కూడా ఇన్నాళ్లూ ఈ గేయం తీసేయలేదే. ఇపుడు తెలంగాణలో ఉన్నట్లుండి ప్రభుత్వం చిహ్నంలో రాచరిక చిహ్నాలు అంటూ కాకతీయ తోరణం, చార్ మినార్ లను తొలగించాలనుకోవడం ఎమిటి?  ఎందుకీ పని?  ఉర్దూలో తెలంగాణ ప్రభుత్వం అని రాసినందుకు సంతోషం. 
రాచరిక చిహ్నం అనే పేరుతో కాకతీయ ద్వారం తీసివేయడం ఎందుకు? కారణం ఏమిటి? పదేళ్లు నిలబెట్టుకున్న కాకతీయ ద్వారం, చార్మినార్ ఏం పాపం చేశాయి?   అవి రాచరిక ‘తెలంగాణ’ చిహ్నాలు,  విసర్జీనయం అయితే  కాకతీయ ద్వారంతో పాటు  చాలా తొలగించాల్సినవి రాష్ట్రంలో చాలా ఉన్నాయి.  తెలంగాణకు గర్వకారణమైన ఈ మహా చిహ్నాలను వద్దనుకోవడానికి ఒక్క కారణమైనా, సమంజమైన హేతువు ఏదైనా ఉందా?
 ఈ నిర్ణయం కేవలం రాజకీయ కారణం కాకమమిటి? ఎన్నికల్లో కేవలం గెలిచినందుకు చిహ్నాలు మర్చాల్నా? ఆ కారణం పేరుతో కాకతీయ, చార్మినార్ తొలగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. కారణం లేకుండా పాలకులు చేసిన నిర్ణయాలేవీ నిలబడవు. అవి మొత్తం తెలంగాణకు నష్టం కలిగిస్తాయి. కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా  అది స్పష్టమైన తొందరబాటయిన  నిర్ణయం . ఒక ప్రభుత్వం ఏక పక్షంగా ఎవ్వరినీ అడగకుండా, ప్రకటన చేయడం ఏమాత్రం ప్రజాస్వామిక లక్షణం కాదు. అవలక్షణం.
ప్రపంచ మంతా కీర్తించిన రామప్ప దేవాలయం, కతీయ వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, విరిగిపోయి నిలబడి  ఉన్నా, విధ్వంసమైనా, ఆ అందమైన శిల్పాలు చారిత్రక చిహ్నాలు.  కాకతీయ ద్వారం సమగ్రంగా ఉంది.   పదేళ్లనుంచి రాష్ట్రానికి ప్రతీకలుగా ఉన్న శిల్పాల, సంస్కృతి, నాగరిక లక్షణాలను ఇపుడు పీకి పారేయడం ఒక కీలకమైన చరిత్రకు, అన్యాయం చేయడమే.
రాచరికం దశలో కూడా పోరాటాలున్నాయి.  బమ్మెర పోతన రాచరిక దుర్మార్గలకు వ్యతిరేకంగా పోరాడినారు. భాగవత గ్రంధాన్ని రాజుకు అంకితం చేయడం అంటే అమ్ముకోవడమే అని అన్నారు.  రాచరికం  అరాచకం అని కొత్తగా అనేవారు చూపిస్తున్న  ‘రాజముద్ర’లో రాచరిక ముద్రలేదా?  ఈ ప్రజాముద్ర తెలంగాణ వ్యక్తిత్వానికి సంబంధించిన కీలకమైన విషయం. కేవలం కొందరునాయకులకు ఇష్టం లేకపోతే  , చాలామందికి ఇష్టున్నాసరే మారుస్తారా. 
ఇది తెలంగాణ సెంటిమెంట్ వాదన కాదు. ఎపుడైనా కాంగ్రెస్ పార్టీ ఈ చిహ్నం పనికిరాదని   అనుకున్నదా? ఇదివరకు ఏమైనా ప్రత్యేక విమర్శలు చేసిందా, అందుకు వివరణలు వచ్చాయా? తెలంగాణకు గర్వకారణమైన కాకతీయ చిహ్నం వద్దనడానికి శాసనసభలో కాంగ్రెస్ వారు విమర్శించారా? ప్రభుత్వానికి, గవర్నర్ కు, ప్రధానమంత్రికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా కాలంలో కాంగ్రెస్ ఎప్పుడైనా ఈ విషయం విన్నవించిందా? అలాంటి వద్దని బంద్ చేసిందా? రోడ్ రోకో, రైలో రోకో బస్సుల రోకో ఏదైనా చేసారా?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను సాధించలేదనడం లేదు. సాధించింది కాంగ్రెస్, ముఖ్యంగా సోనియాగాంధీ. ఈ చిహ్నాలు రాచరికం, పనికిరావని అనేందుకు అది మాత్రమే చాలదు.
తెలంగాణ లోని లక్షలాది మంది కాంగ్రెస్ అభిమానులు కూడా తెలంగాణకోసం పోరాడితే, ఆంధ్రా కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం నడిపే కాంగ్రెస్ చాలా కాలం వ్యతిరేకించాయి. కేంద్రం తెలంగాణ వస్తుందని ప్రకటించినా తరువాత కూడా ఆంధ్రా కాంగ్రెస్, తెలుగుదేశం వంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించాయి.  వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత తెలంగాణ జనం సాధించుకున్నారు. ప్రొఫెసర్లు జయశంకర్, కోదండరాం గార్ల చర్చ లేకుండా తెలంగాణ స్థాపన చరిత్ర వస్తుందా? తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని కూడా అనవచ్చు తప్పులేదు. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడ్దాయి. ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించింది.  భారత రాష్ట్ర సమితి అధినేత  కె సి ఆర్ ఓటమి పాలయ్యారు.  అంతమాత్రాన  తెలంగాణ వారు గర్వపడుతున్న   కాకతీయ, చార్మినార్ లను ప్రజా వ్యతిరేక సంస్కృతి చిహ్నాలంటారా
కనీసం గెలిచిన తరువాత శాసనసభ లో కాంగ్రెస్ ఈ చిహ్నాలను విమర్శించలేదు. పోనీ గతంలో  కాంగ్రెస్ ఇలా శాసనసభలో చేసిన తీర్మానాలు ఉన్నాయా? హటాత్తుగా ఆలోచనే లేకుండా, తొందరపాటుతో నిర్ణయిస్తారా? పోనీ  కాకతీయ, గోల్కొండ రాజుల రాచరిక దుర్మార్గాలను  కాంగ్రెస్ పార్టీ లోగాని, ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో చర్చించారా?  ఈ ఎజెండాతో సదస్సులు నిర్వహించారా?  వ్యక్తిగత  ద్వేషాలు, వ్యతిరేకతలు, కోపాలు తాపాలతో నిర్ణయాలు తీసుకుంటారా.  ధర్మం, పద్ధతి ఏమీ లేదా? సంప్రదింపులు ఉండనవసరం లేదా?
 ఇలాంటి నిర్ణయాలు తీసుకుని  అనవసరంగా ఉద్యమాలకు బాట వేసి, అల్లరి చేసి, మామూలు  పౌరులకు ఇబ్బంది చేయడం సరికాదు.
‘‘జయజయ తెలంగాణ’’ అనే పాట అద్భుతం.  రచయిత అందెశ్రీ చాలా గొప్పవాడు. అందులో చిహ్నాల ప్రస్తావన మార్చడంలో ఆ రచయిత పా త్ర ఏమిటి?. ఇది సంగీత జ్జానానికి సంబంధించిన విషయం కాదు.  ప్రసిద్ద సంగీత దర్శకుడికి కూడా దానితో సంబంధం లేదు. గతంలో ఉన్న ‘కాకతీయ వైభవం గోలుకొండ గొప్పదనం, చార్మినార్ కీర్తన’ చరణాలకు తొలగించడాన్ని  కనీసం వ్యతిరేకించి నిరసన తెలపాల్సిన బాధ్యత రచయితకు లేదా. ఈ సెన్సార్ వల్ల గీతం సమగ్రత దెబ్బ తినలేదా?
 ఇదివరకు ఇదే పాటకు సవరణలు వద్దనుకున్న రచయితకు , ఇపుడు రాచరిక నియంత లక్షణాలుచూపి తెలంగాణ చిహ్నాల ప్రస్తావన తొలగిస్తామన్నపుడు  ఆత్మగౌరవం అడ్డురాలేదా.  దీనికి సమాధానం చెప్పడం ఆ రచయిత నైతిక న్యాయం. ఈ చర్యతో  అద్భుతమైన గీత గేయ రచయిత మీద ప్రజలందరికి అనుమానాలు కలిగిస్తాయి. 
 ప్రభుత్వం చిహ్నం నుంచి కాకతీయ, గోలుకొండ రాజుల ఆనవాళ్లు తీసేయాలనుకుకోవడం రాజకీయ నేరం. రాజ్యాంగ నేరం కాకపోవచ్చు.  ఏ కారణం లేకుండా నిర్ణయం తీసుకోవడమనేది అసమానత కిందికి వస్తుందన అని రాజ్యాంగం ఎన్నో సార్లు ప్రకటించింది. ఆ కారణం పై కూడా ఇది క్షమించడానికి వీల్లేదు.


Similar News