చంద్రచూడ్ చివరి తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలి?
రాజ్యాంగ స్పూర్తికీ, మార్కెట్ మాయాజాలానికి మధ్య పురుటినొప్పులు పడుతున్న భారత న్యాయవ్యవస్థకు చంద్రచూడ్ తన చివరి తీర్పుతో మంత్రసానిగా వ్యవహరించారా?
By : Admin
Update: 2024-11-26 08:54 GMT
-కొండూరి వీరయ్య
సాధారణంగా ఓ కుటుంబ పెద్ద మరణశయ్యపై ఉన్నప్పుడు పూర్వీకుల నుండి కాపాడుకుంటూ వచ్చిన వారసత్వాన్ని తరువాతి తరాలు కొనసాగిస్తాయా లేదా అని మనసు పీకుతూ ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా దాదాపు రెండేళ్లపాటు పని చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్‌కు కూడా పదవీ విరమణకు ముందు అలానే ఆందోళన కలిగినట్లుంది. చరిత్ర తనను ఎలా గుర్తు పెట్టుకుంటుందోనన్న ఆందోళనను ఆయన బాహాటంగానే వ్యక్తం చేశారు. పూనే సమీపంలో స్వగ్రామంలో జరిగిన అభినందన సభలో అయోధ్య తీర్పు గురించి వెల్లడించిన అభిప్రాయాల మొదలు అనేక వేదికల మీద వ్యక్తపరిచిన స్వగతాల వరకూ చంద్రచూడ్ స్పందనల్లో ఈ కోణాన్ని గమనించవచ్చు.
చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత పలువురు పలు రకాలుగా న్యాయవ్యవస్థకు ఆయన అందించిన తోడ్పాటును విశ్లేషించారు. వ్యాఖ్యానించారు. అంతగా విశ్లేషకుల దృష్టినాకర్షించని కోణం గురించి ఇక్కడ చర్చించుకుందాం.
రెండేళ్ల పాటు రాజ్యాంగ ధర్మాసనాలకు నాయకత్వం వహిస్తూ ఇచ్చిన తీర్పులను విశ్లేషిస్తే భారత న్యాయవ్యవస్థ దశ దిశల గురించి ప్రాధమిక అవగాహన కలుగుతుంది. చివరిగా తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి నాయకత్వం వహిస్తూ ఇచ్చిన తీర్పు చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులన్నిటిలోకీ విలక్షణమైనది. ఈ తీర్పుకున్న రాజకీయ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే మూడు దశాబ్దాలుగా రాజ్యాంగ స్పూర్తికీ, మార్కెట్ మాయాజాలానికి మధ్య పురుటినొప్పులు పడుతున్న భారత న్యాయవ్యవస్థకు చంద్రచూడ్ ఈ చివరి తీర్పుతో మంత్రసానిగా వ్యవహరించారని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత న్యాయవ్యవస్థకు ప్రపంచ దేశాల్లోని న్యాయవ్యవస్థకు మధ్య ఓ మౌలికమైన వ్యత్యాసం ఉంది. మన దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, స్వయంప్రతిపత్తినీ పరిరక్షించటానికి రాజ్యాంగం సంకల్పించింది. తదనుగుణంగానే మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రత్యేకించి న్యాయమూర్తుల నియామకం, న్యాయపాలనకు ఓ ప్రత్యేకమైన వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. మిగిలిన బ్యూరోక్రసీ తరహాలోనే న్యాయపాలకు అవసరమైన విలక్షణ బ్యూరోక్రసీ నిర్మాణానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఇతర ఉద్యోగులకు పదవీ విరమణానంతరం పెన్షన్ సదుపాయం కల్పించినట్లే న్యాయమూర్తులకూ కల్పించింది. ఇవన్నీ దేనికి? న్యాయమూర్తులు న్యాయపాలన విషయంలో ఎవరికీ తలొంచకుండా న్యాయ రక్షకులుగా వ్యవహరిస్తారన్న నమ్మకం,ఆశతో రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థకు అంతటి సర్వాధికారాలను కట్టబెట్టారు. కానీ గత ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగం తనపై ఉంచిన బాధ్యతలను నిస్పక్షపాతంగా నెరవేర్చటంలో తడబడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కాలం కీలకమైనది.
ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చివరి రోజుల్లో ఆయన మహారాష్ట్రకు చెందిన ప్రాపర్టీ ఓనర్సు అసోసియేషన్ కేసులో ఇచ్చిన తీర్పు గత మూడున్నర దశాబ్దాలుగా సంస్కరణల పట్ల న్యాయవ్యవస్థ రూపొందించుకుంటున్న అవగాహనకు పరాకాష్ట అని చెప్పవచ్చు.
ఈ కాలంలో న్యాయ వ్యవస్థే క్రమంగా సహజ న్యాయ సూత్రాలు, పార్లమెంట్ రూపొందించిన చట్టాలు, రాజ్యాంగ స్పూర్తికి దూరంగా జరుగుతున్న సందర్భాలెన్నో మనం చూశాము. ఉదాహరణకు కార్మిక హక్కుల విషయాన్ని కేస్ స్టడీగా తీసుకుందాం. ఈ పరిస్థితికి ముందు ఇందిరా గాంధీ దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, దానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాతంత్ర ఉద్యమం, సుప్రీం కోర్టుపై దాని ప్రభావం కీలకమైనది. భారత న్యాయ వ్యవస్థ ఈ మాత్రమైనా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఇంతకాలం మనగలిగిందంటే దానికి కారణం 1970, 1980 దశకాల్లో దేశం చవి చూసిన ప్రజాతంత్ర చైతన్యమే. దానికి తోడు జస్టిస్ క్రిష్ణయ్యర్, పిఎన్ భగవతి, ఓ చిన్నప్పరెడ్డి, డి ఎ దేశాయి వంటి వారు సుప్రీం కోర్టును రాజ్యాంగ విలువలు, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ వేదికగా మార్చారు. ఆ కాలంలోనే రాజ్యాంగంలోని ప్రాధకమిక హ్కులు, ఆదేశిక సూత్రాల ప్రేరణతో ఎక్కువ తీర్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే 1991కు ముందు వరకూ న్యాయ వ్యవస్థ కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు విషయంలో మౌలికంగా సృజనాత్మకంగా వ్యవహరించింది. ఎన్నో కీలకమైన కేసుల్లో కార్మికులకున్న చట్టబద్ధమైన హక్కులను కాపాడుకునేందుకు ఓ సాధనంగా వ్యవహరించింది. మినర్వా మిల్స్ కేసులో తీర్పు లాంటి అనేక తీర్పులు ఇచ్చింది. సమ్మె హక్కును కార్మికుల ప్రయోజనాలు కాపాడుకునేందుకు అనివార్యమైన సాధనంగా పరిగణించింది. కానీ 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత కార్మిక హక్కుల పట్ల సుప్రీం కోర్టు దృక్ఫధంలో క్రమంగా మార్పులు వచ్చాయి.
1991 లో దేశం ప్రపంచీకరణ వలయంలోకి ప్రవేశించింది. ప్రపంచీకరణ వలయాన్ని నిర్మించేది, శాసించేది పెట్టుబడి. పెట్టుబడికి తనదైన రాజ్యాంగం ఉంటుంది. అడ్డు అదుపు లేని లాభార్జనే దాని రాజ్యాంగం. కానీ భారత రాజ్యాంగం ఈ అడ్డు అదుపులేని లాభార్జన, సంపద కేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి హితవు అయినవి కావు అని తీర్మానించింది. దానికనుగుణంగానే రాజ్యాంగంలో ఆర్టికల్ 39 లాంటివి చేర్చింది. అంతేకాక పెట్టుబడికి నిర్నిరోధమైన హక్కులు, అవకాశాలు కల్పించటం కంటే మనిషి జీవితానికి, ప్రాణానికీ పెద్ద పీట వేసే ఆర్టికల్ 21 రాజ్యాంగంలో అంతర్భాగం అయ్యింది. 1970,80 దశకాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన అనేక తీర్పుల పర్యవసానంగా ఆర్టికల్ 21 పరిధి, పరిమితి బాగా విస్తృమయ్యాయి. ప్రపంచంలోనే వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాలకు పెద్ద పీట వేసిన రాజ్యాంగంగా, రాజ్యాంగ స్పూర్తిని గుర్తించి గౌరవించి ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం పని చేసే న్యాయ వ్యవస్థగా భారత న్యాయ వ్యవస్థ కీర్తి ప్రతిష్టలందుకున్నది. కానీ ఈ దిశ, దశ నుండి భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేకించి సుప్రీం కోర్టు 1991 తర్వాత క్రమంగా వైదొలగనారంభించింది. ఈ మార్పులను నిర్దిష్ట నేపథ్యంలో అర్థం చేసుకోవడానికి ఒకటి రెండు అంశాలకు సంబంధించి సుప్రీం కోర్టు దఫ దఫాలుగా ఇచ్చిన తీర్పులు, వ్యాఖ్యానాలను గమనిద్దాం.
1991 తర్వాత సుప్రీం కోర్టు మొట్టమొదటిగా ప్రజలు నిరసన తెలిపే హక్కు విషయంలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా తీర్పులు ఇవ్వటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో అంతిమంగా ప్రభుత్వ విధానాలపై పోరాటంలో భాగంగా ప్రజలు రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తా రోకోలు చేయకూడదన్న సారాంశంతో తీర్పులు వచ్చాయి. కాలక్రమంలో ప్రపంచీకరణ విధానాలు కార్మికులు వంద సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయన్న అవగాహన ఏర్పడిన తర్వాత ఆయా సందర్భాల్లో కొన్ని కార్మిక సంఘాలు, కొన్ని పరిశ్రమల్లో పని చేస్తున్న గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు తమ హక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాలను ఆశ్రయించటం మొదలు పెట్టాయి. చివరకు సుప్రీం కోర్టుతో సహా అనేక హైకోర్టులు కార్మికుల హక్కులపై పెట్టుబడి దాష్టీకాన్ని చూస్తూ మిన్నకుండిపోయాయి. ఇంకొన్ని సందర్భాల్లో కార్మికులు సమ్మె చేయకూడదనేంత వరకూ వెళ్లాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ తీర్పులు కార్మికుల ఉద్యోగభద్రతకున్న చట్టపరమైన పునాదులను కూలదోయానారంభించాయి. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ప్రైవేటు నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరుతున్న కార్మికులు వంటివారిని అసలు కార్మిక చట్టాల పరిధిలో గుర్తించటానికే న్యాయ వ్యవస్థ సిద్ధం కాలేదు. తద్వారా ప్రపంచీకరణ స్పూర్తికి అనుగుణంగా రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా న్యాయ వ్యవస్థ బాహాటంగా వ్యవహరించటం మొదలు పెట్టింది. తర్వాతి కాలంలో ఈ ధోరణి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు చక్కదిద్దాల్సిన బాధ్యతను విస్మరించటంగా మారింది. ప్రత్యేకించి గత పదేళ్ల కాలంలో ఈ ధోరణి బాగా పెరింగిందన్నది సాధారణ పరిశీలకులు కూడా గమనిస్తున్న అంశం.
ఈ ధోరణి అంతిమంగా వ్యక్తిగత స్వేఛ్చ, భావప్రకటనా స్వేఛ్చలకు స్వయంగా సుప్రీం కోర్టే ఉరితాడు బిగించే స్థాయికి చేరుకుంది. ఈ కాలంలో చర్చకు వచ్చిన నాలుగు ప్రధాన కేసుల విషయంలో సుప్రీం కోర్టు అనుసరించిన తీరు, ప్రత్యేకించి మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అనుసరించిన తీరును ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అవి భీమా కొరేగాం కేసు, ఢల్లీి అల్లర్ల కేసు, ఆర్టికల్ 370 రద్దు కేసు, పత్రికా స్వేఛ్చ కేసు, ఉమర్ ఖాలిద్ కేసులు. ఆయా కేసుల్లో ఉన్న ముద్దాయిలు, సందర్భాలు వేరైనా అన్నిటిలోనూ ఉన్న సారాంశం ఒక్కటే. ప్రాధమిక హక్కులు, రాజ్యాంగ ప్రమాణాల విషయంలో సుప్రీం కోర్టు ఈ కాలంలో రాజ్యాంగ స్పూర్తికి కట్టుబడి ఉన్నదా లేదా అన్నదే ఈ అన్ని కేసుల్లోనూ కీలకమైన చర్చనీయాంశం. ఆయా కేసులు నడిచిన తీరు తెన్నులు, న్యాయ వ్యవస్థ తీసుకున్న వైఖరి గమనిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించకుండా కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే బాధ్యతను సుప్రీం కోర్టు తీసుకోనిరాకరిస్తుందని స్పష్టమైంది. మరికొన్ని కేసుల్లో తప్పు జరిగిందని చెప్తూనే ఆ తప్పును సరిదద్దటానికి చంద్రచూడ్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చర్యలు తీసుకోకపోవడం మరో కొత్త ధోరణి. ఎలక్టొరల్ బాండ్స్, మహారాష్ట్ర ఫిరాయింపులు వంటి కేసులు ఈ కోవకు చెందుతాయి. అయోధ్య కేసుకున్న ప్రత్యేకత, ఆ కేసు విషయంలో సుప్రీం కోర్టు, చంద్రచూడ్ వ్యవహరించిన తీరు దానిలోని సహజ న్యాయ సూత్రాల వ్యతిరేక వైఖరి ఈ పాటికే దేశం ముందున్నాయి. అయితే ఆయా సందర్భాల్లో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా తీర్పులు ఇచ్చినా ఏనాడూ పూర్వపు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు తప్పు అని బాహాటంగా వ్యాఖ్యానించలేదు. ఆ విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాటించే కనీస సాంప్రదాయాన్ని సైత మాజీ ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్ గాలికొదిటులేసినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ కేసులో చంద్రచూడ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం.
ఈ కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, ఆ సందర్భంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యలు భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ స్పూర్తితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నదన్న చారిత్రక వాస్తవానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) దేశంలో సంపద కేంద్రీకరణకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశిస్తుంది. ఇక్కడ సంపద అన్న పదాన్ని జస్టిస్ క్రిష్ణయ్యర్ దేశంలోని యావత్ సంపద అన్న అవగాహనతో వ్యాఖ్యానించారు. ఇదే అవగాహన 2010లో దేశంలోని సహజవాయువు నిక్షిప్తాలపై రిలయన్స్ పెట్రో కెమికల్స్ కంపెనీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన న్యాయపోరాటంలో కూడా సుప్రీం కోర్టు దేశంలోని సహజ సంపదపై దేశ ప్రజలంరికీ హక్కు ఉంటుందని, తాత్కాలికంగా ఆయా సంపదలను దేశ ఆర్థిక అవసరాలకు వినియోగించే హక్కులు పొందిన వాళ్లు కేవలం జాతీయ సంపదకు ట్రస్టీలుగానే వ్యవహరించాలి తప్ప ఆ సంపద అంతా తమ సొత్తే అని సొంతం చేసుకోకూడదని కూడా తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు కూడా జస్టిస్ క్రిష్ణయ్యర్ వ్యాఖ్యానం ప్రమాణంగా ఉంది. కానీ చంద్రచూడ్ ప్రాపర్టి ఓనర్స్ అసోసియేషన్ కేసులో జస్టిస్ క్రిష్ణయ్యర్ తీర్పును ఖండిస్తూ ‘‘ క్రిష్ణయ్యర్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. భారత ఆర్థిక తాత్వికతను మార్క్సిస్టు దృక్కోణంతో ముడేయటానికి ప్రయత్నం చేశారని, ఇది రాజ్యాంగ నిర్మాతలు ప్రదర్శించిన వెసులుబాటు ధోరణికి భిన్నమైనది’’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగితే పరిస్థితి ఓ రకంగా ఉండేదేమో. ఆగకుండా క్రిష్ణయ్యర్ తీసుకున్న వైఖరి భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి అవరోధంగా మారిందని వ్యాఖ్యానించటం ద్వారా చంద్రచూడ్ తాను ప్రధాన న్యాయమూర్తి హోదాని, దానికి ఉన్న పరిధిని, పరిమితిని విస్మరించి వ్యవహరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ నాగరత్న కాలం మారిందికాబట్టి 1991 తర్వాత ఆర్థిక విధానాలు అమలు జోరు పెరిగింది కాబట్టి అంతకు ముందు జరిగిన పరిణామాలన్నిటినీ సంస్కరణల కళ్లద్దాలతో చూసి తప్పొప్పులు నిర్ధారించటం సరైనది కాదని తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ చర్చను ఇంతవరకే పరిమితం చేసి చూస్తే దాని తీవ్రత, పర్యవసానాలు అంత అర్థం కావు. కానీ 1991 నుండీ రాజ్యాంగ స్పూరి నుండి దారి మళ్లిన భారత న్యాయ వ్యవస్థ చంద్రచూడ్ హయాం వచ్చేసరికి పూర్తిగా సంస్కరణల ఉద్దేశ్యాలను, లక్ష్యాలను, ప్రయోజనాలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకునేదిగా మారింది. ఈ కోణం లో చూసినప్పుడు ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాజ్యాంగపు విలువల నుండి పక్కదారి పట్టే విషయంలో దోబూచులాడుతున్న న్యాయ వ్యవస్థ చంద్రచూడ్ మంత్రసానితనంతో ఇక మీదట అటువంటి దోబూచులాటలతో సంబంధం లేకుండా బాహాటంగానే ప్రపంచీకరణ, పెట్టుబడి ప్రయోజనాలు కాపాడే దిశగా ప్రయాణం ప్రారంభించనున్నది.
(రచయిత అడ్వకేట్, అనువాదకుడు, ప్రచురణకర్త, పౌర మేధావి)