అడ్రస్ లేని వర్షాలతో అనంత రైతాంగం అయోమయం
ఊరించి ముఖం చాటేసిన రుతుపవనాలు;
కార్తెలన్నీ పోయ, విత్తనాల ఏకాదశి పోయే, మే జూన్ నెలల్లో దుక్కులు దున్ని విత్తనం వేయడానికి సన్నద్ధం చేసి వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి. తడి లేని పొలాలు, పచ్చగడ్డి లేని గట్టు, మేత లేక బక్కచిక్కిన పశువులు. అన్నీ చినుకు కోసం చూస్తున్నాయి! సాగునే నమ్ముకున్న రైతుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు మొదలైంది. వర్షం ఎప్పుడొస్తుందో అంచనా వేయలేక పోతున్నారు శాస్త్రజ్ఞులు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో పాటికి డెబ్భై శాతం వేరుశెనగ విత్తనం వేయాల్సిన చేన్లు వర్షపు చినుకు కోసం పరితపిస్తున్నాయి. విత్తిన విత్తనాలు ఇంకా మొలకెత్తడం లేదని, అదును దాటిపోతోందనే భయం పట్టుకుంది. తొలకరిలోనే వరుణుడు మొహం చాటేశాడు. ఫలితంగా జిల్లాలో పంటల సాగు ఆశించినంత లేదు. జూన్ 1 నుంచి 30 మధ్య సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జూన్ నెలలో 64 శాతం మేర ‘వర్షపాత లోటు’ నమోదైంది. జూన్ చివరి వారంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 60 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
23 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కేవలం 3 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా నిరుడు నైరుతి ప్రవేశించినప్పటి నుంచి అంటే జూన్ 1 నుంచి అవి నిష్క్రమించే సెప్టెంబరు 30 వరకు జిల్లాలో అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ మాసంలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం ముగిసే నాటికి అధిక వర్షపాతం నమోదు అయింది. కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాలకు ఏమాత్రం అందడం లేదు. దేశంలోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి.
వచ్చిన తర్వాత కూడా వేగంగా విస్తరించకుండా ఒకచోటే ఉండిపోయింది. పదిరోజుల పాటు వాటి కదిలికల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఆ తర్వాత తిరిగి పుంజుకుని ఉత్తరాదికి వ్యాపించాయి. దీంతో మధ్య వాయువ్య భారతంలో కుంభవృష్టి వర్షాలు కురిశాయి. జూలై 8 నాటికి దేశంలోని వాయువ్య భారతానికి చేరుకోవాల్సివుండగా ముందుగానే ఆ ప్రాంతాలకు విస్తరించాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాలో కుంభవృష్టి వర్షాలు పడగా, దక్షిణాదిన మాత్రం వర్షం ఛాయలే కనిపించలేదు. ప్రస్తుతం రైతాంగమంతా జూలై మాసం పైనే ఆశలు పెట్టుకుంది.
ఈ మాసంలోనైనా గట్టి వానలు పడితే పంటలపై ఆశలు చిగురిస్తాయి.జిల్లాలో ఇప్పటిదాకా వేరుశనగ, పత్తి, ధనియాలు, వరి, కంది, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర పంటల సాగు విస్తీర్ణం 10 శాతం కూడా దాటలేదు. సాధారణంగా సీజన్ పార్రంభంలోనే (జూన్ మొదటి, రెండు వారాల్లోనే) వేరుశెనగ, పత్తి విత్తుతారు. కానీ, ఈసారి సీజన్ ప్రారంభంలో సమృద్ధిగా వర్షాలు పడకపోవడంతో వేరుశెనగ, పత్తి విత్తనాలు నాటేందుకు రైతులు మొగ్గు చూపలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కేవలం వందల ఎకరాల్లోనే వేరుశనగ, పత్తి విత్తనాలు నాటారు. మొక్కజొన్న పంట కూడా కేవలం మూడు వందల ఎకరాలు వేశారు.
వానాకాలంలో కనీసం 7 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారు. కానీ ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి.ఇతర పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాకాలంలో మైనస్ 28 శాతం వర్షపాతం లోటు నమోదైంది , సాధారణ వర్షపాతం 19 సెంటీమీటర్ల కు వ్యతిరేకంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 15 సెంటీమీటర్లు కాగా , మైనస్ 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నప్పటికీ రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేనందున దీని ప్రభావం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది .మరో ఐదు రోజుల్లో రాయలసీమలో అల్పపీడనం లేదని, దీంతో వర్షాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ , కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి. కోస్టల్ కర్ణాటక , కేరళలో పరిస్థితి భిన్నంగా ఉన్నాయి , ఇక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయని, వారం రోజుల్లో రాయలసీమలో తెలంగాణ తుఫాను ఏర్పడుతుందని ఐఎండి శాస్త్రవేత్తలు.
జూలై రెండో వారంలో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో రాయలసీమ జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి రుతుపవనాలు ముందుగా వచ్చినా లాభం లేదు అనంతపురం, సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, కర్నూల్ కొందరు రైతులువర్షాలపై ఆధారపడి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6.57 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసేవారు కానీ ఇప్పటికి యాభై వేల ఎకరాలలో కూడా వేరుశెనగ విత్తనం వేయలేదు. జొన్న, సజ్జ, మొక్కజొన్న, పత్తి, శనగ, కంది వంటి ఇతర ప్రధాన పంటలకు ఇదే పరిస్థితి ఉంది , అయితే ఈ ఖరీఫ్ పంట సాధారణం కంటే తక్కువగా ఉంది.