విషవలయంలో ఆంధ్రప్రదేశ్
లాభాల కోసం ప్రజారోగ్యం పణంగా - శాశ్వత కాలుష్యంతో భవిష్యత్తుకు ముప్పు!;
డా. కలపాల బాబూరావు
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫార్మా పరిశ్రమల కాలుష్యం, ప్రమాదాలతో విలవిలలాడుతోంది. గత నెలలో బలభద్రపురంలో వెల్లడైన కాన్సర్ విజృంభణ దీనికి ఒక భయంకరమైన ఉదాహరణ. అక్కడే కాన్సర్ కారక రసాయనాలు వాడే పరిశ్రమకు అనుమతివ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఇప్పుడు, మరింత ఆందోళనకరంగా, నియంత్రణ సాధ్యంకాని ప్రమాదకర రసాయనాల వాడుకకు మరో చోట కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
మే 14న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ఒక తూతూ మంత్రంలా కనిపిస్తోంది. శాస్త్రీయ దృక్పథం లేని అభివృద్ధి కోసం ఆరాటం, ప్రజల అవసరాలను విస్మరించి లాభాల కోసం పనిచేసే కంపెనీల ప్రోత్సాహం కారణంగా ఆంధ్రప్రదేశ్ శాపగ్రస్తమవుతోంది. ప్రపంచం తిరస్కరించిన హానికర రసాయనాలను తాత్కాలిక లాభాల కోసం వాడటం మన భవిష్యత్తును శాశ్వత నష్టాల్లోకి నెట్టనుంది. ఇదే తరహా రసాయనాలతో ఐరోపా దేశాలపై పడిన ఆర్థిక భారం అంచనా ప్రకారం 2 లక్షల కోట్ల డాలర్లు.
ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను, పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, దాని సంస్థలు మరియు నిపుణుల కమిటీలు ఈ హానిని నివారించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. శాస్త్రీయ విశ్లేషణ, ప్రజారోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణను విస్మరించి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. విచక్షణ లేకుండా హానికర పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు. ఉత్పత్తి పెంచుకోవడానికి ప్రజలకు హాని కలిగించే చర్యలకు వెనుకాడటం లేదు.
కాస్టిక్ సోడా (Caustic soda) తయారీలో వెలువడే క్లోరీను (Chlorine) ఉపఉత్పత్తి. క్లోరీను వాడే సామర్ధ్యం కాస్టిక్ సోడా ఉత్పత్తికి ప్రతిబంధకం. క్లోరీను వాడుక పెంచడానికి చేసే ప్రయత్నాలలో అడ్డదారులు తొక్కడానికి వెనుకాడని కంపెనీలు ప్రజలకూ, పర్యావరణానికీ ఎంతటి హాని చేయడానికీ వెరువక ప్రపంచం తిరస్కరించిన పర్ ఫ్లోరో ఆక్టోనయేక్ యాసిడ్ ( Perfluoro Octanoic Acid: PFOA) రసాయనాలను వాడే ఉత్పత్తులు ప్రారంభిస్తున్నారు.
ఒకరు PFOA అనే శాశ్వత రసాయనాన్ని వాడతామని చెప్పగా, మరొకరు ఆ విషయాన్ని దాచి పెట్టి మే 14నాడు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఇక్కడ వాడతామంటున్న పెర్ ఫ్లోరోఆక్టోనయేట్ అనే PFOA రసాయనం ప్రపంచానికి ఇప్పటికే చేసిన కీడు గురించి లభించే వివరాలు తెలుసుకోవడం అత్యవసరం.
ప్రపంచవ్యాప్తంగా రసాయన కాలుష్యం: భూమి ఎదుర్కొంటున్న తొమ్మిది కీలక పర్యావరణ సమస్యల్లో రసాయన కాలుష్యం ఒకటి. మనం ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటేశాము. శాశ్వత రసాయనాల కాలుష్యం హద్దులు దాటిందని 2022 నాటి పరిశోధన (కజిన్స్ తదితరులు) స్పష్టం చేస్తోంది. ఇది ప్రపంచానికి పెను సమస్య. శాశ్వత రసాయనాలు మానవ నాగరికత అంతరించినా భూమిపై మిగిలి ఉండే రసాయనాలు. వాటి ప్రత్యేక భౌతిక రసాయన గుణాల వల్ల వాటి వినియోగం విస్తృతమైంది. ఉత్పత్తి చేసే కంపెనీలు వాటి ప్రమాదాలను గుర్తించినప్పటికీ దాచిపెట్టాయి.
విల్బర్ టెన్నాంట్ (Wilbur Tennant) ఉదంతం, రాబర్ట్ బిలోట్ (Robert Bilott) న్యాయ పోరాటం PFOA కాలుష్యం యొక్క భయంకరమైన వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. PFOA వినియోగంపై పరిమితులు విధించబడినప్పటికీ, భారతదేశం వంటి దేశాలలో దీని వినియోగం కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
బిలోట్ కోర్టు ద్వారా పొందిన సమాచారాన్ని EPAతో పంచుకున్నాడు. దీని ఫలితంగా 2006లో కంపెనీలు PFOA వాడకాన్ని దశలవారీగా తగ్గించడానికి మరియు 2015 నాటికి పూర్తిగా మానుకోవడానికి అంగీకరించాయి. కాలుష్య బాధితులు వేసిన క్లాస్ యాక్షన్ సూట్ ద్వారా 1961-2006 మధ్య డ్యూపాంట్ మరియు 3M కంపెనీల అంతర్గత అధ్యయనాల సమాచారం బయటపడింది.
2020లో ప్రొఫెసర్ వుడ్ రఫ్ (Professor Trent Woodruff), ఇతరులు జరిపిన అధ్యయనంలో కంపెనీలకు 1970 నాటికే PFOA వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు తెలుసని తేలింది, కానీ వారు దానిని దాచిపెట్టారు. 2000 సంవత్సరానికి ముందే శాశ్వత రసాయనాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయని పరిశోధనలు చెబుతున్నాయి. 1990 దశకం చివరలో డ్యూపాంట్ ఫాక్టరీ ఉద్యోగుల ఆరోగ్యంపై అధ్యయనానికి రక్త నమూనాలు సేకరించింది. ఆరోగ్యాన్ని పోల్చడానికి PFOA లేని రక్త నమూనాల కోసం వెతుకులాట మొదలు బెట్టారు.
మారుమూల పారిశ్రామిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ప్రజలలో కూడా ఈ రసాయనాలు లేని రక్తం దొరక లేదు. చివరికి ఈ రసాయనాల ఉత్పత్తి ప్రారంభం కాక ముందు, కొరియా యుద్ధానికి సైనికులను ఎంపిక చేసే ప్రక్రియలో సేకరించిన రక్త నమూనాలను పోలికకు తీసుకున్నారు. అంటే 2000 కు పూర్వమే ఈ రసాయనాలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వర్షం కురిసినా వాటిలో ఈ రసాయనాలు ఉంటున్నాయి. న్యాయ పోరాటంలో భాగంగా ఏర్పాటు చేసిన C8 సైన్స్ పానెల్ PFOA వల్ల ఆరు రకాల వ్యాధులు వస్తాయని నిర్ధారించింది: అధిక కొలెస్ట్రాల్, అల్సరేటివ్ కోలిటిస్, థైరాయిడ్ వ్యాధి, వృషణాల కాన్సర్, మూత్రపిండాల కాన్సర్ మరియు గర్భధారణ ప్రేరిత రక్తపోటు. 2019లో స్టాక్‌హోమ్ కన్వెన్షన్ ద్వారా 180 దేశాలు శాశ్వత రసాయనాల వాడకాన్ని మానుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి. భారతదేశం ఈ ఒప్పందంలో భాగం కాకపోవడం వలన కంపెనీలు PFOA వాడే ఉత్పత్తులతో పర్యావరణ అనుమతులు పొందుతున్నాయి. ఈ విస్తరణ ప్రజల పాలిట శాపం కానుంది.
ఇంతవరకూ PFOA లతో జరిగిన విధ్వంసం యొక్క భయానకమైన వాస్తవాలను మనం చూశాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న ప్రమాదం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాసిం, బలభద్రపురం తమ కాస్టిక్ సోడా ప్రాజెక్టు విస్తరణలో క్లోరీను వినియోగం పెంచేందుకు రకరకాల క్లోరీను రసాయనాల ఉత్పత్తులు ప్రతిపాదించి ఫిబ్రవరి 2024 లో పర్యావరణ అనుమతి పొందింది.
ప్రజాభిప్రాయ సేకరణ (పిబ్రవరి 2023) సందర్భంలో మానవ హక్కుల వేదిక కార్యదర్శి పాల్గొనీ, రాత పూర్వకంగానూ అభ్యంతరాలను తెలిపారు. ప్రజల కోసం శాస్త్రవేత్తలు ప్రతిపాదనలోని అంతర్జాతీయ ఒప్పంద (మాంట్రియల్ 1987, కిగాలి సవరణ 2016) ఉల్లంఘనలను ఓజోను విభాగానికి వివరంగా తెలియ పరుస్తూ లేఖ రాశారు.
ఓజోను పొరకు హాని కలిగించే కార్బన్ టెట్రాక్లోరైడ్ రోజుకి 70 టన్నులు ఉత్పత్తి చేసి ఇన్సినరేటర్ లో తగల బెడతారట. తగలబెట్టే క్రమంలో అత్యంత ప్రమాదకర డయాక్సిన్లు, ఫ్యూరాన్లు ఉత్పత్తయి గాలిలో కలుస్తాయి. అవి కాన్సర్ కారకాలు. అవి గాలిలో వేయి కోట్లలో ఒక భాగమున్నా ప్రమాదకరం. అలాగే R22 రసాయనాన్ని ఉత్పత్తి చేసేప్పుడు R23 కూడా విధిగా ఉత్పత్తవుతుంది. దానిని 2030 నాటికి పూర్తిగా తొలగించడానికి ప్రపంచం అంగీకరించింది.
పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో R23 ఉత్పత్తిని దాచి పెట్టారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజల అభ్యంతరాలను పరిశీలించ కుండానే పర్యావరణ అనుమతి యిచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ 28 ఫిబ్రవరి 2023 న జరగగా, గ్రాసిం పర్యావరణ అనుమతికి ప్రతిపాదనని 20 డిసెంబరు 2023 నాడు సమర్పించింది. జనవరి 16, 2024 నాటి నిపుణుల కమిటీ సమావేశంలో పర్యావరణ అనుమతికి సిఫారసు చేశారు. ఆ సమావేశపు నిమిషాలలో నిపుణులు PFOA వాడుక గురించి చర్చించిన దాఖలాలు లేవు. వాటి నుండి రక్షణపై ఎలాటి షరతులూ లేవు. PTFE తయారీలో వాడే PFOA రసాయన చర్యలలో పాల్గొనదు. వాడిన మొత్తం వ్యర్ధంగా బయటకు వస్తుంది. దానిని నియంత్రించడం, నిర్మూలించడం సాధ్యం కాదు అందుకే వాడకాన్ని నిషేధించాయి.
సంపన్న దేశాలు. అంతర్జాతీయ ఒప్పందం కూడా వాడుక మానడం గురించే. ప్రస్తుతం గ్రాసిం ప్లాంటు విస్తరణ జరుగుతున్నది. మరో ప్రమాదం టిజివి ఎస్ ఆర్ ఎ ఎ సి ఎల్, గొందిపర్ల ఆవిష్కరిస్తున్నది. వీరు కూడా క్లోరీను వినియోగం పెంచుకోవడానికి క్లోరీను రసాయనాల తయారీ ప్రతిపాదనకు ToR పొందారు. ప్రజాభిప్రాయ సేకరణ తేదీ ప్రకటించారు. వీరు రోజుకి 40 టన్నుల PTFE తయారు చేస్తారట, అలాగే రోజుకి మొత్తం 25 టన్నుల కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉత్పత్తి చేయనున్నారు.
వీరి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో PFOA, R23 సమాచారం ఇవ్వలేదు. హాని సమాచారాన్ని దాచే కంపెనీ ఎంత బాధ్యతతో వ్యవహరిస్తుందో గుర్తించడం కష్టం కాదు. ప్రజల పట్ల, పర్యావరణం పట్ల కాలుష్య నియంత్రణ మండలి ఎలా వ్యవహరిస్తుందో తెలియని విషయం కాదు. దానికి సమర్ధతా లేదు చిత్తశుద్ధీ లేదు. PFOA లపై ప్రమాణం లేదు. నీటిలో, గాలిలో ఎంత మోతాదులో వుందో పరిశీలించగల వ్యవస్థ లేదు. నైపుణ్యం లేదు. ప్రజలనెవరు కాపాడతారు.
అక్కడ నీటిలో ప్రస్తుతం ఎంత PFOA వుందో ప్రాధమిక సమాచారం సేకరించ లేదు. పరిసర ప్రజల, ప్రత్యేకించి ఆ కంపెనీలో పని చేసే కార్మికుల, ఉద్యోగుల రక్త నమూనాలలో PFOA ఎంత వుందో పరిశీలించాలి. కనీస సామర్ధ్యాలు లేకుండా శాశ్వత రసాయనాల వాడుక రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం. కంపెనీ పక్కనే కృష్ణా నది వుంది. డ్యూపాంట్ ప్లాంటు తో ఇది సామ్యం. అక్కడ ఒహియో నది. దాని పరీవాహక ప్రాంత వాసులు అనారోగ్యం పాలయ్యారు. కొందరు కోర్టుకి వెళ్లి పరిహారం పొందారు. ఇక్కడ బాధితుల గోడెవరు పట్టించు కుంటారు.
ఇంతవరకూ PFOA లతో జరిగిన విధ్వంసం యొక్క భయానకమైన వాస్తవాలను మనం చూశాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న ప్రమాదం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాసిం మరియు టిజివి ఎస్ ఆర్ ఎ ఎ సి ఎల్ వంటి కంపెనీలు కేవలం లాభాల కోసం ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణంతో చెలగాటమాడుతున్నాయి.
కాలుష్య నియంత్రణ మండలి తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. కనీస సామర్థ్యాలు లేకుండా శాశ్వత రసాయనాల వాడుక రాష్ట్ర ప్రజలకు ఒక మరణ శాసనం లాంటిది.
కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పరిశ్రమలు భవిష్యత్తులో ఒహియో నది (Ohio River Chemical Accident) తరహా విషాదానికి దారితీయవచ్చు. హైదరాబాదు, అమరావతి ప్రజలు అదేనీరు తాగుతారు. లక్షకోట్లలో 4 భాగాలు PFOA వున్న నీరు తాగడానికి పనికి రాదు. ప్రస్తుత నీటి శుద్ధి వ్యవస్థలు PFOA లను తొలగించ లేవు. బాధితుల గోడు వినేదెవరు?
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మేల్కోండి! మన ఆరోగ్యం, మన పర్యావరణం మరియు మన భవిష్యత్తు కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం ఇది. శాస్త్రీయ దృక్పథంతో కూడిన అభివృద్ధిని మనం డిమాండ్ చేయాలి, లాభాపేక్షతో కూడిన విషపూరితమైన పరిశ్రమలను కాదు.
(డా. కలపాల బాబూరావు, ‘ప్రజల కోసం శాస్త్రవేత్తలు’ సభ్యుడు. హైదరాబాద్)