సిరినోము కాత్యాయనీ వ్రతమే

కోవెల సుప్రసన్నాచార్య విశ్లేషణాత్మక పరిశోధన

By :  Admin
Update: 2024-12-17 06:20 GMT

తిరుప్పావై గోదాదేవి స్వానుభవ మాధుర్యస్రోతస్సు అని వర్ణించారు శ్రీ కోవెల సుప్రసన్నాచార్యుల వారు. డాక్టర్ శ్రీపాద జయప్రకాశ్ రచించిన తిరుప్పావై శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తిరుపతి 2015లో ప్రచురించిన గ్రంధానికి శ్రీ కోవెల సుప్రసన్న అద్భుతమైన ముందుమాట రచించారు. డాక్టర్ శ్రీ పాద జయప్రకాశ్ రచించిన ఈ వ్యాఖ్యాన గ్రంథానికి ఆచార్య కా ఇ దేవనాథన్, విశ్వవిద్యాలయ కులపతులు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఈ ముందుమాటలో శ్రీ కోవెల వారు తిరుప్పావైలో కనిపించిన శ్రీవిద్యా మంత్రోపాసన రహస్యాలను వివరించారు. తిరుప్పావై గురించి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు శ్రీ కోవెల సుప్రసన్న. శ్రీకోవెల సుప్రసన్న గారికి వందనాలతో, ఆ లోతైన అంశాలను ఇక్కడ మనందరికోసం ఇస్తున్నాను, వారి సౌజన్యంతో...

గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుని ఇంట్లో తులసి తోటలో జనక మహారాజునకు వలె లభించిన బిడ్డ. మంటిగడ్డ. అందువల్ల ఆమెయే భూదేవి. భూమి పుత్రి. ఈ చిదచిద్రూపమైన ప్రకృతి పరివారమంతా ఈ పృథ్వియే. పృథ్వి అనాదిగా ఈశ్వర విరహంతో నిత్యవేదన పడుతున్నది.

శ్రీ విల్లి పుత్తూరులో అన్నవయల్ పుదువై తనియన్ లో సస్యసమృద్ధమైన పొలాలూ పంటలూ విలసిల్లుననీ, ఆ పొలాలలో హంసలు క్రీడిస్తూ వున్నాయనీ వర్ణింపబడింది. శ్రీ విల్లిపుత్తూరు బిడ్డ గోదాదేవి ఐహికమైన పరిపూర్ణత సస్యముల వలన, ఆముష్మికమైన అభీప్స-ఈశ్వర కామన- హంస విలాసం వలన వ్యక్త మవుతూ వున్నవి. ఈ రెండు స్తరాలలో ఆమె శ్రీకృష్ణానుభవాన్ని పొందేందుకు ఎంతటి తగిన పరిపక్వ స్థితిలో వున్నదో వ్యక్త మవుతున్నదీ చిత్రణం వలన.

తిరుప్పావై ఒక వ్రతం నోము. ద్వాపర యుగంలో గోపికలు బృందావనంలో ఇది వర్షము కురిసే నేల సస్యశ్యామల మయ్యేందుకు లౌకికంగా ఆముష్మికంగా మేఘ వర్ణుడైన శ్రీ కృష్ణ ప్రాప్తికోసం నిష్ఠతో చేసిన కాత్యాయనీ వ్రతం. సర్వజీవులకూ ఉపాయభూతమైన ఈ వ్రతం అంతర్ముఖి బహిర్ముఖాలు కలిగింది.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 


తిరుప్పావై కాత్యాయని వ్రతం అని చెప్పడానికి సుప్రసన్న మహాభాగవత పురాణం దశమస్కందంలోని 22 వఅధ్యాయాన్ని, తిరుప్పావైలో మాయన్ మామాయన్ పాశురాలను, శ్రీ విద్యాసంప్రదాయాన్ని, లలితాసహస్రనామాన్ని, త్రిపురారహస్య మహాత్మ్యఖండాన్నిప్రస్తావించారు. ఈ విశేషాన్ని ఇదివరకెవరూ ప్రతిపాదించలేదు. భాగవతం 22వ అధ్యాయంలో వ్రతాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.

హేమన్తే ప్రథమే మాసి నందగోపకుమారికాః

చేరుర్హవిష్యభుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్

ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చోదితే2రుణే

కృతా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృప సైకతీమ్

గంధైర్మాల్యైః సురభిర్బహులైధూపదీపకైః

ఉచ్చావైశ్చోపచారైః ప్రవాళ ఫల తండులైః

కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి

నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః

ఇతి మంత్రం జపన్త్యస్తాః పూజాం చక్రుః కుమారికాః

ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణ చేతసః

భద్రకాళీం సమానార్చాః భూయాన్నంద సుతః పతిః

ఉషస్యుత్థాయ గత్రైః స్వైరన్యోన్యాబద్ధబాహవః

కృష్ణముచ్చైః జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతుమన్వహం (1-6)

మార్గశీర్షమాసము, ఉషఃస్నానము, సహగోపికల ఉత్థాపనము, హవిష్యభోజనము, కృష్ణనామకీర్తనగానము- ఏకమాసదీక్ష ఇవన్నీ గోదాదేవి ప్రసక్తం చేసిన విషయాలే. కాత్యాయని సైకత ప్రతిమా పూజ ప్రసక్తి ఈ ప్రబంధంలో రాలేదు. కొంచెం జాగ్రత్తగా విచారించి చూస్తే ఈ దివ్యప్రబంధ హృదయంలో శ్రీకృష్ణునకు ఆయన సహోదరియైన కాత్యాయనికి అభేదాన్ని భావించి శ్రీకృష్ణోపాసనము చేసినట్లుగా కానవస్తున్నది. భగవంతుడు యోగమాయను యశోదాగర్భంలో ప్రవేశించమని ఆదేశించినట్లున్నది. ఆమెను వసుదేవుడు గోకులంనుంచి తెచ్చినాడు. కంసుడాశిశువును ఆడపిల్లయైనా సంహరించబోగా ఆకాశముదాకా ఎగిరింది.

అదృశ్యతానుజావిష్ణోఃసాయుధాష్టమహాభుజా దివ్యప్రగంబరాలేప

రత్నాభరణ భూషితా ధనుఃశూలేషు చర్మాసి శంఖచక్రగదాధరా

ఆమె సాక్షాద్దుర్గయే. లోకం ఆమెను దుర్గ,భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణ, ఈశానీ, శారద, అంబిక అనే పేర్లతో వ్యవహరిస్తుందని మహావిష్ణువు పేర్కొన్నాడు.

Tags:    

Similar News