ఉన్నదంతా అమరావతి కోసం ఊడ్చేస్తే, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఏమిస్తారు?
‘అమరావతి’ హస్వధృష్టికి వివేచనాపరులంతా ‘విభజన’ కారులే!;
-అరుణ్
పోతుల బాలకోటయ్య వ్యాసం ‘అమరావతి పై మళ్ళీ విభజన విషo’ (ఆంధ్రజ్యోతి, దినపత్రిక జనవరి 3, 2025) అనే వ్యాసం చదివాక మా సీమ వాసులకు నవ్వాలో, జాలిపడాలో అర్థం కావడం లేదు. ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ కేంద్ర కార్యదర్శి శర్మ లాంటి ప్రజామేధావులపై ఆయన విభజన కారులంటూ విషం చిమ్మడం ఆయన హస్వ దృష్టినే గాక కురుచ బుద్ధిని బహిరంగ పరుస్తుంది.
ముందుగా ఆ ప్రజాస్వామిక మేధావులు ఏం చెప్పారు చూద్దాం. ప్రొఫెసర్ హరగోపాల్ తన “సాక్షి” దినపత్రిక ఇంటర్వ్యూలో, అమరావతి ప్రస్తావన గాని, దానికి అప్పుజేసి తెస్తున్న వేల కోట్ల రూపాయల నిధుల విషయంగానీ మాట వరసకైనా లేవనెత్తలేదు. ఆయన కోరిందంతా, రాయలసీమకు విదర్భ తరహా పాలన నదీజలాల పంపిణీలో ప్రాధాన్యత.
ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి, సామాజిక న్యాయం మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలవని, కేవలం ఒకే భాష కలిగి ఉండినంత మాత్రాన ఆ ప్రాంత ప్రజల్లో సమైక్యత భావం ఉండదనే వాస్తవాన్ని ప్రొఫెసర్ గాచెప్పారు. దీనిలో ఆయనను తప్పు పట్టేది ఏముందో, ఆయన విభజన కారుడు ఎలా అవుతారో బాల కోటయ్య గారే చెప్పాలి. తెలంగాణ వేర్పాటు నుండి గుణపాఠం నేర్చుకోని వారికి, నేర్చుకోదలచని వారికి ఈ సలహా రుచించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు
ఇక శర్మ అభిప్రాయాలను చూద్దాం. అభివృద్ధి కేంద్రీకరణ వ్యతిరేకిస్తూ, కేవలం రాజధాని కోసం 50 నుండి 60 వేల కోట్ల రూపాయల దాకా సుమారు మూడు లేక నాలుగు సంవత్సరాలలో ఖర్చు చేస్తే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుందని, దానివల్ల వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మరింత వెనుకబడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయమే ఆయన, ఇటు ముఖ్యమంత్రికి, అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి విన్నవించారు కూడా. అమరావతి నిధుల సాధనలో చూపిన ఆత్రుత పెద్దలు ఆవంతైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన సలహానిచ్చారు. అదే సమయంలో అనకాపల్లి దగ్గర ఆర్సెలార్ మిట్టల్ కు ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అనుమతి ఇవ్వడం ఏం సబబు? అని ప్రశ్నించారు. ఇలా ప్రైవేట్ సంస్థల ఏర్పాటు వల్ల రిజర్వేషన్స్ వల్ల లబ్ధి పొంరిదే ఎస్సీ, ఎస్టీ, మరియు బీసీ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఇందులో తప్పేముందో కోటయ్యకే తెలియాలి. అంతేగాక, రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు నిధుల కొరతవల్ల దశాబ్దాలుగా పూర్తి కావడం లేదని, వంశధార మీద ట్రిబ్యూనల్ ఆమోదించిన ప్రాజెక్టు నేరేడు ప్రాజెక్టును పూర్తి చేయలేదంటూ,వంశధార బహుళ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు విధులు కేటాయించాలని ఆయన ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర శ్రీకాకుళ మండలాల్లో 6,58 మైనర్ సాగునీటి ప్రాజెక్టులు, 1,800 చెరువులు నిధుల కొరత వల్ల నిర్వహణ లోపించి, దాదాపు రెండు లక్షల 60 వేల ఎకరాల ఆయ కట్టుకు నీళ్ళoదడం లేదనే చేదు వాస్తవాన్ని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నిధుల కొరతతో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇటువంటి నిధుల కొరత ఉన్నసమయలో, ఉన్న నిధులను వెనకబడిన ప్రాంతాల ప్రజల కనీస మౌలిక అవరాలను తీర్చేందుకు వినియోగించాలా ? లేక సింగపూర్ నమూనాలో రాష్ట్ర రాజధాని నిర్మించాలా? అనేది వేయి డాలర్ ప్రశ్నేమీ కాదని అంతేగాక,కోటయ్య గారి లాంటి మేధావులకు తెలియనిదేమీ కాదు..
అమరావతికి వేలకోట్ల రూపాయలను అప్పుగా పొందేందుకు చేసిన కృషిని విభజన చట్టంలో హమీలయిన వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, నిధుల కేటాయింపు కేంద్రం నుండి సాధించేందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు గట్టి ప్రయత్నం చేయలేదని, ఆయన ప్రశ్నించడంలో తప్పేముంది. అంతేగాక , విభజన చట్టంలో హామీ ఇచ్చిన కడప ఉక్కు పరిశ్రమ స్థాపన, గాలేరు- నగరి, తెలుగు గంగా, హంద్రీ-నీవా, వెలిగొండ లాంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న కేంద్ర హామీని నెరవేర్చలేదని, మరి, రాష్ట్ర ప్రభుత్వం వాటి ఊసైన ఎందుకు ఎత్తలేదు అని ఆయన అడగడంలో తప్పేముంది? బాలకోటయ్య లాంటి వారికి ఎ- అంటే అమరావతి,పి- అంటే పోలవరం కావొచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిలో అమరావతి, పోలవరం- ఈ రెండే ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలు ఉన్నాయి.అందులో ప్రజలూ వున్నారు. వాటి,వారి మధ్య అభివృద్ధి అసమానతలు ఉన్నాయి. అందువల్ల, నిధులు కేటాయించడంలో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఇంగిత జ్ఞానమున్న ఎవ్వరూ కాదనలేరు .
ఒక కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే, అతని ఆరోగ్యం కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సాధారణమైన విషయం. కుటుంబ ఆదాయంలో అతని ఆరోగ్యం కై ఎక్కువ ఖర్చు చేస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్నదంతా తలకిందుల వ్యవహారం కాదా? తమ కడుపు నిండితే అందరి కడుపు నిండినట్లే అనుకునే వాళ్లకు కడుపు ఎండుతున్న వాళ్ళ వేదన ఎలా అర్థమవుతుంది.
మొత్తం పైన,పై ప్రజాస్వామ్యవాదుల వాదన సారాంశం ఒక్కటే. నిధుల కేటాయింపులో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత నివ్వాలని అమరావతి అభివృద్ది మొత్తం రాష్ట్రాభి వృద్ధి కాదు. ప్రాంతాల మధ్య ఆ సమానత తొలగించాలని వారి కోరిక.
కోటయ్య గారి ఆగ్రహం, అక్కసు వారిని నిందించడంతోనే ఆగలేదు. ఆయన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎలా సస్య శ్యామలంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం కూడా చేశారు .పాపం, కృష్ణాజిల్లాలో పోతిరెడ్డిపాడు లాంటి నలభై నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే డ్యామ్ లేదని, అదేవిధంగా కియా మోటార్స్ లేదని, విశాఖలో ఉక్కు కర్మాగారం ఉందని అది కృష్ణా, గుంటూరు జిల్లాలలో లేదని వాపోయారు. ఆ విషయం ఎంత అసమంజస మైందో,అర్థరహితమైనదో వివరించే ముందు కొన్ని ప్రభుత్వ గణాంకాలు మీ ముందు ఉంచుతాం.
ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక- ఆర్థిక సర్వే ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తులలో ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలు రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో ఏవీ, ఒక్క తిరుపతి తప్ప, కోస్తా జిల్లాల దరిదాపుల్లో లేవు. తిరుపతి కూడా కేవలం అక్కడి వెంకటేశ్వర స్వామి వల్ల, శ్రీ సిటీ వల్ల మాత్రమే కోస్తా జిల్లాలతో కొన్ని విషయాలలో పోటీ పడుతుంది.
ఇక తలసరి ఆదాయాన్ని వస్తే, ఒక్క విశాఖపట్నం (అది ముందు నుండి నౌకాశ్రయం వల్ల మరియు పరిశ్రమల వల్ల) తప్ప, మిగతా జిల్లాలు ఏవి ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలతో ఏమాత్రం పోటీ పడవు. తలసరి ఆదాయంలో మొదటి స్థానం విశాఖ, రెండవ స్థానం కృష్ణ ,మూడు ఏలూరు నాలుగు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి దిగువ ఐదు స్థానాలు అల్లూరి సీతారామరాజు , మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి 50 వేల 135 కోట్ల రూపాయలు. కాగా,15 జిల్లాల స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు కన్నా తక్కువ. ఆ పదిహేను జిల్లాలలో ఐదు జిల్లాలు రాయలసీమకు చెందినవి కాగా, నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రవి ఉండడం గమనార్హం. మరిన్ని గణాంకాలు వుటంకించి పాఠకులను ఇబ్బంది పెట్టదల్చుకోలేదు.
బాలకోటయ్య రాయలసీమకు పోతిరెడ్డిపాడు 44 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉందని, పాపం కృష్ణాజిల్లాకు అలాంటి నీటి వసతి లేదని తెగ బాధపడిపోయారు. కానీ, ఆయనకు పోతిరెడ్డిపాడు గురించి, అక్కడ నీటి విడుదల గురించి సరైన సమాచారం ఉన్నట్టు లేదు. శ్రీశైలం జలాశయంలో + 854 అడుగుల పైన నీరు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుండి సీమకు నీళ్లు అందుతాయి. దశాబ్దాలుగా ఏనాడు ఆ లెవెల్ లో నీటిని మన ప్రభుత్వాలు ఉంచడం లేదు. 69 జీవో తెచ్చి శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగుల నుండి 831 కి తెచ్చినది మన ప్రభుత్వాల నిర్వాహకమే.ఆ విధంగా రాయలసీమ నీటి సరఫరా గొంతును నులిమింది ఎవరో చెప్పాలా? అంతే కాదు, తామిచ్చిన ఉత్తర్వులనే ఉల్లంఘిస్తూ, శ్రీశైలంలో 790 అడుగుల వరకు నీరు తోడిన సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపు రెండు వేల టీఎంసీల నీరు సముద్రం పాలైనా, ఇప్పుడు రాయలసీమకు నీరు అందించడానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేవంటే ప్రభుత్వాల నిర్వహణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విద్యుత్ పేరుతో, బచావత్ కమిషన్ నిబంధనను ఉల్లంఘిస్తూ, ఎడాపెడా శ్రీశైలం నుండి నీటిని కిందికి తోడి పారేస్తుంటే, ఇక పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు 44 వేల క్యూసెక్కులు కాదు కదా, కనీసం 15 వేల క్యూసెక్కులు అందే అవకాశం లేదు. అంతేగాక ,శ్రీశైలం ప్రధాన కాలువ నిర్వహణ సరిగా లేకపోవడంతో 30 వేల క్యూసెక్కులు విడుదలయినా, కాలువ గట్లు తెగిపోతున్నాయి. ఈ విషయం, పాపం, ఆయనకు తెలిసినట్లు లేదు. రాయలసీమ నిజంగా సస్యశ్యామలంగా ఉంటే, కర్నూల్ జిల్లా పశ్చిమ ప్రాంతం నుండి నవంబర్ నెల నుండే ఇతర ప్రాంతాలకు కడుపు పట్టుకుని వలస వెళ్లాల్సిన అవసరం ఏముంది? బాలకోటయ్య ఒక మారు గుంటూరు జిల్లా మిరప, పత్తి చేలలో పనిచేస్తున్న కూలీలు ఏ ప్రాంతం వారో గమనిస్తే విషయం అర్థం అవుతుంది. వారంతా కడుపు నిండి అరగక అక్కడ శారీరక శ్రమ చేయడానికి రాలేదు. తాగు ,సాగునీరు లేక పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వారు వాళ్లు.ఇక ,అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుండి ఆడ,మగా లక్షలాదిమంది గ్రామాలు వదిలి అటు కేరళ ఇటు బెంగళూరు నుండి మద్రాస్ వరకు వలస కూలీలుగా వెళుతున్నారు. కడప జిల్లా నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదండి. వారంతా పేద కూలీలు. మీకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే మీ ప్రాంతం వారంతా అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు. మీకు వలసలు అంటే అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలకు, అదీ అత్యున్నత ఉద్యోగాలు, వేల డాలర్ల జీతాలు. మా వాళ్లది దినకూలీల, కట్టు బానిసల దీన స్థితి .దేశంలోని అత్యంత వెనుకబడిన 52 జిల్లాలలో నాలుగు రాయలసీమ జిల్లాలు ఉన్నాయని కేంద్రమే చెబుతున్నది. మరి కోటయ్య గారు పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదం. ఇక ఆయన తమకు కడప ఉక్కుగా కర్మాగారం లేదని వాపోతున్నట్టున్నారు. మీ భాదను అర్థం జేసుకొనే కాబోలు,కేంద్రం మంజూరు చేయలేదు,రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. ఉక్కు కర్మాగారం ఇంకా ఏర్పాటు చేయలేదని విషయం ఆయనకు తెలియదనుకోవాలా? ఇక , ఆయన పేర్కొన్న కియా మోటార్స్ విషయాని కొస్తే అoదులోపనిచేస్తున్న వారిలో సీమవాసులు 10% గా దాట లేదనేది చేదు వాస్తవం. అంతేగాకా వారంతా స్వీపర్లు, గేటు కీపర్లు ,కిందిస్థాయి ఉద్యోగులు మాత్రమే. భూమి మాది,నీరు మాది ఉన్నత స్థాయి ఉద్యోగాలు మాత్రం బయటి ప్రాంతం వారివి.
ఇక్కడే మరో విషయం ప్రస్తావించడం అవసరమనిపిస్తుంది. 2014-19మధ్యకాలంలో అమరావతిలో నియమించిన 10 వేల తాత్కాలిక ఉద్యోగులందరూ గుంటూరు, కృష్ణా జిల్లా వారే. ఆవిధంగా నియమ నిబంధనలు పెట్టడం పాక్షికత కాదా? టాటా కంపెనీ వారు 100 గ్రామాలను దత్తత తీసుకుంటామంటే ,ఆనాటి ప్రభుత్వం సిఫారసు జేసిన గ్రామాల్లో ఒక్కటీ రాయలసీమ ప్రాంతానికి చెందినది కాదు.రాజధాని ఫ్రీ జోను (Free Zone) గా వుండాలని మేము ఆనాడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాం. కానీ,గుంటూరు,కృష్ణా జిల్లాలు మాత్రమె రాష్ట్రంగా భావించే వారికి ఏం చెప్పాలి. కొత్త సంస్థలు సరే,ఉన్నవాటినే తరలించే దుర్మార్గమైన చర్యలు.గతంలో ఎయిమ్స్ ను అనoతపూర్ నుండి గుంటూర్ తరలించారు. ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ కార్యాలాన్ని కడప నుండి తరలించే ప్రయత్నం. అంతకు ముందు కర్నూల్లో వున్న కార్యాలయాల తరలింపుకు ప్రయత్నం. దీనికి బాలకోయయ్య ఏమంటారో?
మేము అడుగుతున్నది ఒక్కటే.. మీరు అమరావతి, పోలవరం కు నిధులు సాధించడంలో ఎంతో ప్రయత్నం చేశారు. అభినందనీయం. కానీ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఏనాడైనా ఈ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రయత్నించాయా? ఇప్పుడు వారికి ఆ అవకాశం ఉంది కదా!
చివరిగా ,రాయలసీమ వాసులుగా, ఆయన పోతిరెడ్డిపాడు పై అక్కసు వెళ్ళబుచ్చినాడు కనుక, వ్యవసాయ రంగంలో రాయలసీమ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందో ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ చెప్పక తప్పదు .రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి రెండు కోట్ల 15 లక్షల ఎకరాలలో రాయలసీమలో 90 లక్షల ఎకరాలు అంటే, 42 శాతం ఉంది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో 49. 55 లక్షల ఎకరాలతో వ్యవసాయ యోగ్యమైన భూమి 12 శాతం ఉంది. . రాయలసీమ జిల్లాలకు కేటాయించిన నీరు 21 శాతం కాగా, కృష్ణ గుంటూరు జిల్లాలకు 76% నీటి కేటాయింపులు జరిగాయి. సాగునీటి వినియోగం రాయలసీమలో 9% కాగా, కృష్ణ గుంటూరు జిల్లాలలో 67% గా ఉంది. రాయలసీమలో ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న అలగనూరు రిజర్వాయర్ మరియు అన్నమయ్య ప్రాజెక్టు లకు నిధులు కేటాయించకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్నాయి. ఇక, గత మూడు దశాబ్దాలుగా పూర్తీ చేయని హంద్రీ-నీవా(ఇప్పటికీ పంటకాలువలు లేవు),చిత్తూర్ జిల్లాకు నీరందాల్సిన గాలేరు-నగరి కడప జిల్లా గడప దాటాక పోవడం, గండికోట,మైలవరం రిజర్వాయర్లు నిండు నీళ్ళతో కళకళ , పంటకాలువలు లేక రైతులు విలవిల లాడటం మీకు తెలియదేమో? అందుకేనేమో, ఒక సం. వ్యవధిలో( కాంట్రాక్టర్లకు బోనస్ ప్రకటించి) పట్టిసీమ కట్టిన వారికి,చేపల,రొయ్యల కాపుతో జేబులు గలగల లాడుతున్న వారికి, సీమ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమేముంటుంది?.
వాస్తవాలు అలా ఉండగా, ఏదో రాయలసీమకు ప్రభుత్వం ఒరగ పెడుతుందనీని, అందువల్ల అమరావతికి వేలకోట్ల నిధులు అప్పుగా తెచ్చి అక్కడ మహోన్నతమైన రాజధాని నిర్మిస్తుంటే, మేమంతా అసూయ పడడం భావ్యం కాదనీ, మాపై బురద చల్లడం మహా దుర్మార్గమైన చర్య.
చివరిగా ,కోటయ్య గారికి చెప్పేదేమంటే మీ ప్రాంత అభివృద్దే, రాష్ట్ర అభివృద్ధి అనుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అనేది హర గోపాల్ మరియు శర్మగారు వివరించారు. చరిత్ర చెప్పిన పాఠాలను మరిస్తే భవిష్యత్తరం మనలను క్షమించదు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు దారి తీసిన పరిస్థితుల గమనంలోకి తీసుకోక, నిధులను కేవలం ఒక ప్రాంతంలోనే వినియోగిస్తే, అది ప్రాంతీయఆసమానతలకు ,ప్రాంతాల ప్రజల అసంతృప్తికి దారితీస్తుంది.అసమానతల విత్తులు నాటి, అభివృద్ధిని దూరం చేస్తే, చివరకు కోటయ్య గారు ఊహించినట్టు, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు దారి తీయడంలో ఆశ్చర్యం ఏమి ఉండదు. దానికి కారణభూతులెవరో విజ్ఞులు ఆలోచించాలి. …
(అరుణ్, కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక)